ఇంటింటికి మంచినీరు..

-హైదరాబాద్‌లో అదనంగా రెండు జలాశయాల నిర్మాణం
-నిజామాబాద్, కరీంనగర్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ
-మంచినీరు, డ్రైనేజీ, రహదారులకు కోరినన్ని నిధులు
-కార్యాచరణ రూపొందించాలి
-పురపాలకశాఖ సమీక్షలో అధికారులకు సీఎం దిశానిర్దేశం

KCR 01

రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ముఖ్యంగా మంచినీరు, డ్రైనేజీ, రహదారుల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో తాగునీటి కోసం రెండు మంచినీటి రిజర్వాయర్ల నిర్మాణంతోపాటు, ప్రతి ఇంటికి మంచినీరు సరఫరా చేసే కార్యాచరణ సిద్ధం చేయాలని, అలాగే కరీంనగర్, నిజామాబాద్‌లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. నగరాలను సుందరంగా తీర్చి దిద్దేందుకు ఎన్ని నిధులైనా ఇవ్వడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

సోమవారం క్యాంపు కార్యాలయంలో హైదరాబాద్, ఇతర నగరాలు, పట్టణాల అభివృద్ధిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో నగరాలు, పట్టణాలకు పెద్దఎత్తున వలసలు పెరుగుతున్నాయని, వీటికి అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కోణంలో రాష్ట్ర రాజధాని నగరం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని చెప్పారు. నగర జనాభాకు అవసరమైన తాగునీటిని అందించేందుకు మరో రెండు మంచినీటి రిజర్వాయర్లు కావాల్సి ఉందన్నారు. ప్రతి ఇంటికి సక్రమంగా మంచినీటి సరఫరా చేసే వ్యవస్థ ఏర్పరచాలని పేర్కొన్నారు.

అలాగే రాష్ట్రంలోని ఐదు కార్పొరేషన్లు, 62 మున్సిపాలిటీలలో కూడా మంచినీటి సరఫరా, డ్రైనేజీల నిర్వహణ , సీనరేజ్‌పనులు, రహదారుల నిర్మాణం తదితర విషయాలపై అధికారులు పూర్తిస్థాయి శ్రద్ధ వహించాలని సూచించారు. మౌలికసదుపాయాల కల్పన కోసం తగినన్ని నిధులిస్తామని చెప్పారు. దానికి తోడు నగరాలు, పట్టణాలు ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చెందాలని, ఇందుకు భిన్నంగా వెలిసే అక్రమ నిర్మాణాలు, కట్టడాలను కఠినంగా నియంత్రించాలని సూచించారు. ఇందుకోసం అవసరమైతే ఓ విధానం కూడా తీసుకురావాలని సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు.

పట్టణ ప్రాంతాల్లో బలహీనవర్గాల గృహ సముదాయాల నిర్మాణానికి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డీ శ్రీనివాస్, సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, మున్సిపల్ శాఖ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, వరంగల్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.