హరిత హారం కావాలి

-మూడేండ్లలో పది కోట్ల మొక్కలు నాటాలి
-హైదరాబాద్‌ను పచ్చటి వనంగా మార్చాలి
-సమీక్షలో అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం

రానున్న మూడేండ్లలో తెలంగాణ రాష్ట్రం హరిత వనం కావాలని, అందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, అటవీశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హెచ్‌ఎండీఏ పరిధిలో రానున్న మూడేండ్లలో పదికోట్ల మొక్కలు నాటాలని సూచించారు. ప్రతిఏడాది 3.30 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తిచేయాలని, ప్రతి నియోజకవర్గానికి 40 లక్షలు, ప్రతి గ్రామానికి 33వేల మొక్కలు నాటాలని సూచించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వందకోట్ల చెట్లు ఉన్నాయని అంచనా వేశారు.

CM Chandrashekar Rao_ Haritha Haramరోజు రోజుకు క్షీణిస్తున్న అటవీ విస్తీర్ణాన్ని పెంచాలని, అందుకు యాజమాన్య పద్ధతులను అవలంబించాలని సీఎం సూచించారు. కంపా లేదా ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ ఖాతా నుంచి ఇందుకు నిధులను ఖర్చు చేయాలని కోరారు. అలంకారప్రాయంగా ఉండే మొక్కలుకాకుండా ప్రయోజనకరమైన రావి, వేప, మర్రి, పొగడ, చింత తదితర చెట్లను నాటాలని చెప్పారు. ప్రజలు తాము సహజ అటవీ ప్రాంతంలో తిరుగాడుతున్నట్లు భావించేలా పరిస్థితి ఉండాలన్నారు. సింగపూర్ తరహాలో మొక్కల పెంపకం కార్యక్రమాన్ని నగరాల్లో చేపట్టాలని సూచించారు. చెరువుగట్లపైన, నదుల ఒడ్డున మొక్కలను విరివిగా పెంచాలని చెప్పారు. ప్రతి ఫ్యాక్టరీలో, అన్ని కార్యాలయాల్లో ఎక్కడ చూసినా చెట్లు ఎదగాలని, ప్రభుత్వ కార్యాలయాలు, కాలేజీలు తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో కచ్చితంగా పచ్చదనం కనిపించాలని స్పష్టం చేశారు.

తెలంగాణ అభివృద్ధిని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కి అద్దం పట్టే విధంగా మొక్కల పెంపకం ఉండాలని అన్నారు. ఇందుకుగాను నర్సరీలను విరివిగా ఏర్పాటు చేసి, అందుకు గ్రామ స్థాయిలో ప్రత్యేక స్థలాన్ని గుర్తించాలని ఆదేశించారు. ప్రతి నాలుగునుంచి ఐదు గ్రామాలకు ఓ నర్సరీని ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. ఈ విషయంలో అధికార యంత్రాంగం బాధ్యత పెరిగేందుకు మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చట్టబద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు అటవీ అధికారులను, ఆర్డీవోలను సమన్వయపరిచి, సంయుక్త సమావేశాలను ఏర్పాటుచేసి సూక్ష్మ ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు. ప్రతినెలా ఒక వారాన్ని హరిత వారంగా ప్రకటించాలని ఆదేశించారు. శుక్రవారంనాటి సమీక్షలో అటవీశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, హెచ్‌ఎండీఏ కమిషనర్ నీరబ్ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, అటవీశాఖ ప్రధాన సంరక్షణ అధికారి ఎస్‌బీఎల్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.