జిల్లాకో సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్

పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం
-ప్రతి గ్రామానికి సురక్షిత తాగునీరు అందిస్తాం
-సీఎం కే చంద్రశేఖర్‌రావు స్పష్టీకరణ
-యశోదా దవాఖానలో ట్రిపుల్ ఎఫ్ విధానం ఆవిష్కరణ

KCR
రాష్ట్రంలోని ప్రతి జిల్లాకో సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌ను స్థాపించి పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు తెలిపారు. అన్ని గ్రామాల ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడమే తమ ధ్యేయమని చెప్పారు.

ఆదివారం హైదరాబాద్‌లోని యశోదా దవాఖానలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం కేసీఆర్ ట్రిపుల్ ఎఫ్ రేడియో సర్జరీ విధానాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ వైద్య రంగం అభివృద్ధితోపాటు రాష్ర్టాన్ని హరిత తెలంగాణ చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. క్లీన్ అండ్ గ్రీన్ పేరుతో పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. ఇప్పటివరకు కాగితాలకు పరిమితమైన పచ్చదనాన్ని ఇకపై తెలంగాణ అంతటా సాధ్యం చేసి చూపుదామన్నారు.

పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో కార్పొరేట్ హాస్పిటళ్లు తమకు సహకరించాలని కోరారు. కార్పొరేట్ హాస్పిటళ్లు సామాజిక స్పృహతో పేదలకు మరింతగా సేవ చేయాలని సూచించారు. తెలంగాణలోని విశిష్ఠ సంస్కృతి, ఆహార పద్ధతులు వల్ల ఇక్కడ క్యాన్సర్ వ్యాప్తిని సహజసిద్ధంగా నిరోధిస్తున్నాయని వైద్య నిపుణులు గుర్తించారని తెలిపారు. మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లో మాంసం పులుసును చింతపండుతో చేయడంద్వారా క్యాన్సర్ బారిన పడకుండా ప్రజలు స్వతహాగా మినహాయింపు పొందుతున్నారని గుర్తించినట్లు చెప్పారు. అయినప్పటికీ రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధి విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. వైద్య రంగంలో వస్తున్న అత్యాధునిక పరిజ్ఞానాన్ని, నూతన చికిత్సా విధానాలను ఎప్పటికప్పుడూ అందిపుచ్చుకుంటూ వైద్య సేవలను అందించడంలో యశోదా హాస్పిటల్ అగ్రగామిగా నిలుస్తున్నదన్నారు.

గతంలో క్యాన్సర్‌ను ప్రాణాంతకవ్యాధిగా పరిగణించేవారని, కానీ ప్రస్తుతం వైద్యరంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులతో క్యాన్సర్ నిర్మూలన సాధ్యమవుతున్నదని చెప్పారు. ఒకటి నుంచి మూడు రోజుల్లో క్యాన్సర్‌కు మెరుగైన అంతర్జాతీయ వైద్య సేవలను యశోదా హాస్పిటల్ అందుబాటులోకి తేవడం అభినందనీయమన్నారు.

ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ల్లో యశోదా దవాఖానకు చెందిన 200 మంది వైద్యుల సేవలను తీసుకుంటామని చెప్పారు. యశోదా హాస్పిటల్ ఎండీ డాక్టర్ జీఎస్ రావు మాట్లాడుతూ క్యాన్సర్ చికిత్సలో ట్రిపుల్ ఎఫ్ (ఫ్లాటనింగ్ ఫిల్టర్ ఫ్రీ) రేడియో థెరఫీ ఒక సంచలనం అన్నారు. తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌తో కలిసి నడుస్తామని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో క్యాన్సర్‌కు వైద్య సేవలు అందించడం ద్వారా యశోదా హాస్పిటల్ రికార్డు సాధించిందన్నారు. మైహోం సంస్థ చైర్మన్ జూపల్లి రామేశ్వర్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దూరదృష్టి, తెలంగాణ అభివృద్ధిపట్ల ఆయన ప్రణాళికాబద్ద్ధమైన కార్యదక్షత అమోఘమన్నారు. మంచి పాలనదక్షత ఉన్న కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య నిపుణులు, అంతర్జాతీయ వైద్యులు పాల్గొన్నారు.