గాఢాంధకారం నుంచి వెలుగుజిలుగుల తెలంగాణ

-వ్యవసాయానికి 24 గంటలపాటు విద్యుత్
-23 లక్షల పంపుసెట్లకు ప్రయోగాత్మకంగా వచ్చే యాసంగినుంచి శాశ్వతప్రాతిపదికన
-రైతులు ఆటోస్టార్టర్లను తొలిగించుకోవాలి
-రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన
-సౌరవిద్యుత్ ఉత్పత్తిలో మనమే నంబర్‌వన్
-పంపిణీ, సరఫరా బలోపేతానికి చర్యలు
-ఇప్పటికే 574 సబ్‌స్టేషన్లు కొత్తగా నిర్మించాం
-42 వేల కోట్లతో మరిన్ని కొత్త సబ్‌స్టేషన్లు
-హైదరాబాద్‌లో నిరంతర విద్యుత్‌కు వీలుగా జీహెచ్‌ఎంసీ చుట్టూ.. 142 కి.మీ. మేర 400 కేవీ రింగ్ సిస్టం
-విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాల జాతర
-మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: కేసీఆర్

గత పాలకుల నిర్లక్ష్యవైఖరి, ప్రణాళికాలోపంతో తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో గాఢాంధకారం అలుముకుని ఉంటే.. ఈరోజు స్వరాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా అవుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. తెలంగాణ ఏర్పడిన సమయానికి రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 6574 మెగావాట్లుంటే.. గడిచిన మూడున్నరేండ్లలోనే అదనంగా 7981 మెగావాట్లను సమకూర్చుకొన్నామని తెలిపారు. ఫలితంగా నేడు రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 14,555 మెగావాట్లకు పెరిగిందని వివరించారు. భావి అవసరాలకోసం మరో 13,752 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కొత్త ప్లాంట్ల నిర్మాణం జరుగుతున్నదని చెప్పారు.
కొత్తగా తీసుకువచ్చిన సోలార్ విద్యుత్ పాలసీ ఫలితంగా 2792 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తితో దేశంలోనే అగ్రగామిగా నిలిచామని సీఎం ప్రకటించారు. బుధవారం శాసనసభలో ప్రశ్నోత్తరాలు ముగిసిన తరువాత రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనచేశారు. విద్యుత్ పంపిణీ, సరఫరా వ్యవస్థల బలోపేతానికి రూ.12,136 కోట్లతో చర్యలు తీసుకున్నామని తెలిపారు. మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. రాబోయే మూడు నాలుగేండ్లలో పంపిణీ, సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడానికి రూ.42 వేల కోట్ల పెట్టుబడితో సబ్‌స్టేషన్లు ఏర్పాటుచేయబోతున్నామని వివరించారు.

విద్యుత్ సంస్థలను సంస్థాగతంగా బలోపేతం చేయడానికి 22,550 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్టు వ్యవస్థనుంచి తప్పించి నేరుగా జీతాలు చెల్లిస్తున్నదని, కొత్తగా 13,357 ఉద్యోగాలను భర్తీచేస్తున్నదని చెప్పారు. రాజధాని హైదరాబాద్ నగరంలో నిరంతర విద్యుత్ సరఫరాకు వీలుగా జీహెచ్‌ఎంసీ చుట్టూ.. 142 కి.మీ. మేర 400 కేవీ రింగ్‌సిస్టం ఏర్పాటుశామని తెలిపారు. ఈ లైన్ల అనుసంధానానికి 220 కేవీ సబ్ స్టేషన్లు ఆరింటిని నిర్మించామని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందిస్తున్న శుభ తరుణంలో రైతులు ఆటోస్టార్టర్లను తొలిగించుకోవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తిచేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్‌ను అవసరమున్నంతమేర సరఫరా చేయడానికి ప్రభుత్వం అంకితభావంతో కృషిచేస్తుందని ప్రకటించారు. సీఎం ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయి..

గత పాలకుల నిర్లక్ష్యంతో అంధకారం
గత పాలకుల నిర్లక్ష్య వైఖరివల్ల, ప్రణాళికాలోపంవల్ల అన్నిరంగాల్లో గాఢాంధకారం అలుముకుంది. విద్యుత్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. అలాంటి పరిస్థితినుంచి నేడు.. ఈ సభలో నేను ఈ ప్రకటన చదువుతున్న నిమిషానికి రాష్ట్రంలోని అన్ని రంగాలకు 24 గంటలపాటు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని సగర్వంగా, సంతోషంగా ప్రకటిస్తున్నాను. తెలంగాణ ఏర్పడిననాడు రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 6574 మెగావాట్లుంటే.. ఇందులో నికరంగా విద్యుత్ అందే థర్మల్ ప్లాంట్ల సామర్థ్యం 4300 మెగావాట్లు. జలవిద్యుత్ 2081 మెగావాట్లు. 2700 మెగావాట్లవరకు లోటుండేది. డిమాండ్‌కు సరిపడినంత సరఫరా జరుగలేదు అంటూ నాటి దుస్థితిని సీఎం కండ్లకు కట్టినట్టు చెప్పారు.

11,000 మెగావాట్ల సరఫరాకు సిద్ధం..
ఇటీవల రాష్ట్రంలో 9,500 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ ఏర్పడినా ఎక్కడా రెప్పపాటు సమయం కూడా కోత విధించకుండా రికార్డుస్థాయిలో 198 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాం. వచ్చే యాసంగి సీజన్‌లో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడంవల్ల ఏర్పడే, 11,000 మెగావాట్ల డిమాండ్‌మేరకు సరఫరా చేయడానికి విద్యుత్ సంస్థలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి అని సీఎం చెప్పారు.

చిమ్మచీకట్లనుంచి వెలుగుజిలుగుల తెలంగాణగా..
తెలంగాణ ఏర్పడిన రోజున తీవ్రమైన విద్యుత్ సంక్షోభం నెలకొంది. నిత్యం కరెంటు కోతలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్ నగరంలో రోజూ 2-4 గంటలు, ఇతర నగరాలు, పట్టణాల్లో 6 గంటలు, గ్రామాల్లో 9 గంటలపాటు అధికారిక విద్యుత్ కోతలు అమలయ్యేవి. పరిశ్రమలకు వారానికి రెండ్రోజులు పవర్ హాలిడేలుండేవి. ఫలితంగా పరిశ్రమలు పెద్ద ఎత్తున మూతపడ్డాయి. కరెంటు కోసం ఫిక్కీ, సీఐఐ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలు నిత్యం ధర్నాలు చేసేవారు. అటు ఇందిరాపార్కు, ఇటు విద్యుత్‌సౌధవద్ద ఎప్పుడూ ఆందోళనలే. హైదరాబాద్‌లో పరిశ్రమలు పెట్టాలంటేనే భయపడే వాతావరణం ఉండేది.

వ్యవసాయానికి రెండు మూడు గంటలు కూడా కరెంటు అందకపోవడంతో పంటలు ఎండిపోయేవి. భూగర్భంలో నీళ్లున్నా.. తోడుకునేందుకు కరెంటు లేక చేతికొచ్చిన పంట కండ్లెదుటే ఎండిపోతున్నా రైతాంగం ఏమీచేయలేని స్థితిలో కొట్టుమిట్టాడేది. అపారమైన పంట నష్టం రైతులను ఆర్థికంగా కుంగదీసేది. చిమ్మ చీకట్లు అలుముకున్న దుస్థితి నుంచి ఇవాళ వెలుగు జిలుగుల తెలంగాణ ఆవిష్కరించడానికి ఎంతో కృషి జరిగింది. రాష్ట్రం ఏర్పడిన వెంటనే, విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు అమలుచేసింది. దాదాపు రూ.94 వేల కోట్ల వ్యయంతో తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా.. నత్తనడకన నడుస్తున్న ప్లాంట్ల నిర్మాణాన్ని పరుగులు పెట్టించింది. కొత్త ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పంపిణీ, సరఫరా వ్యవస్థలను పటిష్ఠం చేసింది.

మూడున్నరేండ్లలో 7981 మెగావాట్లు
తెలంగాణ ఏర్పడే నాటికి 6574 మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉంటే.. గడిచిన మూడున్నరేండ్లలో అదనంగా మరో 7981 మెగావాట్ల విద్యుత్‌ను సమకూర్చుకోగలిగింది. సింగరేణి పవర్ ప్లాంటు ద్వారా 1200 మెగావాట్లు, కేటీపీపీ ద్వారా 600, జూరాలద్వారా 240, పులిచింతలద్వారా 90, ఛత్తీస్‌గఢ్ నుంచి 1000 మెగావాట్లు, సీజీఎస్ తదితర మార్గాల ద్వారా మరో 2000 మెగావాట్లను అదనంగా సమకూర్చుకున్నాం అని సీఎం వివరించారు.

సోలార్‌లోనూ మనదే పైచేయి
గ్రీన్ పవర్ ఉత్పత్తి గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో రాష్ట్రంలో కొత్త సోలార్ పాలసీని తీసుకువచ్చాం. దీని ఫలితంగా రాష్ట్రం 2792 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తితో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది అని సీఎం చెప్పారు.

పంపిణీ, సరఫరా వ్యవస్థలు బలోపేతం చేశాం
పంపిణీ, సరఫరా వ్యవస్థల బలోపేతానికి రూ.12,136 కోట్లతో చర్యలు తీసుకున్నాం. రాష్ట్రం ఏర్పడేనాటికి 400 కేవీ సబ్‌స్టేషన్లు ఆరు ఉంటే.. మరో ఐదు నిర్మించి వాటి సంఖ్యను 11కు చేర్చాం. 400 కేవీ సబ్‌స్టేషన్లు మరో ఐదు నిర్మించడానికి ప్రణాళిక రచించాం. 220 కేవీ సబ్ స్టేషన్లు 51 ఉంటే.. కొత్తగా 19 నిర్మించడంతో వాటి సంఖ్య 70కి పెరిగింది. 132 కేవీ సబ్‌స్టేషన్లు 176 ఉంటే.. కొత్తగా 35 నిర్మించడంతో వాటి సంఖ్య 211కు చేరింది. 33 కేవీ సబ్‌స్టేషన్లు 2181 ఉండగా.. అదనంగా 515 నిర్మించడంతో వాటి సంఖ్య 2696కు చేరింది. తెలంగాణ ఏర్పడేనాటికి అన్నిరకాల సబ్‌స్టేషన్లు 2414 ఉండగా.. 574 సబ్‌స్టేషన్లు కొత్తగా నిర్మించి, నేడు 2988 సబ్ స్టేషన్లను అందుబాటులోకి తెచ్చాం అని సీఎం వివరించారు.

రాబోయే మూడు, నాలుగేండ్లలో పంపిణీ, సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడానికి రూ.42 వేల కోట్లతో కొత్తగా పద్దెనిమిది 400కేవీ సబ్‌స్టేషన్లు, ముప్పైనాలుగు 220కేవీ సబ్‌స్టేషన్లు, తొంభై 132కేవీ సబ్‌స్టేషన్లు, 33/11కేవీ సబ్‌స్టేషన్లు 937 నిర్మించడానికి ప్రణాళిక రూపొందించాం. నాడు 400కేవీ లైన్లు 1682 కి.మీ. ఉంటే.. కొత్తగా 1012 కి.మీ. మేర ఏర్పాటుచేశాం. 220కేవీ లైన్లు నాడు 5559 కి.మీ. ఉంటే.. కొత్తగా 1340 కి.మీ. లైన్లువేశాం. 132 కేవీ లైన్లు అప్పుడు 9136 కి.మీ. ఉంటే.. కొత్తగా 1184 కి.మీ. వేశాం. మొత్తం హైటెన్షన్ లైన్లు నాడు 16378 కి.మీ. ఉండగా.. తెలంగాణ ఏర్పడిన తరువాత కొత్తగా 3537 కి.మీ. లైన్లువేశాం. నేడు రాష్ట్రంలో 19,916 కి.మీ. మేర హైటెన్షన్ విద్యుత్ లైన్లున్నాయి. డిస్ట్రిబ్యూషన్ల లైన్లుకూడా భారీస్థాయిలో పెంచాం. 33కేవీ లైన్లు ఆనాడు 17,760 కి.మీ. ఉంటే.. 4,180 కి.మీ. మేర కొత్తగా వేశాం. 11 కేవీ లైన్లు నాడు 1,20,834 కి.మీ. ఉంటే.. కొత్తగా 25,551 కి.మీ మేర వేశాం. ఎల్‌టీ లైన్లు ఆనాడు 2,94,374 కి.మీ. ఉండగా.. కొత్తగా 21,302 కి.మీ. నిర్మించాం. మొత్తం డిస్ట్రిబ్యూటరీ లైన్లు ఆనాడు 4,32,968 కి.మీ. ఉండగా.. కొత్తగా 51,033 కి.మీ జతచేయడంద్వారా నేడు 4,84,001 కి.మీ. లైన్లు అందుబాటులోకి వచ్చాయి. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా వ్యవస్థను తీర్చిదిద్దేందుకు హైటెన్షన్ సరఫరా సామర్థ్యాన్ని 12,653 మెగావాట్ల నుంచి 20,660 మెగావాట్లకు పెంచాం అని ముఖ్యమంత్రి వివరించారు.

ఉత్తర, దక్షిణ గ్రిడ్ మధ్య కొత్త లైన్లు
రాష్ట్రం చొరవతో ఉత్తర, దక్షిణ గ్రిడ్‌ల మధ్య కొత్త విద్యుత్ లైన్ల నిర్మాణం జరిగింది. వార్ధా-మహేశ్వరం వయా డిచ్‌పల్లి 765 డబుల్ సర్క్యూట్‌లైన్ నిర్మాణం పూర్తయ్యింది. వరంగల్-వరోరా లైను మరో మూడేండ్లలో పూర్తవుతుంది. ఈ లైన్లద్వారా రాష్ట్రం 2000 మెగావాట్ల విద్యుత్ పొందడానికి వీలుగా పీజీసీఐఎల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ లైన్లద్వారా దేశంలో ఎక్కడినుంచైనా కావాల్సినంత విద్యుత్ పొందే వెసులుబాటు కలిగింది. రాజధాని హైదరాబాద్‌లో నిరంతర విద్యుత్ సరఫరాకు వీలుగా జీహెచ్‌ఎంసీ చుట్టూ.. 142 కి.మీ. మేర 400 కేవీ రింగ్ సిస్టంను ఏర్పాటుచేశాం. ఈ లైన్ల అనుసంధానానికి 220 కేవీ సబ్ స్టేషన్లు ఆరింటిని నిర్మించాం అని సీఎం చెప్పారు.

ఆర్థిక క్రమశిక్షణతో తగ్గిన వడ్డీ
రాష్ట్ర విద్యుత్ సంస్థల ఆర్థిక క్రమశిక్షణకు, మెరుగైన పనితీరుకు ప్రశంసాపూర్వకంగా ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ ఇచ్చే రుణంపై వడ్డీని 12% నుంచి 9.95 శాతానికి తగ్గించాయి. దీనివల్ల ఏటా రూ.200 కోట్లమేర వడ్డీ భారం తగ్గుతుంది అని సీఎం వివరించారు. డిస్కంలపై ఆర్థికభారం తొలిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉదయ్ పథకంలో చేరింది. డిస్కంలకు ఉన్న రూ.8923 కోట్ల రుణ భారాన్ని ప్రభుత్వం భరిస్తున్నది. దీనిద్వారా డిస్కంలు రుణవిముక్తి పొంది, మరింత స్వేచ్ఛగా తమ కార్యకలాపాలను నిర్వహించడం సాధ్యమవుతుంది అని సీఎం చెప్పారు.

తలసరి విద్యుత్ వినియోగంలోనూ మనమే..
ఆర్థిక ప్రగతికి సూచికగా చెప్పే తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం జాతీయ సగటును మించింది. తెలంగాణ ఏర్పడే నాటికి తలసరి వార్షిక వినియోగం 1200 యూనిట్లు ఉంటే.. ఇప్పుడు 1505 యూనిట్లకు పెరిగింది. మూడున్నరేండ్లలో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 26% పెరిగింది. 2016-17లో జాతీయసగటు 1122 యూనిట్లయితే.. తెలంగాణ సగటు 383 యూనిట్లు అదనంగా నమోదయ్యింది. ఈ పెరుగుదల రాష్ట్ర పురోగతికి, ప్రజల మెరుగైన జీవన విధానానికి అద్దం పడుతుంది. విద్యుత్ సంస్థలు బలోపేతమైతే, ప్రభుత్వరంగంలోనే విద్యుత్ ఉత్పత్తి జరిగితే రాష్ట్రంలోని పేదలకు మరిన్ని సబ్సిడీలు అందించవచ్చని ప్రభుత్వం మొదటినుంచి భావిస్తున్నది. అందుకు అనుగుణంగానే నేడు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించడంతోపాటు పేదలకు సబ్సిడీలు ఇవ్వగలుగుతున్నాం. విద్యుత్ సబ్సిడీలకోసం బడ్జెట్‌లో రూ.4,777 కోట్లు కేటాయించాం అని సీఎం తెలిపారు.

సిబ్బంది అంకితభావంతో..
విద్యుత్ సంస్థల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అంకితభావంతో కష్టపడి పనిచేసి మెరుగైన పరిస్థితి తీసుకొచ్చారని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. చిత్తశుద్ధితో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం అండదండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు..
ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 14,555 మెగావాట్లకు చేరింది. మరో 13,752 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికోసం కొత్త ప్లాంట్లు నిర్మిస్తున్నాం. వ్యవసాయానికి 24 గంటల కరెంటు, కొత్తగా నిర్మించే ఎత్తిపోతల పథకాలకు 8500 మెగావాట్లు అవసరం. కొత్తగా నెలకొల్పే పరిశ్రమలతోపాటు ఇతరత్రా పెరిగే విద్యుత్ డిమాండ్‌కోసం ఈ కొత్త ప్లాంట్ల నిర్మాణం జరుగుతున్నది. నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యంతో యాదాద్రి అల్ట్రా మెగాపవర్ ప్లాంటు నిర్మిస్తున్నాం. మణుగూరు, కొత్తగూడెం ప్రాంతాల్లో నిర్మిస్తున్న పవర్‌ప్లాంట్ల ద్వారా 1880 మెగావాట్లు వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తాయి. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 1600 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు నిర్మాణంలో ఉంది. 28 వేల మెగావాట్లకుపైగా స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకొల్పి తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పూర్తిస్థాయి పారదర్శకత సాధించేందుకు, జాప్యం నివారించేందుకు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాలను ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించాం అని సీఎం చెప్పారు.

వ్యవసాయానికి 24 గంటల విద్యుత్
వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరాచేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించిందనే సంతోషకరమైన విషయాన్ని, సగర్వంగా ఈ సభద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. దేశంలో మరెక్కడా లేనివిధంగా, చరిత్రలో మొదటిసారిగా రాష్ట్రంలోని దాదాపు 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు గతరాత్రి నుంచి ప్రయోగాత్మకంగా 24 గంటల కరెంటు సరఫరా అవుతున్నది. దశాబ్దాలుగా కరెంటు కష్టాలు అనుభవించిన రైతాంగానికి ఇది తీపి కబురు. 24 గంటల విద్యుత్ సరఫరా ద్వారా ఉత్పన్నమయ్యే పరిస్థితిని ఐదారు రోజులు అధ్యయనంచేసి, వచ్చే యాసంగినుంచి శాశ్వత ప్రాతిపదికన నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడానికి విద్యుత్‌శాఖ తుది ఏర్పాట్లుచేస్తున్నది. వ్యవసాయ పంపుసెట్లద్వారానే రాష్ట్రంలో 25% విద్యుత్ వినియోగమవుతున్నది. రాష్ట్రం ఏర్పడిన కొద్ది రోజులనుంచే అన్ని పంపుసెట్లకు 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతున్నది. గత జూలై నెల నుంచి పాత మెదక్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చింది. వచ్చే యాసంగినుంచి రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ పంపుసెట్లకు నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం విద్యుత్‌శాఖ అన్ని ఏర్పాట్లుచేసింది. అందుకు కావాల్సిన విద్యుత్‌నుకూడా సమకూర్చుకుంటున్నది అని సీఎం తెలిపారు.