ఇంచు భూమి వదులుకోం

-పోలవరం కోసం తెలంగాణను ముంచే కుట్ర
-ముంపు మండలాలను ఆంధ్రలో కలుపుతూ..
-ఆర్డినెన్స్ జారీచేయటం దారుణం..
– వెంటనే వెనక్కి తీసుకోవాలి
-మోడీ, చంద్రబాబు టీ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు
-ఆర్డినెన్స్‌పై టీడీపీ, బీజేపీ సమాధానం చెప్పాలి
-టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ డిమాండ్
-తెలంగాణ బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపు

Etela Rajender

పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని ఒక్క ఇంచు భూమిని కూడా వదులుకోబోము. ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపటానికి ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల ముఖ్యమంత్రులతో చర్చించాలని ప్రధాని మోడీని కోరినా ఆయన పెడచెవిన పెట్టారు. ఖమ్మం జిల్లాలో ఆదివాసీలు అత్యధికంగా జీవిస్తున్న ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో చేరుస్తూ కేంద్రం ఆర్డినెన్స్ ఇవ్వటం దారుణం. ఆ ఆర్డినెన్స్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ ఇచ్చిన తెలంగాణ బంద్‌కు అన్ని వర్గాలవారు స్వచ్ఛందంగా సహకరించి విజయవంతం చేయాలి.తెలంగాణకు వ్యతిరేకంగా బాబు చేస్తున్న కుట్రలపై టీడీపీ నేతలు సమాధానం చెప్పాలి. ఆర్డినెన్స్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ ఇచ్చిన తెలంగాణ బంద్‌కు అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా సహకరించి విజయవంతం చేయాలని కోరారు. ఇంకా తెలంగాణ రాష్ట్రం పూర్తిగా ఏర్పడలేదని, ఆంక్షలు వెంటాడుతూనే ఉన్నాయని తెలిపారు. పోలవరం ఆర్డినెన్స్ లాంటి కుట్రలను ఇంకా ఛేదించాల్సి ఉందని అన్నారు. కేంద్రం ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకోకుంటే తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని, దీనికి ప్రధాని మోడీ, ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. పోలవరం ముంపు బాధితులపై తెలంగాణ టీడీపీ నేతలు మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.

తెలంగాణకు వ్యతిరేకంగా బాబు చేస్తున్న కుట్రలపై టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నరేంద్రమోడీ హైదరాబాద్‌కు వచ్చి తల్లిని చంపి బిడ్డను బతికించారన్నారని, నేడు బిడ్డనూ చంపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై బీజేపీ నేతలు కూడా సమాధానం చెప్పాలని, ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ముంపునకు గురవుతున్న ఏడు మండలాల రక్షించేందుకు న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే చందూలాల్, ఎమ్మెల్సీ స్వామిగౌడ్, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రొళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.