మిషన్ కాకతీయకు విరాళాల వెల్లువ

– సీఎం కేసీఆర్‌ను కలిసిన క్రెడాయ్ ప్రతినిధులు
– సంస్థ తరఫున 50 లక్షల చెక్కు అందజేత
– వ్యక్తిగతంగా మరో కోటిపైనే విరాళాలు
– దత్తత తీసుకుంటామని పలువురి ఒప్పందం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం మిషన్ కాకతీయకు విరాళాల వెల్లువ నానాటికీ పెరుగుతున్నది. అనేక సంస్థలతోపాటు వ్యక్తిగతంగా కూడా పులువురు విరాళాలు అందజేస్తున్నారు. కొంతమంది తమ ప్రాంతంలోని చెరువులను దత్తత తీసుకునేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. మంగళవారం క్రెడాయ్ ప్రతినిధుల బృందం క్రెడాయ్ సీఈవో ఎంవీ రాజేశ్వర్‌రావు నేతృత్వంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కలిసింది. ఆ సమయంలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకూడా వారితో ఉన్నారు.

Credai-giving-funds-to-Mission-Kakatiyaమిషన్ కాకతీయకు సంస్థ తరఫున రూ.50 లక్షల చెక్కును క్రెడాయ్ బృందం సీఎంకు అందజేసింది. సంస్థ తరఫున అదనంగా మరో రూ.50 లక్షల రూపాయల విరాళం కూడా భవిష్యత్తులో ఇవ్వనున్నట్లు ప్రతినిధి బృందం హామీ ఇచ్చింది. క్రెడాయ్ ప్రతినిధి బృందంలో బీ సుధాకర్ (చైర్మన్, లోటస్ ప్రాపర్టీస్ లిమిటెడ్), సీ శేఖర్‌రెడ్డి (చైర్మన్, సీఎస్‌ఆర్ ఎస్టేట్స్ లిమిటెడ్), ఆనందరావు (రాఘురామ్ కన్‌స్ట్రక్షన్స్), క్రెడాయ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైవీర్‌రెడ్డి, ఎస్ రామిరెడ్డి, శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ తరఫున నర్సయ్య ఉన్నారు. క్రెడాయ్ సభ్యులు కొందరు చెరువులను దత్తత తీసుకునేందుకు కూడా ముందుకు రావడంపట్ల మంత్రి హరీశ్‌రావు అభినందనలు తెలియజేశారు.

చెరువుల పునరుద్ధరణకు ముందుకు వచ్చినవారు ఆ బాధ్యత తాము తీసుకుంటున్నట్లుగా నీటిపారుదల శాఖతో ఒప్పందం చేసుకున్నారు. వీరు బాధ్యత తీసుకున్న చెరువుల పునరుద్ధరణకు రూ.2కోట్లకుపైగా నిధులు ఖర్చయ్యే అవకాశముందని నీటిపారుదల శాఖ మంత్రి ఓఎస్‌డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే మీడియాకు తెలిపారు. నిధులుకాకుండా పునరుద్ధరణ సమయంలో మ్యాన్ పవర్, యంత్రాల ఉపయోగాన్ని పరిగణలోకి తీసుకుంటే రూ.2 కోట్లకంటే ఎక్కువే ఉంటుందని ఆయన చెప్పారు.