జయహో కాళేశ్వరం

-హరిత తెలంగాణకు తొలిగిన అడ్డంకి
-2017 చట్టం ద్వారా భూసేకరణ చేసుకోవచ్చు
-పునరావాసం, పునర్నిర్మాణంలోనూ ఇదే వెసులుబాటు
-తుది అనుమతినిచ్చిన కేంద్ర పర్యావరణశాఖ
-ఇక ప్రాజెక్టు పనులు వేగవంతం.. ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం

కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అడ్డంకులూ తొలిగిపోయాయి. హరిత తెలంగాణ ఆవిష్కరణకు మార్గం సుగమమయింది. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం(2017 చట్టం) ప్రకారం ప్రాజెక్టు కోసం భూసేకరణ చేసుకోవచ్చునని కేంద్ర పర్యావరణశాఖ తన తుది ఆదేశాల్లో స్పష్టంచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణమండలి షరతులు విధించిందనీ, అవరోధాలు కల్పించిందనీ కొన్ని పత్రికలు పెట్టిన పిల్లి శాపనార్థాలు దూది పింజల్లా తేలిపోయాయి. ప్రాజెక్టుకు అనుమతులు సాధించడంకోసం ప్రభుత్వం అహోరాత్రులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణశాఖ తుది అనుమతులు రావడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తంచేశారు. ఏడాదిలోపే ప్రాజెక్టును పూర్తిచేసి గోదావరి జలాలతో తెలంగాణ పంటపొలాల దాహార్తి తీర్చుతామని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు. ఇక అత్యంత వేగంగా పనులు జరిపిస్తామని ఆయన అన్నారు. పర్యావరణశాఖ తాజాగా ఇచ్చిన అనుమతి పత్రం పార్టు-ఏ, నిర్దిష్ట నిబంధనల్లో మూడో నిబంధన ప్రకారం తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన సవరణ చట్టం 2017 ప్రకారం భూసేకరణ చేయవచ్చునని పేర్కొంది. దీంతో భూసేకరణకు ఉన్న అవరోధాలన్నీ తొలిగిపోయాయి. రైతులకు అత్యంత ప్రయోజనకరమైన ప్యాకేజీ ఇచ్చి భూసేకరణ పూర్తి చేయవచ్చునని పర్యావరణశాఖ ఆదేశాలు చెప్తున్నాయి.

ఈ మేరకు పర్యావరణశాఖ డైరెక్టర్ డాక్టర్ ఎస్ కెర్‌కెట్ట అనుమతి లేఖను కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ హరిరాంకు పంపించారు. ఈ అనుమతి లేఖ పదేండ్లపాటు చెల్లుబాటు (వ్యాలిడ్)లో ఉంటుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటూ కొద్దిరోజుల క్రితం కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ పరిధిలోని నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) కేంద్రానికి సిఫార్సు చేసింది. అయితే కమిటీ సిఫార్సుల్లో విధించిన పలు షరతుల్లో ప్రాజెక్టు భూసేకరణలో భాగంగా భూమిని కోల్పోతున్న వారికి భూసేకరణ చట్టం-2013 ప్రకారం పరిహారం చెల్లించాలని సూచించింది. అయితే, ఇది కేవలం కమిటీ సిఫార్సు మాత్రమే. కానీ కొన్నిశక్తులు దీన్నొక అడ్డంకిగా.. బూచిగా చూపుతూ దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నించాయి. కమిటీ సిఫార్సుల్లో ఈ అంశం ఉండటంపై ప్రాజెక్టు వ్యతిరేకశక్తులు ఒకవిధంగా సంబురపడ్డాయి. కానీ రోజుల వ్యవధిలోనే ఈ కుట్రలు కూడా పటాపంచలయ్యా యి. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో బీడు భూము ల్లో గోదావరిజలాలను పారించి… రాష్ట్ర రైతాంగాన్ని రక్షించుకోవాలనే సంకల్పానికి మద్దతు లభించింది. ఈఏసీ కమిటీ సిఫార్సుల్లో.. భూసేకరణ చట్టం-2013 ప్రకారం భూమిని కోల్పోయేవారికి పరిహారం ఇవ్వాలని సూచించినప్పటికీ మంత్రిత్వశాఖ డైరెక్టర్ జారీచేసిన అనుమతి లేఖలో మాత్రం ప్రత్యామ్నాయాన్ని కూడా అమలుచేసేందుకు వెసులుబాటు కల్పించటంతో ప్రాజెక్టు వ్యతిరేకశక్తుల నోట్లో పచ్చివెలక్కాయ పడ్డట్టయ్యింది.

అనుమతి లేఖలోని ముఖ్యాంశాలు
రాష్ట్ర అటవీశాఖ సమన్వయంతో 32.83 చదరపు కిలోమీటర్ల పరీవాహక ప్రాంతంలో రూ.362.04 కోట్ల వ్యయంతో ప్రణాళికను అమలుచేయాలి. ఈ ప్రాజెకుల్టో 34,684 హెక్టార్ల మేర భూమిని సేకరించడం జరుగుతుంది. పునరావాసం, పునర్నిర్మాణం (ఆర్‌అండ్‌ఆర్) ప్రయోజనాలను భూసేకరణ చట్టం-2013 ప్రకారం అమలుచేయాలి. ఇదికాకుండా ప్రాజెక్టు ద్వారా భూమిని కోల్పోతున్నవారికి పరిహారం చెల్లించేందుకు అందుబాటులో ఇంకేదైనా చట్టం ఉంటే దాని ప్రకారం ప్రయోజనాలను కల్పించాలి. భూసేకరణ చట్టం-2013ను అనుసరించి తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ భూసేకరణ సవరణ చట్టం (21/2017) ప్రకారం భూసేకరణ చేపట్టి ప్రాజెక్టు పనులను కొనసాగించాలి. ఆర్‌అండ్‌ఆర్ ప్రక్రియను పర్యవేక్షించేందుకుగాను ప్రాజెక్టు నిరాశ్రయుల నుంచి కొందరు వ్యక్తులను ప్రతినిధులుగా ఎంపికచేసి కమిటీని ఏర్పాటుచేయాలి. అందులో ఎస్సీ, ఎస్టీ క్యాటగిరీలతోపాటు కచ్చితంగా మహిళా ప్రతినిధి కూడా ఉండాలి. ప్రాజెక్టు వల్ల ఉత్పత్తయ్యే 1,480 లక్షల క్యూబిక్ మీటర్ల వ్యర్థాలను (నిర్మాణానికి సంబంధించిన) కాల్వలకు ఇరువైపులా, సొరంగ నిర్మాణాల ప్రవేశ, వెలుపలికి వచ్చే ప్రాంతాల్లో వినియోగించటంతో పాటు ఇతరత్రా మార్గాల్లో నిక్షిప్తంచేయటం వంటి చర్యలు చేపట్టాలి. ఇందుకు కేటాయించిన రూ.32.79 కోట్ల నిధులను వాటికే వినియోగించాలి. ప్రత్యామ్నాయ అడవుల వృద్ధి కోసం కేటాయించిన రూ.722.30 కోట్లను కూడా అవే పనులకు వినియోగించాలి. ఇంకా ప్రాజెక్టు పరిధిలో పర్యావరణానికి విఘాతం కలగకుండా ఏయే అంశాల్లో ఎలాంటి చర్యలు చేపట్టేందుకు నిర్ణయించారో.. అందుకు కేటాయించిన నిధులను వాటికే వెచ్చించాలని పేర్కొన్నారు.