హైదరాబాద్‌ను దేశంలోనే నంబర్ వన్ చేస్తాం

నిర్మాణరంగంలో హైదరాబాద్ దేశంలోనే నంబర్ వన్‌గా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ త్రికరణశుద్ధితో కృషి చేస్తున్నారని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. త్వరలో నిర్మాణరంగంలో విప్లవాత్మక మార్పులు తేనున్నామని చెప్పారు. టీఎస్‌ఐపాస్ కింద పదిహేను రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నట్టే నిర్మాణ సంస్థలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) వచ్చేలా మార్పులకు శ్రీకారం చుట్టనున్నామని వెల్లడించారు.

-నిర్మాణరంగానికి చేయూత
-టీఎస్-ఐపాస్ తరహాలో విప్లవాత్మక మార్పులు
-15 రోజుల్లో ఓసీ వచ్చేలా చర్యలు..
లేదంటే సదరు అధికారులకు జరిమానా
-పవర్‌కట్ ఫ్రీ సమ్మర్.. కేసీఆర్ ఘనత
-రియల్‌ఎస్టేట్ సమ్మిట్‌లో మంత్రి కేటీఆర్

KTR addressing in Real Estate Assoiciation Meeting

పదిహేను రోజులు దాటితే ఆ జాప్యానికి సంబంధిత అధికారిని బాధ్యుడిని చేస్తూ పదహారో రోజు నుంచి ప్రతిరోజుకు రూ.500 చొప్పున జరిమానా విధించేలా చర్యలు తీసుకోనున్నామని చెప్పారు. దేశంలోనే ఏ ప్రభుత్వమూ ఇలాంటి విధానాన్ని ఇప్పటివరకు ప్రవేశపెట్టలేదన్నారు.

మంగళవారం జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో రియల్ ఎస్టేట్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన రియల్ ఎస్టేట్ సమ్మిట్‌కు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 31 తర్వాత రియల్‌ఎస్టేట్ రంగం పురోగతి సాధిస్తుందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే పరిశ్రమలకు అనేక రాయితీలు ఇస్తున్నదని, హైదరాబాద్‌లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు.

సగటు నగరజీవి అవసరాలు తీరుస్తాం..
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే రియల్ ఎస్టేట్, నిర్మాణరంగానికి సంబంధించిన సమస్యలపై సీఎం కేసీఆర్ అధికారులతో కలిసి చర్చించేందుకు బిల్డర్లందరినీ పిలిపించి మాట్లాడారని గుర్తుచేశారు. 40 సమస్యలతో వచ్చిన సీఎంకు విన్నవించుకున్నారని, ఇందులో 31 సమస్యలను ఏకకాలంలోనే సీఎం పరిష్కరించారని తెలిపారు. తెలంగాణ ప్రభత్వం పారదర్శక పాలన అందిస్తున్నదని, అందుకే రియల్ ఎస్టేట్ ప్రతినిధులు, బిల్డర్లతో నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరించిందన్నారు.

ఎవరికీ ఒక్కపైసా కూడా ఇవ్వకుండా ప్లాట్ల కొనుగోలు, ఇండ్ల నిర్మాణం చేసినపుడే రియల్‌ఎస్టేట్‌రంగంలో విజయం సాధించినట్లని సీఎం కేసీఆర్ అప్పట్లో అన్నారని కూడా గుర్తు చేశారు. దేశమంతటా హైదరాబాద్ నిర్మాణరంగ సంస్థలు విస్తరించాలని కేటీఆర్ ఆకాంక్షించారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేక్రమంలో సీఎం కేసీఆర్ రోడ్ల అభివృద్ధి, నిరంతర విద్యుత్తు, తాగునీరు, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, చక్కటి వాతావారణం అనే అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టారని వివరించారు. సగటుజీవి కోరుకునేవి ఇవేనని అన్నారు.

పవర్‌కట్ ఫ్రీ సమ్మర్..
రెండేండ్ల క్రితం. అది 2014. అప్పటికి తెలంగాణ రాలేదు. ఆనాడు హైదరాబాద్‌లోని పరిస్థితిపై ఎన్నో వదంతులు, అపోహలు, ఎన్నెన్నో అనుమానాలు, అపనమ్మకాలు. తెలంగాణ ఏర్పడితే ఇక్కడ ఎవరికీ భద్రత ఉండదని, సీమాంధ్రులనే కాదు.. ఇతర రాష్ర్టాల వాళ్లనూ కట్టుబట్టలతో పంపిస్తారని విష ప్రచారం చేసిండ్రు. ఆస్తులు లాక్కుంటారని, ఇబ్బందులు పెడతారని, వివక్ష చూపుతారని రకరకాల వదంతులను ఆనాడు ప్రచారం చేశారు. 19 నెలల టీఆర్‌ఎస్ ప్రభుత్వ పరిపాలనలో ఎక్కడైనా మచ్చుకైనా ప్రాంతీయవివక్ష కనబడిందా? అని కేటీఆర్ అన్నార. తెలంగాణ వస్తే హైదరాబాద్‌లో అరాచకం రాజ్యం ఏలుతుందని, కరెంటే ఉండదని, పరిశ్రమలు ఉండవని, పెట్టుబడులేరావని, పరిశ్రమలేరావని నానారకాల విష ప్రచారం చేశారు.

నేను గర్వంగా చెప్తున్నా.. 30 ఏండ్ల తర్వాత తిరిగి మళ్లీ పవర్‌కట్ ఫ్రీ సమ్మర్‌ను పరిచయం చేసిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుంది. 24 గంటల నిరంతర కరెంటునిస్తున్నామంటే సీఎం త్రికరణశుద్ధివల్లే సాధ్యమయింది. నెలక్రితం వరకు కూడా ఇక్కమెగా వాట్ విద్యుత్తును కూడా అదనంగా ఉత్పత్తి చేయలేదు. ఉన్న ధర్మల్ పవర్ స్టేషన్లనే సీఎం పొద్దున సాయంత్రం మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడ విద్యుత్తు అంటే అక్కడి నుంచి కొనుగోలు చేశారు. ఇంటర్నల్ ఎఫీషియెన్సీ పెంచడం వంటి కార్యక్రమాలతో పరిశ్రమలకు, గృహావసరాలకు, వ్యవసాయానికి అనుకున్న విధంగా కరెంటునిస్తున్నాం అని మంత్రి వివరించారు. తాగునీటి సమస్య, మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకోనున్న చర్యలను కేటీఆర్ ఈ సందర్భంగా సోదాహరణంగా వివరించారు. పనిచేస్తున్న ప్రభుత్వానికి, నాయకునికి మద్దతివ్వాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో ట్రెడా ప్రెసిడెంట్ పీ దశరథరెడ్డి, క్రెడాయ్ అధ్యక్షుడు ఎస్ రామిరెడ్డి, గ్రేటర్ సిటీ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సీ ప్రభాకర్‌రావు, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ (టీడీఏ) ప్రెసిడెంట్ జీవీ రావు, బిల్డర్లు, తదితరులు పాల్గొన్నారు.