ఇక అభివృద్ధి వెలుగులు

కేసీఆర్ చిత్తశుద్ధి కలిగిన సీఎం
-టాటాగ్రూప్ చైర్మన్ రతన్‌టాటా అభినందన
-కార్పొరేట్ సేవా దృక్పథంతో స్కూల్ నిర్వహణ
-జీఎంఆర్ చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు

KCR inaugrates GMR Business School

అసతోమా సద్గమయా.. తమసోమా జ్యోతిర్గమయా! అన్నట్లు త్వరలోనే చీకట్లు తొలగిపోతాయి. తెలంగాణలో అభివృద్ధి వెలుగులు విరజిమ్ముతాయి అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్ హోటల్ వద్ద కెనడాకు చెందిన యార్క్ యూనివర్సిటీ జీఎంఆర్ సంస్థలు సంయుక్తంగా నెలకొల్పిన స్కూలిచ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ క్యాంపస్‌ను ముఖ్యమంత్రి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం నోవాటెల్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడారు.

విద్యను ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికే ఐఎస్‌బీ, నల్సార్ లా యూనివర్సిటీ, ఐఐటీవంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయని వివరించారు. ఇంకా అంతర్జాతీయ సంస్థలను నెలకొల్పాల్సిన అవసరముందన్నారు.దేశ ఆర్థికాభివృద్ధికి నాణ్యమైన విద్య ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. బిజినెస్ స్కూల్‌ను నెలకొల్పడానికి జీఎంఆర్, కెనడా యార్క్ యూనివర్సిటీ హైదరాబాద్‌ను ఎంచుకోవడం అభినందనీయమన్నారు. పరిశ్రమలను ఏర్పాటుచేసేందుకు హైదరాబాద్‌లో వాతావరణం అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని తమ ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్నదని ఆయన వెల్లడించారు.

హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఆయన కోరారు. పరిశ్రమల స్థాపనకు ఇప్పటికే తమ ప్రభుత్వం 5లక్షల ఎకరాలను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. నూతన విధానాలతో ప్రగతిపథంలో నడుస్తున్న కొత్త రాష్ట్రం తెలంగాణలో మరింత అభివృద్ధి జరగాలంటే గొప్ప పారిశ్రామికవేత్త రతన్‌టాటావంటి వారి ఆశీస్సులు కావాలని అన్నారు. రతన్‌టాటావంటి దిగ్గజాల మార్గదర్శకాలతో పారిశ్రామికరంగానికి ప్రగతి బాటలు వేయడానికి తమ సర్కార్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మక సంస్థలు, పరిశ్రమలను నెలకొల్పడానికి ముందుకు వచ్చేవారికి తమ ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా పరిశ్రమలు స్థాపించేవారికి వెంటవెంటనే అనుమతులు ఇవ్వడానికి అత్యుత్తమ విధానాన్ని రూపొందించామన్నారు.

యువకులలో నైపుణ్యాన్ని పెంచి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. టాటాగ్రూప్ చైర్మన్ రతన్‌టాటా మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కమిట్‌మెంట్ (చిత్తశుద్ధి), సిన్సియారిటీ (నిజాయితీ) ఉందని ప్రశంసించారు. ఆయన హయాంలో అభివృద్ధి జరుగుతుందని ఆశించారు. కేసీఆర్‌లాంటి ముఖ్యమంత్రి ఉండటం కూడా తాను ఈ కార్యక్రమానికి హాజరుకావడం ఒక కారణమని వివరించారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి ఆటంకాలు ఉండబోవని, ఔత్సాహికులకు ప్రోత్సాహం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద బిజినెస్ స్కూల్ ఏర్పాటు చేయడంవల్ల మంచి ఫలితాలుంటాయన్నారు.

జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు మాట్లాడుతూ హైదరాబాద్‌లో బిజినెస్ స్కూల్ ఏర్పాటు చేయడం విద్యాపరంగా కొత్త అధ్యాయమని అభివర్ణించారు. దీనిని కార్పొరేట్ సేవా దృక్పథంతోనే నిర్వహిస్తామని వివరించారు. అఖిలభారత సాంకేతిక విద్యామండలి మార్గదర్శకాల మేరకే స్కూల్ నడుస్తుందని చెప్పారు.

రెండు సంవత్సరాల బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సులో మొదటి సంవత్సరం ఇండియాలో, రెండవ సంవత్సరం కెనడాలోని టొరంటోలో ఉంటుందని వివరించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు కేశవరావు, కెనడా స్కూలిచ్ బిజినెస్ స్కూల్ డీన్ డెజ్‌సో జే హార్వత్, చీఫ్ సెక్రటరీ రాజీవ్‌శర్మ, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి నర్సింగ్‌రావు, జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ సీఈవో వీ రఘునాథన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి యూనివర్సిటీలోని అన్ని విభాగాలను పరిశీలించి విషయాలు తెలుసుకున్నారు. ప్రాంగణంలో మొక్క నాటారు.