గులాబీ దళపతి మళ్లీ కేసీఆర్!

-పార్టీ అధ్యక్ష పదవికి ఒకే ఒక్క నామినేషన్
-కేసీఆర్ ఎన్నిక ప్రకటన లాంఛనమే
-టీఆర్‌ఎస్‌లో జిల్లా కమిటీలన్నీ ఏకగ్రీవం

KCR

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలకు ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో ఆయన ఏకగ్రీవ ఎన్నిక లాంఛనంగా మారింది. ఈ నెల 24న జరిగే పార్టీ ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌ను ప్రకటించనున్నారు. ఇదే వరుసలో జిల్లా కమిటీలు సైతం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం. క్రమశిక్షణ, ఐక్యత పునాదులుగా గులాబీ పార్టీ సంస్థాగత నిర్మాణం సాగుతున్నది.

రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు పూర్తి చేసుకున్న గులాబీ దళం… అదేరీతిన ఇతర పార్టీలకు భిన్నంగా అన్ని జిల్లాల కమిటీ అధ్యక్ష ఎన్నికలను ఏకగ్రీవంగా పూర్తి చేసుకోవడం రాజకీయంగా రికార్డు సృష్టించింది. టీఆర్‌ఎస్ సంస్థాగత నిర్మాణంలోని కీలకమైన పార్టీ అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాయి. అధిష్ఠానం నిర్దేశించిన మేరకు ఈ నెల 15, 16 తేదీల్లో రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో పదకొండు జిల్లా కార్యవర్గ ఎన్నికలు ముగిశాయి. అన్ని జిల్లాల్లో అధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముందుగానే పార్టీ అధిష్ఠానం ఇచ్చిన మార్గదర్శకాల్లో సాధ్యమైనంత వరకు ఏకగ్రీవ ఎన్నికలకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కృషి చేయాలని సూచించారు.

ముఖ్యంగా పార్టీలోని ఐక్యత, క్రమశిక్షణకు ఏకగ్రీవాలు నిదర్శనంగా నిలువడంతోపాటు పార్టీలో సమన్వయానికి దోహపడతాయని ముందుగానే స్పష్టం చేశారు. దీంతో అధిష్ఠానం సూచనలను అన్ని జిల్లాల్లో నేతలు తూ.చ. తప్పకుండా పాటించడం విశేషం. ఈ క్రమంలోనే జిల్లా పార్టీల అధ్యక్షులందరూ అందరి ఆమోదంతో పగ్గాలు చేపట్టారు. నిర్ణీత సమయంలో గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్ష పదవి ఎన్నికలు జరగనప్పటికీ… ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సూచించిన మేరకు సోమవారం ఆ ఎన్నికను కూడా పూర్తి చేసుకున్నారు. అన్ని జిల్లాల బాటలోనే కీలకమైన గ్రేటర్ హైదరాబాద్ జిల్లా ఎన్నిక కూడా ఏకగ్రీవమై… అందరి ఆమోదంతో మైనంపల్లి హనుమంతరావు గ్రేటర్ పగ్గాలు చేపట్టారు.

గులాబీ సందడి…: టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సోమవారం నామినేషన్ల స్వీకరణ ఉంటుందని ముందుగానే ప్రకటించారు. ఈ మేరకు ఆరు సెట్ల నామినేషన్లు దాఖలు చేయాలని ముందుగానే అనుకున్నారు. ఇందుకు అనుగుణంగా సోమవారం ఉదయం 10 గంటల నుంచే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, స్టీరింగ్ కమిటీ సభ్యులు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. వీరంతా ఆరు నామినేషన్ల సెట్లపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సంతకాలు తీసుకున్నారు. ఆతర్వాత తెలంగాణభవన్‌కు చేరుకుని, నామినేషన్లు దాఖలు చేశారు. తొలుత 11.36 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం తరఫున తొలి నామినేషన్ సెట్ దాఖలైంది.

ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, జిల్లా నాయకులు ఒకేసారి రావడంతో తెలంగాణభవన్‌లో గులాబీ సందడి నెలకొంది. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో హోరెత్తింది. పార్టీ అధ్యక్ష పదవికి ఆరు సెట్ల నామినేషన్లు దాఖలైనప్పటికీ… అన్నింటిలోనూ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేరు మాత్రమే ఉంది. ఒక్కరి పేరే ఉన్నందున ఎన్నిక ఏకగ్రీవమే. అయితే పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీ వేదికగా పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి నాయిని నర్సింహారెడ్డి కేసీఆర్ పేరును పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించనున్నారు. దీంతో అధ్యక్ష ఎన్నిక లాంఛనంగా మారింది.

ఆ నాయకత్వమే శ్రీరామరక్ష: నామినేషన్లు దాఖలు చేసిన అనంతరం పలువురు నేతలు మాట్లాడుతూ… పధ్నాలుగేండ్లు అలుపెరగని పోరాటంతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ నమ్మకంతోనే ప్రజలు ఆయన్ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారని అన్నారు. పార్టీలోని ప్రతి కార్యకర్త కూడా రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చడంతోపాటు సీఎం కేసీఆర్ సారథ్యంలోనే ఇటు పార్టీకి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందనే నమ్మకంతో ఆయన పేరును బలపర్చారని చెప్పారు. ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలే ప్రధాన ఎజెండాగా పార్టీ ప్లీనరీలో తీర్మానాలు జరుగుతాయన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య చక్కటి వారధిగా గులాబీదళం ఏర్పడిందన్నారు. ప్లీనరీ వేదికగా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై పార్టీ అధినేత దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ గులాబీ జెండా ఎగురుతుందన్నారు. ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ పధ్నాలుగేండ్ల పాటు మొక్కవోని దీక్షతో, కష్టనష్టాలకు ఓర్చి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ అధ్యక్షుడిగా ఉండాలని ప్రతి టీఆర్‌ఎస్ కార్యకర్త ఆకాంక్షిస్తున్నారని అన్నారు. ఆయన సారథ్యంలోనే ప్రభుత్వం, పార్టీ ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు.