హాస్టళ్లకు సన్నబియ్యం

రాష్ట్రంలోని వసతిగృహాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నామని, వచ్చేనెల నుంచి అమలుచేస్తామని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల మధ్య ఉంటూ హాస్టళ్లలో బసచేసిన తమకు అక్కడి పరిస్థితులు తెలుసని, విద్యార్థులకు నాణ్యమైన సన్నబియ్యం అందించాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకొన్నామని ఈటల తెలిపారు. వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో బుధవారం నెక్లెస్‌రోడ్‌లో నిర్వహించిన ర్యాలీని మంత్రి ప్రారంభించారు.

Etela Rajendar 01

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసరా పింఛన్లకు అర్హులైన వికలాంగులకు వయసుతో పనిలేకుండా అందరికీ అందజేస్తామని స్పష్టంచేశారు. రాష్ట్రసాధనలో వికలాంగుల పాత్ర కీలకమైనదని, అందరి భాగస్వామ్యంతో బంగారు తెలంగాణ సాధిస్తామని ఈటల అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు వికలాంగుల పింఛన్ మొత్తాన్ని రూ.1500కి పెంచామని, అన్నిరకాల పింఛన్లను లబ్ధిదారులకు ఈ నెల 10-15 తేదీల మధ్యలోనే అందజేస్తామని తెలిపారు.

తమకు ఉద్యోగాల్లో మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలని వికలాంగులు కోరగా.. వివిధ విభాగాల్లో సుమారు లక్ష ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్లు తెలిసిందని, దీనిపై నిర్ణయం తీసుకొంటామన్నారు. ఇక పేద, మధ్యతరగతి ప్రజల కోసం గతంలో ఒక్కొక్కరికి ఇస్తున్న నాలుగు కేజీల రేషన్ బియ్యానికి బదులుగా తమ ప్రభుత్వం ఒక్కొక్కరికి ఆరు కేజీల బియ్యం ఇవ్వాలని నిర్ణయించిందని ఈటల తెలిపారు. ఈ వికలాంగుల ర్యాలీలో షకీనం ఫౌండేషన్ కార్యదర్శి సీహెచ్ ఇషాకర్, హెలెన్ కెల్లర్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్ ఉమర్‌ఖాన్, విగ్నేశ ఫౌండేషన్ చైర్మన్ వంశీరామరాజు, సాధన ప్రత్యేక పాఠశాల కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, ఎన్‌పీడీవో అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.