ఇంటర్ పరీక్షలు..మార్చి 9 నుంచే

-విభజన చట్టంలోని సెక్షన్ 75 ప్రకారం బోర్డు తెలంగాణదే
-విద్యార్థులు ఆందోళన చెందొద్దు
-పరీక్షలపై చంద్రబాబు రాజకీయం
-విద్యా మంత్రి జగదీశ్

Education-Minister-Sri-Jagadeeswar-Reddy-01

ఇంటర్మీడియట్ పరీక్షలపై ఆంధ్ర సర్కారు సృష్టిస్తున్న గందరగోళానికి తెలంగాణ విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి తెరదించారు. తెలంగాణ ఇంటర్ పరీక్షలను మార్చి 9నుంచే నిర్వహిస్తున్నామని విస్పష్టంగా ప్రకటించారు. అందుకోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇంటర్ బోర్డులో ఆ మేరకు పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. మంగళవారం తెలుగు యూనివర్సిటీ ఫౌండేషన్ డే సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మన పరీక్షలను మనమే నిర్వహించుకుంటున్నాం.

ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దు అని మంత్రి భరోసా ఇచ్చారు. ఇంటర్ పరీక్షలను అడ్డం పెట్టుకుని ఏపీ చేస్తున్న కుట్రలను సహించేదిలేదని స్పష్టంచేశారు. ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌కు, కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రా సర్కారు ఎన్ని ఫిర్యాదులు చేసుకున్నప్పటికీ తెలంగాణ రాష్ర్టానికి ఉన్న అధికారాలను ఎవ్వరూ కాదనలేరని చెప్పారు.

రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 75లో పేర్కొన్న దాని ప్రకారం భౌగోళికంగా ఇంటర్మీడియట్ బోర్డు తెలంగాణ రాష్ర్టానికే చెందుతుందన్నారు. కనుక ఇంటర్ బోర్డుపై హక్కులన్నీ తెలంగాణ సర్కారుకే ఉంటాయని స్పష్టంచేశారు. మన రాష్ట్రంలో ఉన్న ఇంటర్ బోర్డుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు లేవని మంత్రి కరాఖండిగా చెప్పారు.

పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రా కోరితే సహకరిస్తాం
ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయంలో ఆంధ్ర సర్కారుకు ఎలాంటి అధికారాలు లేవన్న విద్యామంత్రి.. ఏపీ ప్రభుత్వం కోరితే వారి పరీక్షల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. అవసరమైతే ఏపీ పరీక్షలను కూడా తెలంగాణ పరీక్షలతో కలిపి నిర్వహిస్తామని స్పష్టంచేశారు. ఏపీ సీఎం కావాలనే 10వ షెడ్యూల్‌లో ఉన్న ఉమ్మడి విద్యాసంస్థలతో రాజకీయాలాడుతున్నారని మంత్రి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, వారి దృష్టి మరల్చడానికే చంద్రబాబు తెలంగాణతో గొడవ పెట్టుకుంటున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.