వేయి కోట్లతో గిడ్డంగుల నిర్మాణం

– ప్రతి నియోజకవర్గంలో గిడ్డంగులుండాలి
– ప్రతిపాదనలు తయారు చేయండి
– అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో గిడ్డంగుల నిర్మాణాలు జరగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ఇవి రైతులకు ప్రయోజనకరంగా ఉండాలన్నారు. ఇందుకు ప్రతిపాదనలు సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన సచివాలయంలో మంత్రి హరీశ్‌రావుతో కలిసి మార్కెటింగ్‌శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

గిడ్డంగుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను అంగీకరిస్తూ నాబార్డు రూ.1000 కోట్లను మంజూరుచేసింది. ఈ నిధులతో ప్రతి నియోజకవర్గంలో గిడ్డంగులను నిర్మించాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మార్కెట్లు, వాటి పరిధిలో గిడ్డంగులు ఎన్నిఉన్నాయి? ఇంకా ఎన్ని అవసరమవుతాయి? అనే వివరాలను అధికారులను అడిగారు. ప్రస్తుతం 150 మార్కెట్లు ఉన్నట్లు, కొత్తగా 39 మార్కెట్లకోసం నోటిఫికేషన్ ఇచ్చినట్లు అధికారులు సీఎంకు తెలిపారు.

మంత్రులు, ఎమ్మెల్యేల సహకారం తీసుకోండి
గిడ్డంగుల నిర్మాణానికి స్థలాలు లేకపోతే స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చించి, నిర్మాణానికి అవసరమైన భూమిని సమీకరించాలని సూచించారు. మొదటి దశలో భూసేకరణ అవసరంలేకుండా నిర్మాణాలు చేయడానికి అనువుగా ఉన్న స్థలాలను గుర్తించి వెంటనే నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి మార్కెట్‌లో ఫర్టిలైజర్స్ (రసాయన ఎరువులు), ప్రజాపంపిణీకి అవసరమైన ధాన్యంతోపాటు రైతులు తమ పంటలను నిల్వచేసుకునేలా గిడ్డంగుల నిర్మాణం ఉండాలని తెలిపారు. వరంగల్ జిల్లా ములుగు మార్కెట్ పరిధిలో మంగపేట, ఏటూరునాగారం మండలాలు ఉన్నాయని, ఇవి ములుగు మార్కెట్ యార్డుకు చాలా దూరంలో ఉంటాయని సీఎం చెప్పారు. ఇలాంటిచోట్ల రైతులు మార్కెట్ వద్దకు వచ్చి ధాన్యాన్ని నిల్వ చేసుకోలేరని అన్నారు. మారుమూల ప్రాంతాల రైతులకు అందుబాటులో ఉండేలా గిడ్డంగులు నిర్మించాలన్నారు. ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఎరువులను దింపే రేక్‌లను పెంచాలి
రాష్ట్రానికి ఎరువులు గూడ్స్ రైళ్ల ద్వారానే తయారీ ప్రాంతాలనుంచి వస్తున్నాయని, ఈ ఎరువులను దింపే రేక్ (రైల్వే అన్‌లోడ్ పాయింట్స్)లను పెంచాలని సీఎం కేసీఆర్ అధికారులకు చెప్పారు. ఈ పాయింట్స్ తక్కువగా ఉండడంతో రాష్ట్రంలోని రైతులందరికీ ఎరువులు సరఫరా చేయడానికి రవాణ ఖర్చు పెరుగుతుందని, రేక్‌పాయింట్స్ పెంచితే ఖర్చులు తగ్గి, రైతులపై భారం తగ్గుతుందని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గాల్లో ఉప్పల్, అదిలాబాద్‌లో బాసర, రంగారెడ్డిలో వికారాబాద్, నల్లగొండ జిల్లాలో బీబీనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలకు మహబూబాబాద్‌లలో రేక్ పాయింట్స్‌ను ఏర్పాటు చేయాలని అన్నారు. ఇందుకు అవసరాన్ని బట్టి రైల్వే అధికారుల సహకారం తీసుకోవాలని, వారితో చర్చించాలని సూచించారు. అవసరమైతే నిధులను ఏర్పాటు చేద్దామని అన్నారు.