గ్రామాల్లోకి హైటెక్ సేవలు

-ఈ-పంచాయతీలుగా 2400 గ్రామాలు
-ఇక సొంత ఊర్లోనే 15రకాల సేవలు
-పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే లక్ష్యం
-ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష

KTR

రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం, గ్రామాల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. త్వరలో 2400 గ్రామపంచాయతీలను ఈ-పంచాయతీలుగా మార్చాలని నిర్ణయించింది. గ్రామస్థాయిలోనే పరిష్కరించుకోదగ్గ పనుల కోసం మండల కేంద్రాల్లోని కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమలేకుండా చర్యలు తీసుకోనుంది. దీంతో ఉపాధిహామీ, పెన్షన్లు, వాటర్‌షెడ్ పనులు, ఇంటిపన్ను వసూలు, లేఅవుట్ ఫీజులు, జనన, మరణ ధృవీకరణ పత్రాలు, కుల, ఆదాయ, స్థానిక సర్టిఫికెట్లు తదితర 15రకాల ప్రభుత్వ సేవలు గ్రామాల్లోనే అందుబాటులోకి రానున్నాయి.

పంచాయతీరాజ్ వ్యవస్థపై సచివాయలంలో బుధవారం పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఒక్క అడుగుదూరంలో మన సౌకర్యాలు అనే పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. మొదటి విడతగా రాష్ట్రంలోని ఎంపిక చేసిన 2400 గ్రామ పంచాయతీల్లో ఇంటర్నెట్ అనుసంధానంతో ఈ సేవలను ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. ఇందుకోసం కంప్యూటర్, హార్డ్‌వేర్ పరికరాలను ప్రభుత్వం సమకూర్చనుంది. ఇప్పటికే కంప్యూటర్లు కొనుగోలు చేసిన పంచాయతీలకు డేటా కార్డులు, టీవీ కేబుల్, వీ శాట్ ద్వారా ఇంటర్నెట్‌ను అందించనున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పరిధిలో ఉండే కార్యదర్శి, వీఆర్‌వో, అంగన్‌వాడీ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తదితరులందరినీ భాగస్వాములను చేస్తారు. ఈ గ్రామాల్లో ఫలితాలను అధ్యయనం చేసిన తర్వాత రాష్ట్రంలోని మిగిలిన అన్ని గ్రామాలకు ఈ-సేవలను విస్తరించనున్నారు. ఈ-పంచాయతీ వ్యవస్థకు కేంద్రప్రభుత్వ సంస్థలు ఎన్‌ఐసీ, సీజీజీ, ఐటీశాఖలు సాంకేతిక సహకారం అందిస్తాయి. ఈ పథకం అమలు వల్ల పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని పేర్కొన్నారు. సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్‌శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శులు రేమండ్ పీటర్, హరిప్రీత్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.