జయశంకర్‌కు ఘననివాళి

– తెలంగాణ భవన్‌లో పుష్పాంజలి ఘటించిన సీఎం కేసీఆర్
– వేడుకలకు పెద్దఎత్తున హాజరైన పార్టీ నేతలు

KCR 001
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని బుధవారం తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉదయం 11.50 గంటలకు తెలంగాణ భవన్‌కు చేరుకుని జయశంకర్‌సార్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున భవన్‌కు తరలివచ్చారు. రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో జయశంకర్‌సార్ విగ్రహావిష్కరణ ఉండటంతో కేవలం కొద్ది నిమిషాలపాటే ముఖ్యమంత్రి భవన్‌లో గడిపారు.

వాహనం దిగి నేరుగా వరండాలోని జయశంకర్ విగ్రహం వద్దకు వచ్చి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రితోపాటు నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మెదక్ జిల్లా ఆందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్, డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డిలు జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. జయశంకర్‌సార్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో చిన్నారి అభినందన, గోల్డెన్ రాజు సంయుక్తంగా జయశంకర్ సార్, కేసీఆర్‌పై వేసిన చిత్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిత్రలేఖనంలో వారి సృజనాత్మకతను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు.

బంగారు తెలంగాణతోనే నివాళి: ఎంపీ కవిత
బంగారు తెలంగాణ సాధ్యంతోనే ప్రొఫెసర్ జయశంకర్‌సార్‌కు నిజమైన నివాళి అని నిజామాబాద్ ఎంపీ కే కవిత అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్‌సార్ బతికి ఉంటే తెలంగాణ రాష్ట్ర సాకారంపై ఎంతో సంతోషపడేవారని పేర్కొన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా బుధవారం తెలంగాణభవన్‌కు వచ్చిన ఆమె సార్ విగ్రహానికి నివాళులు అర్పించారు. జయశంకర్ సార్ ఆశయాలను నెరవేరుద్దాం అని నినాదాలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పది మంది ఉన్నా, పది లక్షల మంది ఉన్నా ఐదు దశాబ్దాల పాటు తెలంగాణ నినాదాన్ని అనునిత్యం కాపాడుకుంటూ వచ్చారని అన్నారు. జయశంకర్ చూపిన మార్గంలోనే తెలంగాణ పునర్నిర్మాణం కోసం సైనికుల్లా, ఆయన శిష్యులుగా నడుంబిగించి ముందుకు వెళ్తామన్నారు.

విలువలకు కట్టుబడిన వ్యక్తి
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 81వ జయంతి వేడుకలు రాష్ట్ర ఆర్థిక సంస్థలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ఈ చంగల్‌రాయలు మాట్లాడుతూ విలువలకు కట్టుబడిన వ్యక్తిగా జయశంకర్‌ను అభివర్ణించారు. కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గణేష్ వరప్రసాద్, కోశాధికారి రాపోలు సుదర్శన్, సీనియర్ అధికారులు కేఎస్ రావు, డీ సురేశ్, పీ శేషాద్రి శేఖర్, పీఎస్‌ఎస్ శేఖర్, ఎం విద్యాసాగర్, ఏ శివానందం, డిప్యూటీ జనరల్ మేనేజర్ సీహెచ్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.