జీహెచ్‌ఎంసీలో మా బలం చూపిస్తాం..

రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ బలమేంటో చూపిస్తామని పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.
-కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసంతోనే టీఆర్‌ఎస్‌లో చేరికలు
-పీఆర్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్

KTR press met

తెలంగాణలో టీఆర్‌ఎస్ తిరుగులేని శక్తిగా మారడంతో అనేకమంది పార్టీలో చేరేందుకు ముందుకొస్తున్నారని అన్నారు. సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ బలంగా ఉందో.. బలహీనంగా ఉందో వచ్చే జనవరిలో తేలుతుందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఆయన నాయకత్వంలో పనిచేయడానికే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని వారే ప్రకటిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
నిరంతర విద్యుత్, రోడ్లు, పారిశ్రామిక పాలసీ ఇలా అనేక పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని మంత్రి చెప్పారు. టీఆర్‌ఎస్ ఉద్యమ పార్టీ నుంచి రాజకీయపార్టీగా మారిందని 2014 ఎన్నికల సమయంలోనే కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. రాజకీయాల్లో పార్టీలు మారడం, నాయకులు, కార్యకర్తలు చేరడం ఏదో కొత్తగా జరుగుతున్నట్టు కొందరు భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. మీ పార్టీల్లో చేరుతామని ఎవరైనా నాయకులు ముందుకొస్తే వారిని చేర్చుకోకుండా ఉంటారా అని ప్రతిపక్షాలను మంత్రి ప్రశ్నించారు.

ఈ విషయంలో ప్రతిపక్షాలు చిల్లర ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. పార్టీ మారుతున్న నాయకులు నాలుగైదుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారేనని, దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నవారని అన్నారు. వారెవరూ చిన్న పిల్లలు కాదని చెప్పారు. తమ పార్టీలోకి వస్తున్న వారిని తాము ప్రలోభ పెట్టలేదని మంత్రి స్పష్టంచేశారు. వారికి అన్ని విషయాలు తెలిసే కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి ముందుకొస్తున్నారని అన్నారు.