-లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీల స్పష్టీకరణ -ప్రధాని, సీనియర్ మంత్రుల ముందు మౌన నిరసన -ఎంపీలతో చర్చలు జరిపిన రాజ్‌నాథ్, సుష్మ, ఎల్కే అద్వానీ -నిరసన విరమించాలని విజ్ఞప్తి.. తిరస్కరించిన ఎంపీలు -సభలో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్

ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించి తెలంగాణ రాష్ర్టానికి సొంత హైకోర్టును ఏర్పాటు చేయాలని పార్లమెంటులో అలుపెరుగని పోరాటం చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీలు శుక్రవారం వినూత్నంగా నిరసన తెలిపారు. లోక్‌సభలో ప్రధాని, సీనియర్ మంత్రుల ముందు నిలబడి ప్లకార్డులు ప్రదర్శిస్తూ మౌనంగా నిరసన వ్యక్తం చేశారు. ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి సాయంత్రం వాయిదా పడేవరకు నిరసన కొనసాగించారు. టీఆర్ఎస్ సభ్యుల నిరసనను గమనించిన ప్రధాని నరేంద్రమోదీ, పక్కనే కూర్చున్న మంత్రులతో ఈ విషయాన్ని చర్చించారు.
అనంతరం భోజన విరామ సమయంలో హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌లు.. టీఆర్ఎస్ ఎంపీలను పిలిచి హైకోర్టు విభజనపై తాజా పరిస్థితి గురించి చర్చించారు. అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ కూడా ఎంపీలతో చర్చించారు. హైకోర్టు విభజనపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకొంటామని, ఆందోళనను విరమించాలని కోరారు. అయితే, హైకోర్టు విభజనపై సభలో స్పష్టమైన ప్రకటన చేసేవరకూ నిరసన కొనసాగిస్తామని ఎంపీలు స్పష్టంచేశారు.
హైకోర్టు విభజనపై వాయిదా తీర్మానం: లోక్‌సభ శుక్రవారం ఉదయం ప్రారంభం కాగానే టీఆర్ఎస్ సభా పక్ష నాయకుడు జితేందర్‌రెడ్డి హైకోర్టు విభజన కోరుతూ వాయిదా తీర్మానానికి నోటీసులిచ్చారు. ఈ తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. హైకోర్టు విభజనపై చర్చకు అవకాశం ఇవ్వాలని జితేందర్‌రెడ్డి కోరినా స్పీకర్ నిరాకరించటంతో నిరసన వ్యక్తంచేశారు. ప్రశ్నోత్తరాలు కొనసాగుతుండగానే ఎంపీలు జితేందర్‌రెడ్డి, బీ వినోద్‌కుమార్, కల్వకుంట్ల కవిత, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సీతారాం నాయక్, బాల్క సుమన్‌లు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ట్రెజరీ బెంచ్‌ల ముందు మౌన నిరసనకు దిగారు.
లలిత్‌గేట్, వ్యాపం కుంభకోణాలపై కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలుపుతూ గట్టిగా నినాదాలు చేస్తున్న సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు మాత్రం మౌనంగా నిరసన తెలిపారు. వీరికి తెలంగాణ టీడీపీ ఎంపీ సీహెచ్ మల్లారెడ్డి, వైసీపీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మద్దతు పలికారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నేత అద్వానీతో చర్చించిన సమయంలో ఎంపీలు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. కేంద్రం పార్లమెంటులో స్పష్టమైన ప్రకటన చేయకపోతే నిరసనను విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పోరాటం ద్వారా తెలంగాణను సాధించుకున్నామని, ఇప్పుడు హైకోర్టు కోసం కూడా అదేవిధంగా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడటానికి కేంద్రమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. కొందరు సీనియర్ మంత్రులే హైకోర్టు విభజనకు అడ్డుపుల్లలు వేస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు వల్లే ఆలస్యం: కవిత ఉమ్మడి హైకోర్టు విభజన ఆలస్యానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే కారణమని ఎంపీ కవిత విమర్శించారు. శుక్రవారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీకి సొంత హైకోర్టు కోసం నిర్దిష్టంగా స్థలాన్ని, ఇతర వివరాలను హైకోర్టుకు తెలియజేయాల్సి ఉందని, కానీ చంద్రబాబు ఇప్పటివరకూ ఎలాంటి సమాధానం ఇవ్వలేదని విమర్శించారు. రాష్ర్టాలు ఏర్పడి ఏడాది దాటిపోయినా వేర్వేరు హైకోర్టులు లేకపోవడం దురదృష్టకరమన్నారు. హైకోర్టు స్పష్టంగా చెప్పినా చంద్రబాబు స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. కేంద్రం ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకోవాలని, లేదంటే కేంద్ర క్యాబినెట్ సమావేశంలో హైకోర్టు విభజనపై నిర్ణయం తీసుకొని రాష్ట్రపతి ద్వారా గెజిట్‌ను విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు సమావేశాలు జరిగినన్ని రోజులూ హైకోర్టు విభజనపై నిరసన తెలుపుతూనే ఉంటామని ఆమె స్పష్టంచేశారు.