హరితహారంతో పూర్వవైభవం

హరితహారం కింద రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు బీసీ సంక్షేమం,అటవీ పర్యావరణ శాఖ మంత్రి జోగురామన్న తెలిపారు. పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ అధ్యక్షతన బుధవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో హరితహారం అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జోగు రామన్న మాట్లాడుతూ తెలంగాణకు పూర్వవైభవం రావాలంటే అటవీ విస్తీర్ణం పెరగాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ఉమ్మడిరాష్ట్రంలో తెలంగాణలో అటవీ విస్తీర్ణం తగ్గిపోయిందని, ఆ నష్టాన్ని ఇప్పుడు భర్తీచేసుకోవాల్సి ఉందన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు పెంచితే భవిష్యత్ తరాలకు ఢోకా ఉండదన్నారు.

KTR review on Harithaharam

-రాష్ట్రవ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం
-3న యాదగిరిగుట్టలో ప్రారంభం:మంత్రి జోగురామన్న
-ఇన్ని కోట్ల మొక్కలు నాటడం దేశంలో ఇదే ప్రథమం
-ప్రతి ఒక్కరూ సొంతపనిలా భావించాలి: మంత్రి కేటీఆర్
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 40 లక్షలు, ప్రతి పంచాయతీ పరిధిలో 40వేల మొక్కలు నాటాలని సీఎం కేసీఆర్ లక్ష్యంగా నిర్ణయించారని తెలిపారు. వచ్చే నెల 3న యాదాద్రిలో ప్రారంభించే హరితహారం ప్రారంభం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్రపతిని అహ్వానిస్తున్నామని తెలిపారు. హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. ఇంత పెద్దమొత్తంలో మొక్కల పెంపుకోసం చర్యలు చేపడుతున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు.

-నూటికి నూరుపాళ్లు విజయవంతం చేయాలి: మంత్రి కేటీఆర్
తర్వాత మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మానస పుత్రికైన హరితహారంను విజయవంతం చేయాలని కోరారు. ఒకే ఏడాదిలో 230 కోట్ల మొక్కలను నాటాలన్న లక్ష్యం దేశంలోనే తొలి ప్రయత్నమన్నారు. గతంలో చైనా, బ్రెజిల్ మాత్రమే ఈ ప్రయత్నాలు చేశాయని, ప్రపంచంలో మూడో ప్రయత్నంచేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు. హరితహారంను ప్రతి ఒక్కరు సొంత కార్యక్రమంగా భావిస్తే అశించిన ఫలితాలు వస్తాయన్నారు. వచ్చేనెల 3నుంచి శ్రీకారం చుట్టనున్న ఈ కార్యక్రమం అమలు తీరుతెన్నులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి పలు అంశాలపై అన్ని జిల్లాల్లోనూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అధికారుల నుంచి వివరాలు సేకరించి సలహాలు సూచనలను అందించడమే కాకుండా ప్రభుత్వ పరంగా సౌకర్యాలను సమకూర్చి కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో చీఫ్ విఫ్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు గంగులకమలాకర్, సోమారపు సత్యనారాయణ, మనోహర్‌రెడ్డి, బొడిగేశోభ, వొడితెల సతీష్‌కుమార్, సాంస్కృతిక సారథి చైర్మన్ బాలకిషన్, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, టెస్కాబ్ ఛైర్మన్ కొడూరి రవీందర్‌రావు, పంచాయతీరాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్, హరితహారం ప్రత్యేక అధికారి ప్రియాంకవర్గీస్, కలెక్టర్ నీతూ ప్రసాద్, ఎస్పీ జూయల్ డేవిస్, జేసీ పౌసుమి బసు, అధికారులు పాల్గొన్నారు.

-ఉద్యమస్ఫూర్తితో హరితహారం.. అన్ని వర్గాలు పాల్గొనాలి: మంత్రి జూపల్లి పిలుపు
హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమస్ఫూర్తితో విజయవంతం చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. బుధవారం మహబూబ్‌నగర్‌లో రెవెన్యూ సమావేశ మందిరంలో హరితహారంపై నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. వివిధశాఖల అధికారులు, ఉద్యోగులు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

హరితహారంపై విస్తృత ప్రచారం కల్పించాలని, గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేయాలని సూచించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ హరితహారం భవష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిందని, ఇది నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా హరితహారంను విజయవంతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, కలెక్టర్ టీకే శ్రీదేవి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, చిన్నారెడ్డి పాల్గొన్నారు.