ఇంటర్ బోర్డును విభజించాల్సిందే

తమ రాష్ట్రంలోని పరీక్షలను తాము సొంతంగా నిర్వహించుకుంటామని, విభజన చట్టం ప్రకారం 15 శాతం ఓపెన్ క్యాటగిరీ ద్వారా ఉమ్మడి ప్రవేశాలకు ఆటంకం కలుగుకుండా చూస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. విద్యాసంస్థల విభజనపై ఇంటర్మీడియేట్ బోర్డులో సోమవారం రెండు రాష్ర్టాల విద్యామంత్రులు జగదీశ్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు సమావేశమయ్యారు.

Jagadish Reddy

-ఎవరి పరీక్షలు వారు నిర్వహించుకుందాం
-వేర్వేరు పరీక్షలతో నో ప్రాబ్లమ్
-తెలంగాణ ఎంసెట్‌ను నిర్వహించుకుంటాం
-15 శాతం క్యాటగిరీ విధానాన్ని పాటిస్తాం
-కేంద్రం జోక్యం అనవసరం
-ఏపీకి ప్రతిపాదించిన విద్యామంత్రి జగదీశ్‌రెడ్డి
-ఉమ్మడి పరీక్షలు ఉండాల్సిందే అన్న ఏపీ మంత్రి
అనంతరం జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ శాంతియుతంగా, మంచి పద్ధతిలో విద్యా సంస్థల విభజన చేసుకుందామని ప్రతిపాదించామన్నారు. విభజించాల్సిన విద్యాసంస్థల్లో ఆస్తులు, ఉద్యోగులు, విధులు వంటి పలు అంశాలపై ప్రాథమిక స్థాయిలో చర్చించామన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలను కూడా ఎవరి రాష్ట్రంలో వారు నిర్వహించుకుందామని మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రతిపాదించారు. ఎంసెట్‌ను సైతం వేర్వేరుగా నిర్వహించుకుందామని తేల్చిచెప్పారు.

వేర్వేరుగా పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం రాదన్నారు. వెంటనే ఇంటర్ బోర్డును విభజించి ఎవరి రాష్ట్రంలో వారు పరీక్షలు నిర్వహించుకుందామని జగదీశ్‌రెడ్డి ప్రతిపాదించారు. తమ పరీక్షలను తామే నిర్వహించుకోవడానికి సొంతంగా ప్రశ్నాపత్రం తయారు చేసుకుంటున్నామన్నారు. తెలంగాణ కవులు, కళాకారులు, తెలంగాణ భాష, చరిత్ర, భౌగోళిక అంశాలతో తెలంగాణ సిలబస్‌ను తయారుచేసుకుంటామన్నారు. అన్ని విద్యా సంస్థల విభజించడంతోపాటు తెలంగాణలోని వేర్వేరు పరీక్షలను సొంతంగా నిర్వహించుకోవడానికి తమ ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుబడి ఉన్నారని ఏపీ విద్యామంత్రి గంటాకు జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు.

లేనిపోని అపోహాలు సృష్టించవద్దు..
ఉమ్మడి పరీక్షలు నిర్వహించకపోతే ఏపీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటూ లేనిపోని అపోహాలు సృష్టించవద్దని మంత్రి జగదీశ్‌రెడ్డి సూచించారు. ఎంసెట్ నిర్వహణ, ఇంటర్ పరీక్షల నిర్వహణలో వేర్వేరుగా నిర్వహించుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండే అవకాశం లేదన్నారు. ఐఐటీ-జేఈఈ, నిట్ జాతీయ పరీక్షలకు హాజరయ్యే విషయంలో ఇతర రాష్ర్టాలు ఏవిధంగా అనుసరిస్తున్నాయో.. తెలంగాణలోనూ అదే విధానాన్ని కొనసాగిస్తామని మంత్రి స్పష్టంచేశారు.