ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ తెలంగాణ

– రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలు
– హాంకాంగ్ పారిశ్రామికవేత్తలకు వివరించిన మంత్రి కేటీఆర్
– సైబర్‌పోర్ట్ కంపెనీ సందర్శన.. సిబ్బందితో మాటా మంతీ

KTR-visit-to-Honkong
రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఏడాది పాలనాకాలంలో తెలంగాణ రాష్ర్టాన్ని ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా మార్చామని చెప్పారు. హాంకాంగ్, తైవాన్‌లో మూడురోజుల పర్యటనలో ఉన్న ఆయన గురువారం హాంకాంగ్‌లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం, సీఐఐ సంయుక్తంగా ఏర్పాటుచేసిన పెట్టుబడుల రోడ్ షో, ఇంటరాక్టివ్ సెషన్‌లో మంత్రి పాల్గొన్నారు. హాంకాంగ్‌లోని ప్రముఖ కంపెనీల కీలక ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

తెలంగాణలో పారిశ్రామిక అవకాశాలు, పెట్టుబడులకు లభించే విలువను మంత్రి వారికి వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో లభించే చవకైన మౌలికవసతుల గురించి మంత్రి ప్రధానంగా వివరించారు. హాంకాంగ్‌లోని పెట్టుబడిదారులకు ఆర్థిక, పెట్టుబడి సలహాలిచ్చే ప్రముఖ కంపెనీలన్నీ ఈ సమావేశానికి హాజరుకావటంతో రాష్ర్టానికి భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశంఉందని సమావేశ అనంతరం మంత్రి తెలిపారు. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం గురించి తెలుసుకున్న అనేక కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాయని, ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు పలు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయని చెప్పారు. ఈ సమావేశంలో ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్‌తోపాటు సీఐఐ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ వనితా దాట్ల, హాంకాంగ్‌లోని కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రశాంత్ అగర్వాల్, ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ హాంకాంగ్ చైర్మన్ ఎం అరుణాచలం తదితరులు పాల్గొన్నారు.

సమావేశ అనంతరం మంత్రి కేటీఆర్ హాంకాంగ్‌లో నిర్మాణ రంగంలో స్టార్టప్‌లకు సేవలందించే అతిపెద్ద కంపెనీ అయిన సైబర్ పోర్ట్ కార్యాలయాన్ని సందర్శించారు. సైబర్‌పోర్ట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మార్క్ క్లిప్ట్‌తో సమావేశమయ్యారు. స్టార్టప్‌లకు సహాయ సహకారాలు అందించడంలో అపార అనుభవం ఉన్న సైబర్ పోర్ట్ సంస్థ తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనున్న టీహబ్‌కు సహకారం అందిచాలని కేటీఆర్ కోరారు. కంపెనీ ప్రతినిధులు, సిబ్బందితో జరిగిన సమావేశంలో స్టార్టప్ కంపెనీలకు ఉన్న అవకాశాలు, సవాళ్లపై మంత్రి చర్చించారు.