శ్రీశైలం కరెంటుకు గ్రీన్‌సిగ్నల్

శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తికి మార్గం సుగమమైంది. రాష్ట్ర విద్యుత్ అవసరాలు, రైతుల ఇబ్బందుల దృష్ట్యా శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చంటూ కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి స్పష్టంచేశారు. నవంబర్ 2 తర్వాత విద్యుత్ ఉత్పత్తి చేయవద్దంటూ కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఉత్తర్వుల్లో చెప్పలేదని.. అందువల్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చని ఆమె తెలిపారు. తెలంగాణకు ఎట్టిపరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వబోమని కూడా ఈ సందర్భంగా కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.

-హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి ఉమాభారతి
-కృష్ణాబోర్డు ఉత్తర్వులపై హరీశ్ ఫిర్యాదు
-కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తోనూ మంత్రి భేటీ
-ఏపీ సర్కారు విద్యుత్‌లో వాటా ఇవ్వడం లేదని ఫిర్యాదు
-కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్‌తో సమావేశం
-ప్రాణహిత-చేవెళ్లకు జాతీయహోదా ప్రక్రియ వేగవంతం చేయాలని విజ్ఞప్తి

Green Signal to Srisailam 04-11-14ఒకరోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు.. సోమవారం ఉమాభారతితో భేటీ అయ్యారు. జలవనరులశాఖ కార్యదర్శులు, సంబంధిత ఇతర అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విద్యుదుత్పత్తి, ఏపీ సర్కారు సృష్టిస్తున్న ఇబ్బందులు, కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఉత్తర్వులను ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు.. కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హరీశ్‌రావు వినతికి సానుకూలంగా స్పందించిన ఉమాభారతి.. రాష్ట్ర రైతుల అవసరాల దృష్ట్యా శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేసుకోవచ్చని స్పష్టమైన హామీఇచ్చారు.

ఆ వెంటనే మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర జెన్‌కో చైర్మన్‌కు ఫోన్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. ఉమాభారతితో భేటీ తర్వాత కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌తోనూ హరీశ్‌రావు సమావేశమయ్యారు. విద్యుత్‌లో తెలంగాణకు రావాల్సిన 54 శాతం వాటాని ఏపీ సర్కారు ఇవ్వడం లేదని.. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నదని ఈ సందర్భంగా కేంద్రమంత్రికి ఫిర్యాదుచేశారు.

దీనిపై స్పందించిన పీయూష్.. రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటుచేస్తామని హామీఇచ్చారు. ఆ తర్వాత కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్ ఏబీ పాండ్యతో సమావేశమైన మంత్రి హరీశ్.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌కు జాతీయహోదా కల్పించే ప్రక్రియ వేగవంతం చేయాలని.. వివిధ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు.

రైతుల అవసరాలు తీరే వరకు విద్యుత్ ఉత్పత్తి: హరీశ్‌రావు
ఉమాభారతితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి హరీశ్‌రావు.. శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వల్ల రాష్ర్టానికి జరుగుతున్న నష్టాన్ని కేంద్ర జలవనరులశాఖ మంత్రి దృష్టికి తీసుకురావడం కోసమే ఢిల్లీ వచ్చానని వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర విద్యుత్ కొరత, శ్రీశైలం ప్రాజెక్ట్‌లో విద్యుదుత్పత్తి, రైతుల ఇబ్బందులు, ఏపీ సర్కారు పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న తీరును ఉమాభారతి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కృష్ణానదీ యాజమాన్య బోర్డు తన అధికారాల పరిధిని మించి తీసుకుంటున్న నిర్ణయాలను కూడా కేంద్రమంత్రికి వివరించామని చెప్పారు.

తమ వినతిపత్రాన్ని ఉమాభారతి అధికారులతో లోతుగా చర్చించారని.. నవంబర్ 2 తర్వాత విద్యుదుత్పత్తి చేయెద్దంటూ యాజమాన్య బోర్డు ఉత్తర్వుల్లో చెప్పలేదని.. అందువల్ల విద్యుదుత్పత్తి చేసుకోవచ్చని ఆమె స్పష్టంచేసినట్లు హరీశ్ పేర్కొన్నారు. కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు ఫిర్యాదులు ఇచ్చిందని.. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. శ్రీశైలం కుడిగట్టు కాలువ నుంచి పోతిరెడ్డిపాడు రిజర్వాయర్‌కు కేవలం 34 టీఎంసీల నీటిని మాత్రమే తరలించాల్సి ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకూ 90 టీఎంసీల నీటిని తరలించిందని, దీనిపై కృష్ణానదీ బోర్డుకు ఫిర్యాదుచేసినా చర్యలు తీసుకోలేదని ఉమాభారతికి తెలిపినట్లు హరీశ్ చెప్పారు.

ఇక హంద్రీనీవా ప్రాజెక్టుకు కేటాయింపులు లేకపోయినా ఏపీ సర్కారు నీటిని తరలిస్తుందని కూడా బోర్డుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు హరీశ్ పేర్కొన్నారు. ఈ రెండు ఫిర్యాదులపై అధికారులతో చర్చించిన ఉమాభారతి 48 గంటల్లో చర్యలు తీసుకోవాల్సిందిగా తమముందే ఆదేశించినట్లు మంత్రి వివరించారు. విద్యుత్ కొరత వల్ల రాష్ట్ర రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. వాళ్ల అవసరాలు తీరే వరకు విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తామని మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు.

మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన వినతిపత్రంలోని అంశాలు
-తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ సర్కారు కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు అక్టోబర్ 21న లేఖ రాసింది. అందులో తెలంగాణపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దాని ఆధారంగా కృష్ణాబోర్డు అక్టోబర్ 30న ఇరు రాష్ర్టాల సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆ రాష్ట్రం చేసిన ఫిర్యాదు నకలు ప్రతిని తెలంగాణ ప్రభుత్వానికి బోర్డు ఇప్పటికీ ఇవ్వలేదు. దీంతో మా ప్రభుత్వ వివరణ ఇచ్చే అవకాశమే లేకుండా పోయింది.
-కేవలం శ్రీశైలంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విద్యుదుత్పత్తిపైనే సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఆ మేరకు ఒక ఉత్తర్వును రూపొందించింది. అయితే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ సర్కారు తీసుకోవాల్సిన నీళ్లెన్ని? ఇప్పటికే ఎంత వినియోగించింది? తదితర వివరాల్లోకి బోర్డు అధికారులు వెళ్లలేదు.
-కృష్ణాబోర్డు చైర్మన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ అభిప్రాయాలను అసలు పరిగణనలోకి తీసుకోలేదు. బోర్డు సభ్యుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోకుండానే చైర్మన్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఆక్షేపణీయం.
-కృష్ణాబోర్డు తనకు సంక్రమించిన అధికారాల పరిధిని దాటి వ్యవహరించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 85(8) ప్రకారం గతంలో బోర్డులు/ట్రిబ్యునళ్లు వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం ఈ రెండు రాష్ర్టాలూ ప్రాజెక్టుల నీటిని వినియోగించుకోవడంపై క్రమబద్ధీకరించే విధులకు మాత్రమే పూనుకోవాల్సి ఉంది. అయితే ఏపీ సర్కారు మళ్లించిన నీటి విషయం జోలికి మాత్రం బోర్డు వెళ్లలేదు.
-సమావేశంలో తెలంగాణ ప్రతినిధులు.. పదేపదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్నదని, స్పష్టమైన ఆదేశాలు లేకపోయినా నీటిని తరలిస్తుందని చెప్పినా బోర్డు చైర్మన్ మాత్రం ఈ వాదనలను పట్టించుకోలేదు. అక్టోబర 30వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకున్న నీటి వివరాల ప్రకారం కేటాయించిన దానికంటే ఎక్కువే వాడుకున్నది.
-తెలంగాణలో సుమారు 40 లక్షల ఎకరాల్లో పంటలు చేతికందడానికి సిద్ధంగా ఉన్నాయని, ఇందులో సుమారు 20 లక్షల ఎకరాల్లోని పంటలకు బోరుబావుల ద్వారా నీటిని అందించాలని, అందుకు శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి చాలా అవసరమని తెలంగాణ తరఫున ఈ సమావేశానికి హాజరైన ఇంజినీర్-ఇన్-చీఫ్ స్పష్టంగా చెప్పినా బోర్డు చైర్మన్ పెడచెవిన పెట్టారు.
-గతంలో జారీచేసిన జీవో 69, 107ల గురించి చర్చించినా 2005లో జారీ అయిన జీవో 233 గురించి మాత్రం బోర్డు చైర్మన్ ఆలోచించలేదు. తొలి రెండింటి తర్వాతనే మూడో జీవో విడుదలైందని, దీనిని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పినా ప్రయోజనం లేకపోయింది.
-కృష్ణానదీ జలాల వివాదాల ట్రిబ్యునల్-1 ప్రకారం కేవలం 34 టీఎంసీల నీటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టులో వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఇంతకంటే చాలా ఎక్కువగానే వాడుకుంది. బోర్డు ఈ విషయం లోతుల్లోకి వెళ్లలేదు.
-శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా విడుదలవుతున్న నీరు నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో నిలువ చేసుకోవచ్చని చెప్పినా బోర్డు వినలేదు. నవంబర్ 2వ తేదీ తర్వాత విద్యుత్ అవసరం ఇప్పుడున్న స్థాయిలో ఉండకపోవచ్చన్న అభిప్రాయానికి వచ్చిన కృష్ణా బోర్డు చైర్మన్ ఆదేశాలు జారీచేశారు. ఆయన ఆదేశాల ప్రకారం 2వ తేదీ తర్వాత విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలన్న ఆదేశం ఎక్కడా లేకపోయినా ఉత్పత్తిని తగ్గించాలన్న భావం స్ఫురిస్తున్నది. అందువల్ల బోర్డు ఉత్తర్వులు గందరగోళాన్ని సృష్టించేవిగా ఉంది.
-తెలంగాణ రైతుల విద్యుత్ అవసరాలు, కోతకొచ్చిన పంటలు తదితరాలను దృష్టిలో పెట్టుకుని ఈ అంశంలో చొరవ తీసుకుని తగిన ఆదేశాలు జారీచేయగలరు. కృష్ణానదీ యాజమాన్యబోర్డు తదుపరి సమావేశం ఈ నెల 15న ఉన్నందున అప్పటివరకు బోర్డు ఉత్తర్వులపై స్టే ఇవ్వగలరు.