ఐటీ పార్క్‌ను పునరుద్ధరిస్తాం

-టిష్‌మ్యాన్ స్పియర్
-మంత్రి కేటీఆర్‌తో సంస్థ ప్రతినిధుల భేటీ

KTR with Tisman Spear Company Representatives

రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పలు అంతర్జాతీయ కంపెనీలు ఆకర్షనీయమైన ప్రాజెక్టులతో ముందుకు వస్తున్నాయి. ప్రపంచంలోనే ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ అయిన టిష్‌మ్యాన్ స్పియర్ గతంలో ప్రకటించిన తెల్లాపూర్ టెక్నో సిటీ ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు ముందుకువచ్చింది.

ఈ మేరకు సంస్థ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ మైఖేల్ ఎం స్పైస్ సోమవారం సచివాలయంలో ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులతో కలిసి తాము చేపట్టబోయే ప్రాజెక్టు వివరాలను మంత్రికి వివరించారు. కాగా, వంద ఎకరాల్లో టిష్‌మ్యాన్ స్పియర్ కంపెనీ చేపట్టబోతున్న తెల్లాపూర్ టెక్నోసిటీ ప్రాజెక్టుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని వారికి మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి తుదినిర్ణయం తీసుకున్నాక పూర్తి వివరాలు ప్రకటిస్తామని కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి కూడా పాల్గొన్నారు.