గ్రామజ్యోతిని విజయవంతం చేయాలి

-ప్రతి గ్రామంలో సమస్యలను గుర్తించాలి: డిప్యూటీ సీఎం కడియం

Kadiyam srihari

ప్రజలు సంఘటిత శక్తిని చాటి గ్రామజ్యోతిని విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా గ్రామజ్యోతిలో భాగస్వాములు కావాలని కోరారు. 17 నుంచి 23 వరకు ప్రభుత్వం గ్రామజ్యోతిని తొలిదశ నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం వరంగల్ జెడ్పీ హాల్లో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, అన్ని ప్రభుత్వశాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ వారంపాటు జరిగే గ్రామజ్యోతిలో నాలుగేండ్ల కోసం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పంచాయతీకి వచ్చే నిధులను ప్రజా అవసరాలు, మౌలిక వసతుల కల్పన కోసం వెచ్చించేలా ప్రణాళికలు ఉండాలని తెలిపారు. ప్రజలు సంఘటితమైన గ్రామాలు అభివృద్ధి చెందాయని, గీసుగొండ మండలంలోని గంగదేవిపల్లి దీనికి నిదర్శనమని వివరించారు. గ్రామజ్యోతిని పురస్కరించుకొని ప్రతి గ్రామంలో రెండు నెలల్లో వైకుంఠధామాలు నిర్మించనున్నట్లు వెల్లడించారు.