Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఐటీలో తెలంగాణ మేటి

-తెలంగాణ ఆలోచన.. దేశానికి ఆచరణ
-ఈరోజు మనం చేస్తున్నది.. రేపు దేశం చేస్తుంది
-ఢిల్లీ తరహాలో శంషాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ సిటీ
-ఆగస్టులో రూ.1600 కోట్లతో మూసీ సుందరీకరణ పనులు
-గండిపేట సుందరీకరణకు రూ.100 కోట్లు
-రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
-నాలుగేండ్లలో గణనీయమైన అభివృద్ధి
-బుద్వేల్-కిస్మత్‌పూర్ మధ్య 350 ఎకరాల్లో రానున్న 28 కంపెనీలు l 1.20 లక్షల ఉద్యోగావకాశాలు
-శంషాబాద్ బహిరంగసభలో మంత్రి కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఏం ఆలోచిస్తున్నదో.. రేపు భారతదేశం అంతా అదే ఆచరిస్తుందని రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పని దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని తెలిపారు. ఐటీ రంగంలో రాజధాని హైదరాబాద్ మేటిగా మారుతున్నదని చెప్పారు. గడిచిన నాలుగేండ్లలో గణనీయమైన అభివృద్ధి సాధించిన ఐటీ రంగాన్ని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరింత విస్తరించనున్నామని వెల్లడించారు. త్వరలోనే బుద్వేల్-కిస్మత్‌పూర్ మధ్యన 350 ఎకరాల స్థలంలో 28 కంపెనీలు రాబోతున్నాయని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ కంపెనీల ద్వారా దేశ, విదేశీయులతోపాటు స్థానికులకు కలిపి సుమారు 1.20 లక్షల ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మంగళవారం మంత్రి పీ మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజుతో కలిసి మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటనచేశారు. సుమారు రూ.40 కోట్ల మేర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

రూ.1.53 కోట్లలో అత్తాపూర్ 61వ వార్డులో సీసీ రోడ్డు పనులు, రూ. 9.42 కోట్లతో హిమాయత్‌సాగర్ రోడ్డు మరమ్మతు పనులు, రూ.4.70 కోట్లతో మల్కంచెరువు పునరుద్ధరణ పనులు, రూ.1.18 కోట్లతో గణేశ్ నిమజ్జనం కోనేరు, రూ.16.31 కోట్లతో బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఆక్కడి నుంచి హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో కిస్మత్‌పూర్ వద్ద రూ.6.25 కోట్లతో మూసీ నది కాలువపై నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించారు. ఆనంతరం శంషాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన మంత్రి కేటీఆర్.. రాబోయే నాలుగేండ్లలో కిస్మత్‌పూర్-బుద్వేల్ ప్రాంత రూపురేఖలు మారనున్నాయని వెల్లడించారు. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో ఐటీ కంపెనీలకు జాగ ఇద్దామంటే లేదని, ఆదిభట్ల ఇస్తామంటే కంపెనీలు ఆసక్తి చూపడంలేదని పేర్కొన్నారు. గోపన్‌పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్‌ల మాదిరిగా కిస్మత్‌పూర్, బుద్వేల్ అభివృద్ధి చెందుతాయని తెలిపారు.

ఆగస్టులో మూసీ సుందరీకరణ పనులు
మూసీ సుందరీకరణ పనులను 42 కిలోమీటర్ల మేర రూ.1600కోట్లతో ఆగస్టు నెలలో ప్రారంభిస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. దాంతోపాటే 1920లో నిర్మించిన గండిపేట రిజర్వాయర్ 2020నాటికి వందేండ్లు పూర్తిచేసుకొంటున్న సందర్భంగా రూ. 100 కోట్లతో అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా గండిపేటను తీర్చిదిద్దుతామన్నారు. శంషాబాద్ విమానాశ్రయ విస్తరణకు ఇటీవల శంకుస్థాపన జరిగిందని, ఢిల్లీ తరహాలో ఇక్కడ ఎయిర్‌పోర్ట్ సిటీ రాబోతుందని పేర్కొన్నారు. శంషాబాద్‌లో లాజిస్టిక్‌పార్క్‌ను ఏర్పాటు చేయనున్నామని, తద్వారా వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

శరవేగంగా రాష్ట్ర అభివృద్ధి
తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఏం చేయబోతున్నదో రేపు భారతదేశం ఆదే చేయబోతున్నదని, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి కేటీఆర్ వివరించారు. రైతులకు పంట పెట్టుబడి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. సుమారు 58 లక్షల మందికి పైగా అన్నదాతలకు బీమా కల్పిస్తున్నదని చెప్పారు. గత పాలకులు పింఛన్ల విషయంలో నానా హింసలు పెట్టారని, టీడీపీ హయాంలో రూ. 70 ఫించన్ ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.200 ఇచ్చి చారానా కోడికి బారానా మాసాల అన్నట్లు వ్యవహరించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికి 29 లక్షల ఫించన్‌దారులకోసం రూ.800 కోట్లు ఖర్చు పెడితే తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి 42 లక్షల మందికి రూ.5,800 కోట్లు ఖర్చు పెడుతున్నదని వివరించారు. కేసీఆర్ కిట్ రూపంలో రూ.12 వేలు ఇస్తున్నామని, ఆడపిల్ల పుడితే రూ.13 వేలు ఇస్తున్నామని పేర్కొన్నారు. తల్లిబిడ్డ ఆరోగ్య సంరక్షణకు ఆరోగ్యలక్ష్మి కింద పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని చెప్పారు.

రేషన్ బియ్యం విషయంలో సీలింగ్ పద్ధతిని ఎత్తివేసి వ్యక్తికి ఆరు కిలోల బియ్యం ఇస్తున్నామని తెలిపారు. 500 గురుకులాలను ప్రారంభించి ఒక్కో విద్యార్థిపై ఏడాదికి 1.2 లక్షలను ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆడపిల్ల పెండ్లి అంటే మేనమామలే మొహం చాటేసే ఈ రోజుల్లో కులమతాలకు తావులేకుండా తెల్లకార్డు ఉన్న వారందరికీ లక్షా నూట పదహారు రూపాయలు ఇచ్చి ప్రభుత్వం అండగా నిలబడుతున్నదని, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకోసం రూ.1200 కోట్లను ఖర్చుచేస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యమిచ్చి అభివృద్ధిలో దూసుకుపోతున్నదని మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. ఒకప్పుడు బెంగాల్ థింక్ టుడే, ఇండియా విల్ థింక్ టుమారో అనే సామెత ఉండేదని, కానిప్పుడు తెలంగాణ వాట్ డూయింగ్ టుడే.. ఇండియా విల్ డూ టుమారో అన్నట్లుగా సాగుతున్నదని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.

రాజేంద్రనగర్‌కు రూ.200 కోట్లు
రాజేంద్రనగర్ నియోజకవర్గం అభివృద్ధికి రూ.200 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మున్సిపల్‌శాఖ నుంచి ఈ నిధులను ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. తనదైన పద్ధతిలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని ప్రశంసించారు. రాబోయే మూడు, నాలుగేండ్లలో శేరిలింగంల్లి నియోజకవర్గం కంటే మించి రాజేంద్రనగర్ అభివృద్ధిలో దూసుకుపోనున్నదని పేర్కొన్నారు. ఎన్నికల పరీక్ష వచ్చినప్పుడు ప్రకాశ్‌గౌడ్, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డిలను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

కాంగ్రెసోళ్లవి ఒట్టి మాటలే
ముందస్తు ఎన్నికలకు మేం సిద్ధమని ప్రకటించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో కరంట్ అంశంపై అవకాశం ఇవ్వాలని ఉత్తమ్ లొల్లిబెట్టిండు.. స్పీకర్ మధుసూదనాచారి అవకాశం ఇస్తే ప్రిపేర్ కాలేదన్నడు.. ఇప్పుడు కూడా ముందస్తు ఎన్నికలు వస్తే ప్రిపేర్ కాలేదంటరు అని కేటీఆర్ చమత్కరించారు. 50 ఏండ్లు పాలించి, మొన్నటి దాక సావగొట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గీ రోడ్లు గిట్లెందుకున్నయి, గాడ నీళ్లందుకొస్తలేవు. గీ మోరీలెందుకు తియ్యలే అని పెద్ద పెద్ద మాటలు మాట్లాటడం హాస్యాస్పదంగా ఉన్నదని ఎద్దేవాచేశారు.

Every contribution that you make can make a difference.

Please contribute generously to the TRS.

MAKE A DONATION NOW