జయహో కేసీఆర్

-పండుగలా రైతుబంధు
-కేసీఆర్ పథకానికి అపూర్వ ఆదరణ
-చెక్కులు, బుక్కులు అందుకొని జయజయధ్వానాలు చేస్తున్న రైతులు
-ఉదయం, సాయంత్రం పని వేగవంతం
-రాష్ట్రవ్యాప్తంగా 5,596 గ్రామసభలు
-చెక్కులను స్వచ్ఛందంగా తిరిగిచ్చేందుకు మొబైల్ యాప్, వెబ్‌పోర్టల్ రూపకల్పన
-4వ రోజు 1042 గ్రామాల్లో 12.86 లక్షల
-చెక్కుల పంపిణీ నాలుగురోజుల్లో మొత్తం 28 లక్షల చెక్కులు

రైతును రాజును చేయాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించిన రైతుబంధు పథకం పండుగలా సాగుతున్నది. సాగుకు స్వర్ణయుగాన్ని తీసుకొచ్చేందుకు అమలుపరుస్తున్న కార్యక్రమానికి రాష్ట్రమంతటా విశేష ఆదరణ కనిపిస్తున్నది. సాగు పెట్టుబడికి సాయం చేయడమనేది అపూర్వమని లబ్ధిదారులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. తమ మేలు కోరి చేపట్టిన ఈ పథకం అమలు చూసి జయజయధ్వానాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించిన రైతుబంధు పథకం జోరందుకుంది. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా నియమించిన బృందాలు ఉదయం, సాయంత్రం పనిని వేగవంతం చేయడంతో అధికసంఖ్యలో రైతులకు సాగు సాయం చెక్కులందుతున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు నిర్వహిస్తున్న చెక్కులు, పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో ఆనందంగా హాజరవుతున్నారు.

ఆదివారం ఒక్కరోజు రాష్ట్రంలోని 552 మండలాల్లోని 1042 గ్రామాల్లో రైతులకు సుమారు 12.86 లక్షల చెక్కులు, పాస్‌బుక్కులను పంపిణీ చేసినట్లు వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రవ్యాప్తంగా 5596 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి సుమారు 28 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ ఈ నాలుగు రోజుల్లో సగటున రోజుకు 6.50 లక్షల చెక్కులను అందజేసినట్లయింది. మొదటి రెండురోజులు కొంత ఆలస్యమయిందని, శని, ఆదివారాల్లో చెక్కుల పంపిణీ కార్యక్రమం ఊపందుకున్నదని అధికారులు తెలిపారు. ఆదివారం పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు రైతుబంధు కార్యక్రమంలో పాల్గొని చెక్కులను పంపిణీ చేశారు.

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూరు, మెదక్ జిల్లా మక్తభూపతిపూర్, సంగారెడ్డి జిల్లా న్యాలకల్ గ్రామాల్లో జరిగిన రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్ ఎంపీ కవిత, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు, జిల్లా రైతు సమన్వయసమితి కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట, రుద్రంగి, తంగళ్లపల్లిలో ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, వేములవాడ ఎమ్మెల్యే రమేశ్, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్‌లతో కలిసి రైతులకు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో స్పీకర్ మధుసూదనాచారి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి చందూలాల్, వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్‌రావుపేటలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట , సైదాపూర్ మండలం బొమ్మకల్, వీణవంక మండలం కనగర్తిలో ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి జోగు రామన్న, నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం నుజ్జుగూడెంలో రోడ్లుభవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి లక్ష్మారెడ్డి పాల్గొని రైతులకు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశారు. విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం గట్టికల్, ముక్కుడుదేవులపల్లి, నల్లగొండ జిల్లా నల్లగొండ మండలం కంచనపల్లి గ్రామాలలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డిలతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు చెక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు.

వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం దుగ్గాపూర్, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ, ఇబ్రహీంపట్నం భగాయత్ గ్రామాలలో రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కాల్వరాలలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, జనగామ జిల్లా బచ్చన్నపేట మం డలం బండనాగారంలో ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, పెద్దపల్లి జిల్లా ధర్మారం, మంథని, పెద్దపల్లి మండలాల్లో ఎంపీ బాల్క సుమన్, ప్రభుత్వ సలహాదారు వివేక్, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, యాదాద్రి జిల్లా బొమ్మలరామారంలో ఎంపీ బూరనర్సయ్యగౌడ్, వనపర్తి జిల్లాలో ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, తదితర ప్రజాప్రతినిధులు రైతుబంధు కార్యక్రమంలో పాల్గొన్నారు.