గులాబీ ప్లీనరీ నేడే

తెలంగాణ రాష్ట్ర సమితి విస్తృతస్థాయి సమావేశం మంగళవారం జరుగనుంది. గ్రేటర్ హైదరాబాద్.. కొంపల్లిలోని ఆర్డీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించే ఈ సమావేశానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ ప్రజాప్రతినిధులతోపాటు మొత్తంగా 3500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ తొలిసారి పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరవుతున్నారు.

TRS-party-pleenary

-నేడు టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశం
-సీఎం హోదాలో తొలిసారి కేసీఆర్ హాజరు
-పార్టీ భవిష్యత్ కార్యక్రమం ప్రకటన
-అవినీతి నిర్మూలనపై శ్రేణులకు నిర్దేశాలు
-30 లక్షల సభ్యత్వాల నమోదుకు షెడ్యూలు
-ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లోనూ సభ్యత్వానికి ఏర్పాట్లు
-పర్యవేక్షణకు అడ్‌హాక్ కమిటీ ప్రకటించే అవకాశం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న తొలి విస్తృతస్థాయి సమావేశం ఇదే కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సమావేశంలో కేసీఆర్ ప్రసంగం పార్టీ భవిష్యత్తుకు దిక్సూచిగా ఉంటుందని చెప్తున్నారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు భవిష్యత్తులో చేపట్టవలిసిన కార్యక్రమాల మీద కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధనతో చరిత్రను ఆవిష్కరించిన వైనంనుంచి.. నూతన రాష్ట్రంలో అధికారం చేపట్టి పునర్నిర్మాణం వైపు అడుగులు పడుతున్న సందర్భం దాకా పలు అంశాలతో పాటు పార్టీ భవిష్యత్తు విజన్ ఎలా ఉండబోతున్నదీ కేసీఆర్ ప్రసంగంలో చోటు చేసుకుంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

రాజకీయ అవినీతి నిర్మూలనపై ఆయన పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేస్తారని చెప్తున్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతోపాటు, ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో ఏ రీతిన ప్రచారం నిర్వహించాలి… అవినీతిరహితంగా పాలన సాగేందుకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఎలా సహకరించాలనే దానిపై కేసీఆర్ పూర్తిస్థాయి వివరణ ఇస్తారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న పథకాలు, ప్రాజెక్టులపై సభకు హాజరైన వారిలో అవగాహన కల్పించనున్నారు.

సభ్యత్వ నమోదుకు షెడ్యూలు: ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ అనేది కీలక అంశంగా ఉండనుంది. ఇందుకు సంబంధించి సీఎం కేసీఆర్ షెడ్యూలును ప్రకటించనున్నారు. ఎప్పటివరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలి… ఆ తర్వాత బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి కమిటీలను ఏ గడువులోగా పూర్తి చేయాలనే దానిపైనా స్పష్టత ఇచ్చే అవకాశముంది.

అయితే తక్కువ సమయంలోనే నిర్ధేశించుకున్న లక్ష్యం మేరకు సభ్యత్వ నమోదును పూర్తిచేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ నెల 20వ తేదీ వరకూ గడువు నిర్దేశించుకుని ఈ ప్రక్రియను పూర్తిచేసే యోచన ఉందని ఒక నాయకుడు వివరించారు. ప్రతి నియోజకవర్గంలో 25వేల ప్రాథమిక, ఐదు వేల క్రియాశీల సభ్యత్వాలతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 లక్షల సభ్యత్వ నమోదును లక్ష్యంగా
నిర్ధేశించనున్నారు. వీటితో పాటు అదనంగా ఆన్‌లైన్‌లో సభ్యత్వ నమోదును కూడా చేపట్టేందుకు పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది.

తద్వారా ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉండే వారికి కూడా అవకాశం దక్కనుంది. అదేవిధంగా సీఎం కేసీఆర్ సభా వేదికపై ప్రకటించనున్న షెడ్యూల్‌లో భాగంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలనే దానిపై కూడా పార్టీ శ్రేణులకు సూచనలు ఇవ్వనున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నిర్వహించనున్న ప్లీనంను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని కూడా చెప్పనున్నారు. దీనితో పాటు ఏప్రిల్ 27న హైదరాబాద్‌లో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునివ్వనున్నట్లు తెలిసింది. మరోవైపు పార్టీ పునర్నిర్మాణ ప్రక్రియ ముగిసిన తర్వాత శిక్షణ తరగతులను నిర్వహించే అంశాన్ని కూడా పార్టీ శ్రేణులకు తెలపనున్నారు.

పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియపై పర్యవేక్షణకు ఒక అడ్‌హక్ కమిటీ నియమించే యోచనలోఅధిష్ఠానం ఉంది. విస్తృతస్థాయి సమావేశం అనంతరం ఆ కమిటీ నియామకం ఉంటుదని చెప్తున్నారు. ప్రకటించిన షెడ్యూలు సజావుగా జరిగేందుకు ఎప్పటికప్పుడు ఈ అంశాన్ని పరిశీలించడం, అన్ని నియోజకవర్గాలు, జిల్లాలను సమన్వయం చేయడం ఈ కమిటీ బాధ్యతగా ఉంటుంది.

గ్రేటర్‌లో సభ్యత్వాలపై ప్రత్యేక దృష్టి..: గ్రేటర్ హైదరాబాద్‌లో బల్దియా ఎన్నికల అంశం కూడా సమావేశంలో కీలకంగా మారనుంది. గ్రేటర్‌లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకుగాను భారీ ఎత్తున సభ్యత్వ నమోదు చేపట్టాలని కేసీఆర్ సూచించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయడంపై ఆయన పలు సూచనలు చేసే అవకాశముంది. ఇప్పటికే గ్రేటర్‌కు చెందిన నలుగురు మంత్రులను నియోజకవర్గాల వారీగా పర్యవేక్షణ బాధ్యత నిర్వహించాలని సూచించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌లో పార్టీ పునర్నిర్మాణం, మరింత బలోపేతం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అధినేత తగిన సూచనలు ఇవ్వనున్నారు.

విస్తృత ఏర్పాట్లు..: సమావేశానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. సుమారు 60 మంది కూర్చునేందుకు వీలుగా సభా వేదికను సిద్ధం చేశారు. సమావేశంలో పాల్గొనే వారికి భోజన వసతితో పాటు ఆరు పార్కింగ్ స్థలాలను గుర్తించి తగిన ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12 గంటల్లోపు సభా ప్రాంగణానికి చేరుకోవాలని పార్టీ అధిష్ఠానం ఇప్పటికే సందేశాలు పంపించింది. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్‌పర్సన్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇన్‌ఛార్జీలు, డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్‌పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులతో కలిసి దాదాపు 3500 మంది హాజరు కానున్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి.

నేతలకు స్వాగతంపలికేందుకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో కొంపల్లి పరిసరాలు గులాబీ మయంగా మారాయి. సోమవారంనాడు కరీంనగర్ ఎంపీ వినోద్, పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంత్‌రావు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇన్‌చార్జి శంభీపూర్ రాజుతో పాటు కొలన్ హన్మంత్‌రెడ్డి, బాలమల్లు, శ్రీనివాస్‌రెడ్డి, బొంతు రామ్‌మోహన్, రాజేశ్, ప్రశాంత్‌రెడ్డి ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. దూలపల్లి పీఏసీఎస్ చైర్మన్ నవీన్‌కుమార్, డైరెక్టర్ జెమ్మి దేవెందర్,నేతలు కుంట సిద్ధిరాములు, యాస్కి పవన్‌గౌడ్, దేవగారి రాజేందర్‌రెడ్డి తదితరులు ఏర్పాట్లలో పాలుపంచుకున్నారు.