జలహారం పనుల్లో జాప్యం వద్దు

-వీడియో, టెలీ కాన్ఫరెన్స్ వ్యవస్థ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్
జలహారం పనులు ఫిబ్రవరి మొదటివారంలో ప్రారంభించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. జలహారం పనులను ఎట్టిపరిస్థితుల్లోనూ జాప్యం చేయవద్దని స్పష్టం చేశారు. ఈ నెలాఖరునాటికి లైన్ సర్వే పూర్తి చేయాలన్నారు. ఇన్‌టేక్ వెల్ టెండర్లు కూడా ఆలోగానే పిలువాలని పేర్కొన్నారు. ఇన్‌టేక్‌వెల్స్ నిర్మాణం వచ్చే మే నెల ముగిసే వరకు సెప్ స్టేజ్‌కి రావాలని, దీని బాధ్యత పూర్తిగా ఎస్‌ఈలదేనని స్పష్టం చేశారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని కేటీఆర్ సోమవారం ప్రారంభించారు.

KTR-Review-on-Jalaharam

జలహారం కార్యాలయాల నెట్‌వర్క్ మొత్తాన్ని వీడియో, టెలీకాన్ఫరెన్స్‌తో అనుసంధానం చేసే ప్రక్రియలో భాగంగా జిల్లా ఎస్‌ఈ, కేంద్ర ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని ప్రారంభించారు. వాటర్‌గ్రిడ్ పనులను మంత్రి కేటీఆర్ జిల్లాల వారిగా సమీక్షించారు. ఇన్‌టేక్‌వెల్స్ నిర్మాణంలో అనుభవం, నిర్మాణ సామర్థ్యం ఉన్న కంపెనీలకే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

జలహారానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా పరిపాలన అనుమతులు గంటల్లోనే ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వచ్చే నెలలో నల్లగొండలో ప్రారంభించబోయే పైలాన్ పనులపై సమీక్ష నిర్వహించారు. జలహారం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు మంత్రి కేటీఆర్ మహబూబ్‌నగర్ జిల్లా ఎల్లూరులో పర్యటించనున్నారు.

-పంచాయతీలు విద్యుత్ బకాయిలు చెల్లించాలి
గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా నిధులన్నీ నేరుగా గ్రామ పంచాయతీలకే ఇచ్చినందున పేరుకుపోయిన విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలని మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. రూ.1350 కోట్ల 13వ ఆర్థిక సంఘం నిధుల్లో 70 శాతం నేరుగా పంచాయతీలకు ఇచ్చినందున పాత బకాయిలన్నీ చెల్లించాలన్నారు.

సచివాలయంలోని డీ బ్లాక్‌లో విద్యుత్ శాఖ మంత్రి సీ లకా్ష్మరెడ్డితోపాటు డిస్కమ్‌ల విద్యుత్ అధికారులు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్‌ను ఆదేశించారు. డిస్కమ్‌ల సీఎండీలు రఘుమారెడ్డి, వెంకట్‌నారాయణ, ఇంధన శాఖ సెక్రటరీ అరవింద్ కుమార్, పంచాయతీ కమిషనర్ మురళి, అధికారులు పాల్గొన్నారు.

-కేటీఆర్‌ను కలిసిన నీతి ఆయోగ్ సభ్యుడు సారస్వత్
నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావును సోమవారం సచివాలయంలో మంత్రి చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రభుత్వ సలహాదారు పాపారావుతో కలిసి నీతి ఆయోగ్ ఫుల్‌టైం సభ్యుడు సారస్వత్ మంత్రిని కలిశారు.