హుస్సేన్‌సాగర్‌కు పూర్వ వైభవం

నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ హైదరాబాద్ గౌరవం పెంచేలా ఉండాలే కానీ, మురికి కూపంగా మారవద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఒకప్పుడు మంచినీటి చెరువుగా భాసిల్లిన హుస్సేన్‌సాగర్‌కు పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పారు. హుస్సేన్‌సాగర్‌లోకి పరిసర ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వృథా నీటిని నివారించి, పరిశుభ్రపరచాలని అధికారులను ఆదేశించారు. సాగర్ పరిసర ప్రాంతాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీచేసిన సీఎం.. నెక్లెస్‌రోడ్డు వద్ద జలాశయంలోకి కలుషిత నీరు రావటాన్ని, దుర్గంధం వెదజల్లుతుండటాన్ని గమనించారు.
-చారిత్రక చెరువును ప్రక్షాళన చేయండి
-మురుగునీరు చేరకుండా డైవర్షన్ నాలాలు
-నిమజ్జనాలకు ప్రత్యామ్నాయ చెరువు
-సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్
-సాగర్ పరిసరాల్లో ఆకస్మిక తనిఖీలు
-శ్రమదానం చేయాలని పిలుపు

KCR Visit Hussaind Sagar Lake
అనంతరం సచివాలయంలో జీహెచ్‌ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్, హెచ్‌ఎండీఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హుస్సేన్‌సాగర్‌ను అందమైన, పరిశుభ్రమైన సరస్సుగా తీర్చిదిద్దడంకోసం అధికారులు పక్కా ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. మురుగు నీరు హుస్సేన్ సాగర్‌లోకి రాకుండా పెద్ద డైవర్షన్ కెనాల్స్ నిర్మించాలని చెప్పారు. హుస్సేన్‌సాగర్ భూభాగంలో ఆక్రమణలు ఉన్నాయని, వీటిని వీలైనంత తొందరలో పరిష్కరించాలని అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డిని ముఖ్యమంత్రి కోరారు. వర్షాకాలంలో మంచినీటిని సాగర్‌లోకి పంపి, షట్టర్లను మూసివేయాలని అధికారులకు చెప్పారు.

నిమజ్జనాలకు వినాయక్ సాగర్
వేల సంఖ్యలో గణేష్ విగ్రహాల నిమజ్జనంవలన ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయనిక రంగులు నీటిలో కలిసి సాగర్ కలుషితమవుతున్నదని అధికారులు పేర్కొనగా.. గణేష్ విగ్రహాల నిమజ్జనంకోసం ప్రత్యామ్నాయంగా ఇందిరాపార్క్‌లో 20 ఎకరాల విస్తీర్ణంలో సరస్సు నిర్మించాలని కేసీఆర్ ప్రతిపాదించారు. ఆ చెరువుకు వినాయక్‌సాగర్ అని పేరుపెట్టి.. అందులోనే గణేష్, దుర్గామాత విగ్రహాలు, బతుకమ్మల నిమజ్జనం జరుపాలని చెప్పారు. ఈ విషయాలపై సూచనలు, సలహాలకోసం త్వరలోనే నగరంలోని ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

సాగర్ ప్రక్షాళనకు శ్రమదానం
హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన కోసం నగరంలోని అన్ని వర్గాలు సహకరించాలని సీఎం కోరారు. సాగర్ ప్రక్షాళనను ప్రజా ఉద్యమంగా చేపట్టాలన్నారు. ఇందుకోసం నాలుగు రోజులు శ్రమదానం నిర్వహించాలని నిర్ణయించారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, అన్నివర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం పిలుపునిచ్చారు. తానుకూడా స్వయంగా పాల్గొంటానని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణ చేపడుతున్నట్లే హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాలన్నారు. హుస్సేన్ సాగర్‌లో పరిధిలోని భూ భాగాన్నంతా పూర్తిగా రక్షించాలని, ఈ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.