గుట్టలో ఆధ్యాత్మిక కేంద్రాలకు ప్రోత్సాహం

నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట ప్రాంతాన్ని ఆధ్యాత్మిక ప్రాంతంగా తీర్చిదిద్దే క్రమంలో అక్కడ మరిన్ని సంస్థలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం ప్రొత్సాహం అందిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ప్రకటించారు.

KCR-Review-on-Yadagirigutta-temple-development

రూ. మూడు వేల కోట్ల పెట్టుబడితో యాదగిరిగుట్ట సమీపంలో 250 ఎకరాలల్లో సిద్ద క్షేత్ర ధామ్‌ నిర్మించే ప్రతిపాదనలను సహ్యోగ్‌ ఫౌండేషన్‌ ముఖ్యమంత్రి ముందు పెట్టింది. సిద్ద క్షేత్ర ధామ్‌లో వైద్య సదుపాయాలు, క్రీడా, వినోద కార్యకలాపాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విద్యాలయాలు, చేతి వృత్తుల ప్రోత్సహక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అమర్‌నాథ్‌, కేదారినాథ్‌, బద్రీనాథ్‌, గంగోత్రి లాంటి దేవాలయాల నమూనాలతో అక్కడ ఆధ్యాత్మిక కేంద్రాన్ని అభివృద్ది చేయనున్నట్లు వెల్లడించారు. ఆ నిర్మాణాలకు కావలసిన సహకారాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి వారికి చెప్పారు. ఫౌండేషన్‌ ప్రతినిధులు జయేష్‌ దేలివాల, అశోక్‌ ధోభి, సురేష్‌షా, శివరాజ్‌ సూరి, రజనీకాంత్‌షా, రాజేష్‌ తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వున్నారు.