గ్రేటర్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా మైనంపల్లి ఏకగ్రీవం

-ప్రతిపాదించిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
-బలపర్చిన మంత్రులు టీ పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్
-ఎన్నికల అధికారిగా వ్యవహరించిన మంత్రి మహేందర్‌రెడ్డి
గ్రేటర్ హైదరాబాద్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా మైనంపల్లి హన్మంతరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ భవన్‌లో సోమవారం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష ఎన్నికల్లో మైనంపల్లి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన మంత్రి మహేందర్‌రెడ్డి ప్రకటించారు.

Mainampally Hanmantha Rao

తొలుత గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పోటీ చేసే వారి పేరును ప్రతిపాదించాలని మహేందర్‌రెడ్డి కోరగా మైనంపల్లి హన్మంతరావు పేరును ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రతిపాదించారు. మంత్రులు టీ పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ బలపర్చారు. మరెవరైనా పేర్లు ప్రకటిస్తారా..? అని కోరినా స్పందనలేకపోవడంతో మైనంపల్లి ఎకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆరు నెలలు కష్టపడితే జీహెచ్‌ఎంసీపై గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ను గెలిపించి హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసుకుందామని సూచించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 27న నిర్వహించనున్న టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ సభకు 1.50 లక్షల మంది హాజరు కావాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్, మంత్రులు, జీహెచ్‌ఎంసీ పరిధి నియోజకవర్గ ఇన్‌చార్జీలు, కార్యకర్తలు తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మైనంపల్లి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చింతల కనకారెడ్డి, పుటం పురుషోత్తంరావు తదితరులు పాల్గొన్నారు.