గ్రామాల్లోనూ ప్రభుత్వాలు

-ప్రజల అవసరాలు తీర్చేలా పథకాలు
-పంచాయతీరాజ్ వ్యవస్థలో సమూల మార్పులు
-క్షేత్రస్థాయి సూచనలతో కొత్త చట్టం రూపకల్పన
-మంత్రి కేటీఆర్ వెల్లడి

KTR

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలు, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ పథకాల విధివిధానాలు రూపొందిస్తామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగా, గ్రామాల్లోనూ ప్రభుత్వాలు ఏర్పడాలన్నదే తమ ఆశయమన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆలోచనలకు అనుగుణంగా, గ్రామాల స్వయం సంవృద్ధి కోసం గ్రామపంచాయతీ వ్యవస్థలో సమూల మార్పులు తేవాలని యోచిస్తున్నట్లు తెలిపారు.

 

ఇందుకు కొత్త పంచాయతీరాజ్ చట్టం రూపకల్పనకు కసరత్తు చేస్తున్నామని ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో చెప్పారు. కొత్త చట్టం రూపకల్పనకు కేరళలో పర్యటించినట్లు చెప్పిన కేటీఆర్.. త్వరలో కర్ణాటకలో పర్యటిస్తామన్నారు. ఇప్పటికే ప్రజల ఆలోచనలకు తగ్గట్టుగానే ప్రభుత్వ విధానాలు రూపొందించాలనే ఉద్దేశంతోనే మన ఊరు- మన ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి వెల్లడించారు. గ్రామ పంచాయతీల బలోపేతానికి, అసలైన అధికార వికేంద్రీకరణకు అర్థం వచ్చేలా, నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దంపట్టేలా చట్టం తెచ్చేందుకు యోచిస్తున్నామని కేటీఆర్ తెలిపారు.

సీఎంతో పూర్తిస్థాయిలో చర్చించిన తర్వాతే దీనిపై ముందుకు వెళ్తామన్నారు. గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న సుమారు 29 ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందిని పంచాయతీ పరిధిలోకి తీసుకువచ్చేలా కృషిచేస్తామని తెలిపారు. గ్రామ స్థాయిలోని అధికారులంతా, సర్పంచ్ నాయకత్వంలో నడిచే పంచాయతీలకి జవాబుదారిగా పనిచేసేలా చూస్తామని చెప్పారు. గ్రామ ప్రభుత్వాల ఏర్పాటు ఎంత ముఖ్యమో, గ్రామ పంచాయతీలను స్వయం సంవృద్ధిగా మార్చడం అంతే ముఖ్యమని మంత్రి చెప్పారు.

పన్నులు కట్టే పౌరులకు రాయితీలు కల్పించడం, ప్రజల సొమ్ము ప్రజల కోసమే అంటూ విస్తృతమైన ప్రచారం కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టే యోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కొత్త చట్టంలో పంచాయతీ సెక్రటరీలు, సర్పంచ్‌లకు ప్రాధాన్యం కల్పిస్తామని, వారి సమన్వయంతో విధులు నిర్వహించేలా విధానాలు రూపొందిస్తామన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌ల అధికారాలు, విధులు, నిధుల దుర్వినియోగంవంటి అంశాల్లో తలెత్తే వివాదాల పరిష్కారానికి జిల్లా స్థాయిలో ట్రిబ్యునళ్లను, అంబుడ్స్‌మన్‌వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేసే అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 5372 క్లస్టర్లతోపాటు సుమారు ఎనిమిది వేలకు పైచిలుకు పంచాయతీలున్నాయన్నారు. తాండాలను గ్రామపంచాయతీలుగా మారిస్తే వచ్చే మరో 1200 అదనపు పంచాయతీల్లో సమూల మార్పులు తీసుకువచ్చేలా నూతన చట్టానికి రూపకల్పన చేస్తామని మంత్రి తెలిపారు. మహిళా సంఘాలకు గ్రామాభివృద్ధిలో ప్రాధాన్యం ఇచ్చేలా కొత్త చట్టాన్ని రూపొందిస్తామన్నారు.

గ్రామాల్లో ఏర్పాటు చేయబోయే ఈ-పంచాయతీలను, వాటర్‌గ్రిడ్ విలేజ్ నెట్‌వర్క్‌ను మహిళాసంఘాలకు అప్పగించాలని ఇప్పటికే విధాన నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రాథమిక దశలోనే ఉన్న కొత్త పంచాయతీరాజ్ చట్టం రూపకల్పన క్షేత్రస్థాయి నుంచి వచ్చే సలహాలు, సూచనల మేరకే జరుగుతుందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.