జలహారంపై ప్రతివారం సమీక్ష

-పనులు సకాలంలో పూర్తిచేయండి
-పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులు
-సమీక్షలో అధికారులకు సీఎం ఆదేశం
రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీరు, పంటలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. ప్రతివారం జలహారంపై సమీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పనులు జరుగుతున్న తీరును పరిశీలించడానికి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూనే.. పనులు నిర్ణీత కాలవ్యవధిలో జరిగేలా కార్యాచరణను రూపొందించుకోవాలని సూచించారు.

KCR review on Jalaharam

బుధవారం సచివాలయంలో జలహారం, నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. సాగునీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్, అటవీశాఖ మంత్రి జోగురామన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి రేమండ్‌పీటర్, నీటిపారుదలశాఖ కార్యదర్శి ఎస్కే జోషి తదితర అధికారులు పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో తాను జరిపిన పర్యటన వివరాలను చెప్పిన మంత్రి కేటీఆర్.. జలహారం పనుల పురోగతిని వివరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ నీటిపారుదల, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూ ఎస్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి.. సకాలంలో లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. జలహారం పనులు విస్తృతస్థాయిలో జరుగుతున్నాయని, పనుల వేగం పెంచి లక్ష్యాన్ని పూర్తిచేయడానికి రిటైర్డ్ ఇంజినీర్ల సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. పనులు జరిగే సమయంలో ఆయా పైప్‌లైన్లు రహదారులు, రైల్వేలైన్లు, కాలువలు, అటవీ భూములు దాటిపోవాల్సి వస్తుందని, ఆ సమయంలో ఇతర శాఖలతో సమన్వయం అవసరం ఏర్పడుతుందన్నారు.

వీటిని పరిశీలించి సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేకంగా అధికారులను నియమించాలని సూచించారు. జలహారం పనుల కోసం ఇంటేక్‌వెల్ నిర్మించే క్రమంలో అవసరమైన నీటిని కేటాయించి విడుదల చేయాలని నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని సీఎం సూచించారు. నీటి పారుదల ప్రాజెక్టులను కూడా నిర్ణీత సమయంలో పూర్తిచేసి రాష్ట్రంలో వీలైనంత ఎక్కువ భూమిని సాగులోకి తీసుకురావాలని చెప్పారు. ఈ సందర్భంగా సాగునీటిశాఖ అధికారులు.. కల్వకుర్తి, పాలమూరు, కంతనపల్లి, నక్కలగండి తదితర ప్రాజెక్టుల పురోగతిని సీఎంకు వివరించారు.