జనవరి నుంచి తెలంగాణ పల్లె ప్రగతి

సకలజనుల సమ్మె కాలంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగుల 36 రోజుల సమ్మె కాలాన్ని రెగ్యులరైజ్ చేసేందుకు సెర్ప్ పాలకమండలి సూత్రప్రాయంగా అంగీకరించింది. ప్రపంచ బ్యాంకు సహకారంతో రాష్ట్రంలో చేపట్టనున్న తెలంగాణ గ్రామీణ సమీకృతాభివృద్ధి ప్రాజెక్టు (టీఆర్‌ఐజీపీ)ని వచ్చే జనవరి నుంచి తెలంగాణ పల్లె ప్రగతి పేరుతో ప్రారంభించాలని పాలకమండలి సమావేశం నిర్ణయించింది. పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో సెర్ప్ మొదటి సమావేశం జరిగింది.

KTR

-గ్రామీణ సమ్మిళితాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
-సెర్ప్ ఉద్యోగుల 36రోజుల సమ్మెకాలం రెగ్యులరైజ్
-గ్రామీణ పౌరసేవా కేంద్రాల నిర్వహణ మహిళలకే..
-సెర్ప్ పాలకమండలి తొలి సమావేశంలో నిర్ణయం
-నవంబర్ ఎనిమిది నుంచి కొత్త పింఛన్ల పంపిణీ
-పింఛన్ల పథకానికి ఆసరా పేరు ప్రతిపాదన
-పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి
29 అంశాలతో కూడిన ఎజెండాపై చర్చించింది. సంస్థ అంతర్గత విషయాలపై పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు సహకారంతో చేపట్టబోతున్న తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎంపికచేసిన 150 మండలాల్లోని సుమారు 1500 గ్రామాల్లో సమ్మిళితాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమంలోభాగంగా గ్రామాల్లో ఏర్పాటు చేయబోయే పౌరసేవా కేంద్రాల (వన్ స్టాప్ షాపు) నిర్వహణకు ఆయాగ్రామాల్లోని విద్యావంతులైన మహిళలకే అవకాశం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

సెర్ప్ పనితీరు, సంస్థ చేపట్టిన కార్యక్రమాలను మంత్రి అభినందించారు. సేవలను మరింత మెరుగుపర్చుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. నవంబర్ 8 నుంచి ఇవ్వనున్న పింఛన్లపై కూడా పాలకమండలి సమావేశంలో చర్చించారు. సీఎం నిర్ణయించినట్లుగా నవంబర్ నుంచి పెరిగిన పింఛన్ల పంపిణీకి సిద్ధంగా ఉండాలని సెర్ప్ అధికారులను మంత్రి ఆదేశించారు.

పింఛన్ లబ్ధిదారుల సౌకర్యం కోసం పింఛన్ల చెల్లింపుకు పేపర్ కార్డులను తయారు చేయాలని పాలకమండలి నిర్ణయించింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు వేర్వేరు రంగులతో కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రతికార్డుపైనా ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ మొత్తంతోపాటు లబ్ధిదారుడి ఫొటో, పంపిణీ సందర్భంగా తలెత్తే సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్‌ను ముద్రించాలని నిర్ణయించారు. పింఛన్ల పథకానికి చేయూత, ఆసరా, నమ్మకం, భరోసా, ఊరట, భద్రం, సాంత్వన లాంటి పేర్లను పరిశీలించిన పాలకమండలి, చివరకు ఆసరా పేరును సూత్రప్రాయంగా ఖరారుచేసింది. దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన వడ్డీలేని రుణాలు పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారిక ప్రకటన చేస్తారని, వడ్డీలేని రుణాల బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని తెలిపారు. సెర్ప్ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ తుది నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని తీర్మానించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ వెంకటేశ్వర్లు, సెర్ప్ సీఈవో మురళితోపాటు పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.