జలహారం పనులను వేగవంతం చేయండి

ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీరు అందించే తెలంగాణ జలహారం పనులను చిత్తశుద్ధితో, వేగంగా చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. జలహారం కార్యక్రమంపై మంగళవారం సచివాలయంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అధికారులు పనుల పురోగతిని సీఎంకు వివరించారు. జలహారానికి నీటిని సమకూర్చుతున్న వనరులు, నీటిని తరలించే ప్రాంతాల గురించి మ్యాప్‌ల ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జలహారం పనులను మంచి నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించాలని సూచించారు.

KCR-review-on-Watergrid

-అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
-పనుల పురోగతిపై సమీక్ష
ఎక్కడికక్కడ ఎత్తైన ప్రాతాలకు నీటిని లిఫ్టు చేసి.. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా గ్రామాలకు నీరు అందించడానికి ప్రాధాన్యమివ్వాలని అధికారులను ఆదేశించారు. నీటిని లిఫ్టు చేయడానికి ఒకే మోటారు, ఒకే పైపులైను మీద ఆధారపడవద్దని, అవసరమైనచోట ఎక్కువ మోటార్లు, అదనపు పైపులైన్లు ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు, విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్-ఇన్-చీఫ్ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.