గ్రామీణ ప్రజల సమగ్రాభివృద్ధే లక్ష్యం

అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ పౌరసేవలను అందించేందుకు రాష్ట్రంలో ఈ-పంచాయతీలను ఏర్పాటు చేయనున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడం, గ్రామీణ ప్రజల సమగ్రాభివృద్ధి లక్ష్యాలుగా పెట్టుకుని ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు.
-పంచాయతీరాజ్ వ్యవస్థల బలోపేతానికి సిద్ధం
-అధునాతన పరిజ్ఞానంతో ఈ-పంచాయతీలు
-సోషల్ కాపిటల్ నిర్మాణంలో ముందున్నాం
-మంత్రి కే తారకరామారావు వెల్లడి
-పంచాయతీరాజ్ శాఖల బలోపేతంపై ఎన్‌ఐఆర్‌డీలో మేధోమథనం

KTR in Brainstorming session with Panchayath raj department

పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల బలోపేతంపై ఆదివారం హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ)లో జరిగిన మేథోమథన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కేంద్ర పంచాయతీరాజ్ కార్యదర్శి విజయానంద్, కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారులు, విశ్రాంత ఐఏఎస్‌లు, నిపుణులు పాల్గొన్నా ఈ సమావేశంలో వివిధ అంశాలను సుదీర్ఘంగా చర్చించారు. గ్రామ పంచాయతీలను బలోపేతం చేసేందుకు అందించాల్సిన సహకారం, అందుకోసం ప్రస్తుత చట్టాల్లో తేవాల్సిన మార్పులు, నూతన విధానాల రూపకల్పన తదితర అంశాలను వక్తలు ప్రస్తావించారు.

మంత్రి కేటీఆర్ గ్రామీణాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గ్రామాల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, ఆయన మార్గదర్శకత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థల పటిష్టతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గ్రామ పంచాయతీలను బలోపేతం చేసేందుకు దేశంలోని వివిధ రాష్ర్టాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 4.20లక్షలకు పైగా ఉన్న స్వయం సహాయక సంఘాలకు దాదాపు రూ.3620 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీని ఇచ్చామని తెలిపారు.

సోషల్ క్యాపిటల్ నిర్మాణంలో అనేక రాష్ర్టాల కన్నా ముందు వరుసలో ఉన్నామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమంతో గ్రామాల నుంచే ప్రభుత్వ విధానాలు రూపకల్పనకు శ్రీకారం చుట్టామని, సరైన సమాచారం లేకపోవడమే ప్రభుత్వ విధానాలకి అసలైన అడ్డంకి అని భావించి సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమం చేపట్టామని చెప్పారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో కీలకమైన ప్రజాప్రతినిధులకు గౌరవవేతనాలు పెంచి వారిలో విశ్వాసాన్ని పెంచామని వెల్లడించారు.

-మేధోమథనం అభినందనీయం..
నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయడానికి మేధోమథనం నిర్వహించడం నిజంగా అభినందనీయమని భారత ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి విజయానంద్ ప్రశంసించారు. కొత్త రాష్ట్రం కావడంతో సరికొత్తగా ముందుకు వెళ్లవచ్చని, ఈ దిశగా మంచి చర్యలు చేపట్టారని మంత్రి కేటీఆర్‌ను అభినందించారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని బాగా ఉపయోగించుకున్నారని, గ్రామాల్లో ప్రజలను చైతన్య వంతులను చేసి పన్నుల వసూళ్లు పెంచారని ప్రశంసించారు. ప్రభుత్వ పథకాల్లో ప్రజలను మరింత భాగస్వాములను చేసే విధానాలను రూపొందించాలని కోరారు.

పంచాయతీరాజ్ సంస్థల బలోపేతానికి అధ్యయనం కోసం ఒక ఎమ్మెల్యేల బృందాన్ని కేరళ రాష్ర్టానికి పంపించాలని సూచించారు. సూచనలు ,సలహాలు ఇచ్చిన అధికారులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. వాటిని సానుకూలంగా స్వీకరించి, రాష్ర్టాన్ని దేశంలో అదర్శంగా ఉండేలా చూస్తామని అన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్‌పీటర్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, వివిధ విభాగాల అధిపతులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.