హైదరాబాద్ నలుమూలలా ఐటీ పరిశ్రమలు

-ఐటీఐఆర్ క్లస్టర్ల సంఖ్య పెంచే యోచనలో ప్రభుత్వం
-భూములను దుర్వినియోగం చేసే కంపెనీలకు నోటీసులు
-మండలిలో ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్

KTR

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగాన్ని మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలకే పరిమితం చేయకుండా హైదరాబాద్ నగరం నలుమూలలా విస్తరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, కొంపల్లి యాదవరెడ్డి, ఎస్ జగదీశ్వర్‌రెడ్డి సోమవారం శాసనమండలిలో అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఐటీ రంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ఐటీసీ పాలసీని ప్రతిపాదిస్తున్నదని తెలిపారు. ఐటీ పరిశ్రమలకు పలు రాయితీలు ఇవ్వడం ద్వారా రాష్ర్టానికి పెట్టుబడులు ఆకర్షించేవిధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో చేపట్టనున్న ఐటీఐఆర్ ప్రాజెక్టును ప్రస్తుతమున్న మూడు క్లస్టర్లకే పరిమితం చేయకుండా ఐదు క్లస్టర్లకు విస్తరిస్తామని ప్రకటించారు. దీనిపై ఇప్పటికే సమీక్ష జరిపామన్నారు.

ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ పలు ఐటీ కంపెనీలకు కేటాయించిన భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పటాన్‌చెరు ప్రాంతంలో ఈ విధంగా భూదందా కొనసాగుతున్నదని, ఇక్కడ కంపెనీలకు ఇచ్చిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, పేదలకు ఇండ్ల స్థలాలుగా ఇవ్వాలని కోరారు. మంత్రి కేటీఆర్ స్పందిస్తూ అటువంటి ప్రయత్నాలు చేస్తున్న కంపెనీలపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీలకు నోటీసులు ఇస్తామన్నారు. ఈ విషయంలో సభ్యులకు తెలిసిన సమాచారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు.

ఇప్పటికే ప్రభుత్వానికి అందిన సమాచారం ఆధారంగా నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. కొన్ని సంస్థల నుంచి సమాధానం వచ్చిందని, ఇంకా కొన్ని కంపెనీల నుంచి సమాధానం రావాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉపాధి లభించేలా ఐటీ పరిశ్రమలను, ఇంజినీరింగ్ విద్యకు అనుసంధానం చేసేదిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పటికే 70 కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఐటీ పరిశ్రమలు స్థాపించే ప్రాంతంలోని స్థానికులకు ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆదిబట్లలో ఏర్పాటుచేసిన ఓ కంపెనీలో సెమీ స్కిల్డ్, అన్‌స్కిల్డ్ స్థానికులకు 90శాతం ఉద్యోగాలు కల్పించారని తెలిపారు.

రాష్ట్రంలోని మరమగ్గాల కార్మికుల వ్యక్తిగత రుణాలను లక్ష రూపాయల వరకు మాఫీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల 1,325 మంది కార్మికులు లబ్ధి పొందనున్నారని చెప్పారు. రుణమాఫీ కోసం రూ. 5 కోట్ల 65 లక్షలను ప్రభుత్వం కేటాయించిందని వెల్లడించారు. గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మరమగ్గాల కార్మికులను పట్టించుకోలేదనిఆవేదన వ్యక్తం చేశారు.