హైదరాబాద్ అందరిదీ

-నగరాన్ని గ్లోబల్ సిటీగా మార్చుకుందాం
-టీఆర్‌ఎస్‌కు అండగా నిలువండి.. నగర ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఎన్నో కులాలు, మతాలు, రాష్ర్టాలవారు ఉన్నారని, దేశ సమగ్రతకు నిదర్శనంగా నిలిచిన ఈ నగరం అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర ఉందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.

.KTR

రాజకీయ ప్రత్యర్థులు తమను దెబ్బకొట్టేందుకే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, చౌకబారు ఆరోపణలతో ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నారని ఆయన బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. టీఆర్‌ఎస్ ఏర్పడిందే తెలంగాణ రాష్ట్రం కోసమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా అన్ని వర్గాలనూ కలుపుకొని తెలంగాణను అభివృద్ధి చేసుకుందామన్నారు. అభివృద్ధి, ఉపాధి, ఉద్యోగావకాశాలు, విద్య రంగాలపై టీఆర్‌ఎస్ దృష్టి పెట్టిందని, సమాజంలోని అన్ని వర్గాల వారికి అవి అందేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అన్ని మతాలు, వాటి సంస్కతుల పట్ల టీఆర్‌ఎస్‌కు గౌరవముందని, అందరినీ గౌరవిస్తూనే గ్లోబల్ సిటీగా హైదరాబాద్‌ను తయారుచేసుకుందామన్నారు. ఇందుకు కులం, మతం అన్న భేదం లేకుండా అన్ని వర్గాలవారు ముందుకువచ్చి టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని కేటీఆర్ కోరారు .తెలంగాణ పునర్నిర్మాణ కార్యంలో తమకు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఆ అధికారులను బదిలీ చేయండి..ఈసీకి టీఆర్‌ఎస్ ఫిర్యాదు

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ కార్యకర్తలను నర్సాపూర్ సీఐ సైదిరెడ్డి, కౌడిపల్లి ఎస్‌ఐ నాగరాజుగౌడ్, పొల్చారం ఎస్‌ఐ అశోక్‌రెడ్డి బెదిరిస్తున్నారని టీఆర్‌ఎస్ ఆరోపించింది. మాజీ మంత్రి

సునితాలక్ష్మారెడ్డికి  మద్దతుగా పని చేయాలని వారు కార్యకర్తలపై ఒత్తిళ్లు తెస్తున్నారని ఆరోపిస్తూ ఆ పార్టీ నేతలు బుధవారం ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సునీతాలకా్ష్మరెడ్డికి మద్దతుగా పనిచేయకుంటే నక్సలైట్లుగా ముద్రవేసి ఎన్నికలు అయ్యేవరకు బెయిల్ దొరక్కుండా చేస్తామని హెచ్చరిస్తున్నారని పేర్కొంది. వెంటనే వారిని ఇక్కడినుంచి బదిలీ చేయాలని కోరింది.