హైదరాబాద్‌లో ఉచిత వై-ఫై సేవలు

-ఎయిర్‌టెల్ ఆధ్వర్యంలో 17 ప్రాంతాల్లో అందుబాటులోకి
-లాంఛనంగా ప్రారంభించిన మంత్రి కేటీఆర్

IT Minister KTR Launching of Wifi in Hyderabad

తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ప్రైవేట్ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ రాష్ట్రంలో తొలిసారిగా పబ్లిక్ వై-ఫై సేవలను ప్రారంభించింది. హైదరాబాద్‌ను గ్లోబల్ స్మార్ట్‌సిటీ గా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నగరంలోని 17 ప్రాంతాల్లో పరిమితితో కూడిన ఉచిత ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.

ఐటీమంత్రి కే తారకరామారావు, భారతి ఎయిర్‌టెల్ తెలంగాణ, ఏపీ సర్కిళ్ల సీఈవో వెంకటేశ్ విజయ్‌రాఘవన్ శుక్రవారం వై-ఫై సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఇది ప్రారంభం మాత్రమేనన్నారు. హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాలకు వై-ఫై సౌకర్యాన్ని వచ్చే నాలుగు నెలల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. ఇందుకు సంబంధించిన టెండర్ల పక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. హైదరాబాద్‌లోని సైబర్ టవర్స్ మధ్యస్థానంగా మొత్తం 17 వై-ఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేసినట్లు విజయరాఘవన్ తెలిపారు.

ఆ ప్రాంతాల్లోని ప్రజలు రోజుకు 750 మెగాబైట్స్ డాటాను ఉచితంగా పొందేందుకు వీలుంటుంది. పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ సేవలు మూడు నెలల వరకు అందుబాటులో ఉండనున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, ఐప్యాడ్‌లతోపాటు వై-ఫై వసతి ఉన్న ఏ డివైజ్‌తోనైనా ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ యాక్సెస్ పొందవచ్చునని, ఏ టెలికం ఆపరేటర్‌కు చెందిన మొబైల్ నుంచైనా సేవలు పొందవచ్చని విజయరాఘవన్ తెలిపారు.