ఐటీ నిపుణులదే భవిష్యత్తు

-రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఐటీ నిపుణులుండాలి
-అదే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యం
-ఫీజు రీయింబర్స్‌మెంట్ కొనసాగిస్తాం
-పోటీకి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలి
-ఎడ్యుకేషన్ ఫెయిర్ ముగింపు కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

Jagadish Reddy

తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ప్రతి ఇంట్లో ఐటీ నిపుణులు ఉంటారని విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఐటీ నిపుణులకు మంచి భవిష్యత్తు ఉన్నదని తెలిపారు. ఐటీ సంస్థల అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలకు ఆయన సూచించారు. టీ న్యూస్, అపెక్స్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సంయుక్తంగా చైతన్యపురిలో నిర్వహించిన ఎడ్యుకేషన్ ఫెయిర్ ముగింపు కార్యక్రమానికి మంత్రి ఆదివారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృత్తి విద్యా కోర్సులు చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. ఐటీఐఆర్ కోసం హైదరాబాద్ మహానగరాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద ఐటీ సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు.

రాష్ట్ర విద్యార్థులకు మంచి భవిష్యత్తునివ్వటం కోసం ఐటీఐఆర్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారని చెప్పారు. ఐటీఐఆర్ ద్వారా రాబోయే పదిహేనేళ్లలో 35 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఉద్యోగాలకోసం తీవ్ర పోటీ నెలకొన్నందున విద్యార్థులను అందుకు అనుగుణంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఇంజినీరింగ్ కళాశాలలతో నాణ్యత లోపిస్తున్నదని అపోహలున్నాయని, దీనిని కళాశాలల యాజమాన్యాలు అధిగమించాలన్నారు. రాష్ర్టానికి చెందిన విద్యార్థులు ఇంజినీరింగ్ అడ్మిషన్ల కోసం ఇంకా ఇతర రాష్ర్టాలపై ఆధారపడుతున్నారని, స్వరాష్ట్రంలో నాణ్యమైనవిద్యపై వారిలో నమ్మకం కలిగించాలని పిలుపునిచ్చారు.

గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న విద్యార్థులు ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించటంలో వెనుకబడుతున్నారని, ఈ సమస్యను అధిగమించేందుకు యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం కూడా దీనిని అధిగమించేందుకు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ తప్పనిసరి చేస్తున్నదని వివరించారు. ఈ కార్యక్రమంలో అనురాగ్ విద్యాసంస్థల అధినేది పల్ల రాజేశ్వర్‌రెడ్డి, టీ న్యూస్ సీఈవో నారాయణరెడ్డి, జీసీఎం ఎన్ ఉపేందర్, అపెక్స్ డైరెక్టర్ దినేశ్, టీ న్యూస్ సిబ్బంది కిరణ్‌కుమార్, ఉదయ్‌భాస్కర్, సత్యపాల్, శ్రీనివాస్, రాజారెడ్డి, వివిధ ఇంజినీరింగ్ కళాశాలల ప్రతినిధులు పాల్గొన్నారు.