జలఉద్యమంలా మిషన్ కాకతీయ

ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ సాధించుకున్నట్లుగానే, పునర్నిర్మాణంలో భాగంగా చేపట్టనున్న మిషన్ కాకతీయ అనే జలఉద్యమాన్ని విజయవంతం చేద్దాం. సాగునీటి డీఈలు పనిచేస్తున్న చోటే నివాసం ఉంటేనే ఈ కార్యక్రమం విజయవంతమవుతుంది. మండలస్థాయిలో అధికారులు అప్‌అండ్‌డౌన్ విధానాన్ని కొనసాగిస్తే అసలుకే మోసం వస్తుంది. సరిపడా సిబ్బంది లేకపోతే మండలాల వారీగా వర్క్‌ఇన్స్‌పెక్టర్లను, టెక్నికల్ అసిసెంట్లను తీసుకోవాలి, ఎక్కడిక్కడ ఎస్‌ఈలు భర్తీకి ఏర్పాట్లు చేసుకోవాలిఅని భారీనీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు.
-అధికారులు అప్ అండ్ డౌన్లు చేస్తే లక్ష్యం నెరవేరదు

Harish Rao review meet on Mission Kakatiya in Warangal

-మండలానికో వర్క్‌ఇన్‌స్పెక్టర్, టెక్నికల్ అసిస్టెంట్లను తీసుకోవాలి
-శాఖల సమన్యయమే బృహత్కార్యానికి శ్రీరామరక్ష
-మిషన్ కాకతీయ అవగాహన సదస్సులో మంత్రి హరీశ్‌రావు
మంగళవారం వరంగల్ జిల్లా కేఎంసీ ఎన్‌ఆర్‌ఐ ఆడిటోరియంలో మిషన్ కాకతీయపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత కలెక్టరేట్‌లో సుదీర్ఘ సమీక్షలు నిర్వహించారు.

మిషన్ కాకతీయపై అవగాహన కల్పించాలి
ప్రజాప్రతినిధులు మండలాల వారీగా మిషన్ కాకతీయపై జనచైతన్య సదస్సులు నిర్వహించాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కళాకారులను వినియోగించుకొని ఊరూరా ప్రచారం చేయాలని, విద్యార్థులకు మిషన్ కాకతీయపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని డీఈవోలకు సూచించారు. నియోజకవర్గానికో మినీట్యాంక్‌బండ్‌ను నిర్మించాలని అధికారులకు సూచించారు. చెరువులను దత్తత తీసుకొని పునరుద్ధరించేందుకు ముందుకొచ్చేవాళ్లను ప్రోత్సహిస్తామన్నారు.

ఎన్నారైలు, వర్తక, వ్యాపారులు, రాజకీయనాయకులు చివరికి అధికారులైనా ముందుకొస్తే వాళ్లుకోరుకున్న పేరును ఆ చెరువుకు పెడతామని వెల్లడించారు. చెరువును ఊరుమ్మడి ఆస్తిగా భావించి పునరుద్ధరణలో ప్రతిఒక్కరూ భాగస్వాములయ్యేలా చూడాల్సిన బాధ్యత సర్పంచ్ నుంచి మంత్రిపై ఉందన్నారు. మిషన్ కాకతీయ సాగునీటిశాఖ పని అని చూడకుండా అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఐదు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 9వేల చెరువుల్ని పునరుద్ధరించాలనేది సర్కారు లక్ష్యమని వివరించారు.

ఐదేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా 45వేల చెరువుల పునరుద్ధరణ చేపడుతామన్నారు.ఎంపిక చేసిన చెరువులకు నెలాఖరుకల్లా టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి జనవరి నుంచి మే చివరినాటికి పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. నాణ్యత పాటించకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. చెరువుల పూడికను రైతుల పొలాలకు చేరేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

శిఖంలో ఏక్‌సాల్‌పట్టా ఉన్న వాళ్లకు తొలిప్రాధాన్యం
కాకతీయులు నిర్మించిన చెరువులు ప్రపంచానికి ఎట్లా ఆదర్శంగా నిలిచాయో అదేరీతిగా శాశ్వత కరువును పారద్రోలేందుకు కాకతీయుల మార్గాన్ని ఎంచుకున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శిఖం భూముల్లో ఎస్సీ,ఎస్టీ రైతులకు గతంలో ఇచ్చి న ఏక్‌సాల్ పట్టా భూములను అవసరమైతే స్వాధీనం చేసుకొని దళితులకు ఇచ్చే మూడు ఎకరాల్లో పథకంలో తొలిప్రాధాన్యం కల్పిస్తామని వెల్లడించారు.

గోదావరి, కృష్ణా నుంచి తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటిని అడ్డుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు ఎత్తిపోతల పథకం, జూరాల-పాఖాల ప్రాజెక్టులను చేపడుతుంటే అడ్డుపడుతూ కేంద్రానికి లేఖ రాస్తున్నారని ఆగ్రహించారు. పోతిరెడ్డిపాడుకు, హంద్రీనీవాకు అనుమతులు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. గోదావరిపై నిర్మిస్తున్న దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని రెండేండ్లలో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

30 ఎకరాల్లో ప్రపంచస్థాయి ఫ్రూట్ మార్కెట్
వరంగల్‌లో అత్యాధునికమైన ప్రపంచస్థాయి ఫ్రూట్ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని హరీశ్‌రావు ప్రకటించారు. ఏనుమాముల మార్కెట్ యార్డులో ఐదు వేల మె ట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన రెండు కోట్ల విలువైన కవర్ షెడ్‌ను, రూ.40 లక్షలతో నిర్మించిన క్యాంటీన్‌ను ప్రారంభించారు. వరంగల్ సమీపంలో 30 ఎకరాల విస్తీర్ణంలో ఫ్రూట్ మార్కెట్ నిర్మాణంతోపాటు అన్ని హంగులతో కలిగిన కోల్డ్ స్టోరేజీలను నిర్మిస్తామని తెలిపారు. పాత లక్ష్మీపురం గ్రెయిన్ మార్కెట్‌యార్డులో రూ.3 కోట్లతో దుకాణాల సముదాయం నిర్మాణానికి నిధులను మంజూరు చేస్తామన్నారు.