జాతీయ పార్టీల ఖేల్ ఖతం

జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్, బీజేపీలకు దాదాపుగా కాలం చెల్లింది. మొన్న ఢిల్లీ, నిన్న బీహార్ ఎన్నికల్లో ప్రజలు సరైన సమాధానం చెప్పారు. ప్రాంతీయపార్టీలే విజయబావుటా ఎగుర వేశాయి. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ, సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీచేసి ఓడిపోయారు. అక్కడి ప్రజలు తిరస్కరించిన అభ్యర్థిని చెల్లనినోటుగా తిప్పిపంపితే, మళ్లీ వరంగల్ ప్రజలు ఆమోదిస్తారా? అందుకే వెనక్కి పంపాల్సిన అవసరం ఉన్నదిఅని పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

Etela Rajendar election campaign in Parakal Constituency

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఉదయం హన్మకొండలోని జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియంలో మార్నింగ్‌వాక్‌లో వాకర్స్‌తో, సీపీరెడ్డికాలనీ కాంప్లెక్స్‌లో, టీఆర్‌ఎస్ అర్బన్ కార్యాలయంలో టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడారు. స్థానిక అభ్యర్థులు దొరక్క కాంగ్రెస్ హైదరాబాద్ నుంచి, బీజేపీ అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నాయని ఎద్దేవాచేశారు. పుట్టినగడ్డపై పుట్టిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, ప్రజాకవి కాళోజీ నారాయణరావులకు ఉమ్మడి రాష్ట్రంలో గుర్తింపు రాలేదన్నారు.
-భవిష్యత్ ప్రాంతీయ పార్టీలదే : మంత్రి కేటీఆర్
-ప్రతిపక్షాలకు రెండోస్థానం: మంత్రి హరీశ్‌రావు
-దయాకర్‌కు మెజార్టీ ఖాయం: మంత్రి ఈటల
-విపక్షాలకు ఓట్లడిగే హక్కులేదు: మంత్రి జగదీశ్‌రెడ్డి

 

స్వరాష్ట్రంలో అగ్రికల్చర్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్‌సార్ పేరు, హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ పేరు పెట్టుకున్నామన్నారు. తర్వాత హన్మకొండ చౌరస్తాలో వ్యాపారవాణిజ్య సముదాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించి టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్‌ను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ విదేశాల నుంచి అభ్యర్థిని దిగుమతి చేసుకొని అంతర్జాతీయ పార్టీగా మారిన బీజేపీ ఇక్కడెందుకని ప్రశ్నించారు. కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ సీతారాంనాయక్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి పాల్గొన్నారు.

Harish Rao election campaign in warangal east001

కాంగ్రెస్‌కు ఓటేస్తే మోరీలో వేసినట్లే: మంత్రి హరీశ్‌రావు
కాంగ్రెస్, బీజేపీలు రెండో స్థానం కోసం పోటీపడుతున్నాయి. బీహార్ ఎన్నికల ఫలితాలతో బీజేపీ ఖతమైంది. కాంగ్రెస్‌కు ఓటేస్తే మురికి కాల్వలో వేసినట్లేఅని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని దేశాయిపేటలో ఆయన ప్రచారం చేశారు. వరంగల్‌లో పసునూరి దయాకర్ విజయం ఖాయమైందన్నారు. రాష్ట్ర చిహ్నంలో కాకతీయుల తోరణం ఏర్పాటు చేసి వరంగల్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మంత్రి వెంట డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎంపీ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బోండకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, వరంగల్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, టీఆర్‌ఎస్ గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు నన్నపనేని నరేందర్, డాక్టర్ జేఎస్ పరంజ్యోతి తదితరులు ఉన్నారు.

ప్రతిపక్షాలకు పరాజయం తప్పదు: మంత్రి ఈటల
భవిష్యత్ అంతా ప్రాంతీయ పార్టీలదేనని, జాతీయ పార్టీలను ప్రజలు విశ్వసించడంలేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. పరకాల రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. బీహార్ ప్రజల తీర్పే దీనికి నిదర్శనమని, వరంగల్‌లో అలాంటి తీర్పే రానున్నదన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను చూసి ఇతర దేశాలే ఆదర్శం గా తీసుకుంటున్నాయని తెలిపారు. మంత్రి వెంట ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, టీఆర్‌ఎస్ నేతలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, మొలుగూరి భిక్షపతి ఉన్నారు.

Jagadish reddy election campaign in Kondur

తెలంగాణను ఎండబెట్టినోళ్లకు ఓట్లా: మంత్రి జగదీశ్‌రెడ్డి
ప్రభుత్వం పథకాలే దయాకర్ విజయానికి దోహదం చేస్తాయని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. రాయపర్తి మండలం కొండూరు, కొడకండ్ల సభల్లో, తొర్రూరులో ఉపాధ్యాయ సంఘాలు, విద్యాసంస్థల యాజమాన్యాల సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధి, పథకాలపై ఏ ప్రాంతంలోనైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. తెలంగాణ గ్రామాలను శ్మశానవాటికలుగా, సాగు భూములను బీళ్లుగా మార్చినందుకు ప్రతిపక్షాలకు ఓట్లేయ్యాలా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని అభాసు పాల్జేసేందుకు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తన పత్రికలో అబద్ధపు రాతలతో విషం చిమ్ముతున్నాడని, ఆ రాతలు చూసి ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రచారంలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గాదరి కిశోర్, మాజీ ఎమ్మెల్యేలు సుధాకర్‌రావు, ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.

Indrakaran Reddy campaigning at Zaffergad Mandal

గ్రామాల సమగ్రాభివృద్ధే ధ్యేయం: మంత్రి అల్లోల
గ్రామాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని గృహనిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. జఫర్‌ఘడ్, రఘునాథపల్లి మండలాల్లో సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి ప్రచారం చేశారు. పసునూరి దయాకర్‌ను ప్రజలు ఆశీర్వదించి అఖండ మెజార్టీతో గెలిపించి సీఎంకు కానుకగా అందించాలని కోరారు.