గ్రామజ్యోతితో సమీకృత అభివృద్ధి

-క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రి కేటీఆర్

KTR review on gramajyothi
గ్రామాల సమీకృత అభివృద్ధి కోసమే గ్రామజ్యోతి కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు పంచాయితీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు. గ్రామాల రూపురేఖలు సమూలంగా మార్చే ఈ కార్యక్రమాన్ని పారిశుద్ధ్య పనులతో ప్రారంభించనున్నట్లు స్పష్టంచేశారు. గ్రామజ్యోతి కార్యక్రమంపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్‌కమిటీ సచివాలయంలో సోమవారం సమావేశమైంది. దీనికి అధ్యక్షత వహించిన కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజల సంపూర్ణ భాగస్వామ్యంతో గ్రామాల అభివృద్ధికి బాటలు వేసేందుకు గ్రామజ్యోతిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. పారిశుద్ధ్య వారోత్సవాలతో గ్రామాల సమీకృత అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నట్లు స్పష్టం చేశారు. పారిశుద్ధ్యంతోపాటు తాగునీరు, విద్య, సామాజిక భద్రత, వ్యవసాయం, ఆరోగ్యం, పేదరిక నిర్మూలన, గ్రామీణ మౌలిక వసతుల కల్పన వంటి అంశాలతో గ్రామజ్యోతిని ప్రారంభిస్తున్నట్లు మంత్రి వివరించారు.

క్యాబినెట్ సబ్‌కమిటీ నిర్ణయాలు
గ్రామజ్యోతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సన్నాహక సమావేశాలు నిర్వహించాలని క్యాబినెట్ సబ్‌కమిటీ నిర్ణయించింది. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులతోపాటు ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని సూచించింది. ప్రాథమికంగా గ్రామజ్యోతి షెడ్యుల్‌పై సమావేశంలో చర్చ జరిగింది. ముఖ్యమంత్రి అనుమతి తర్వాత పూర్తిస్థాయి షెడ్యుల్‌ను విడుదల చేయాలని సబ్‌కమిటీ నిర్ణయించింది. సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటల రాజేందర్, మహేందర్‌రెడ్డితోపాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.