ఫీజు మన పిల్లలకే

-ప్రభుత్వ రీయింబర్స్‌మెంట్ పై అఖిలపక్షం నిర్ణయం
-ఏ రాష్ట్ర విద్యార్థుల ఫీజు ఆ రాష్ట్రమే భరించాలి
-పథకంలో 14లక్షల 32వేల మంది విద్యార్థులు
-లబ్దిదారుల్లో 51శాతం బీసీలు, ఎస్సీలు 18, ఎస్టీలు15 శాతం
-సర్కారుపై రూ.2,547కోట్ల భారం
-నాన్‌లోకల్ మినహాయిస్తే రూ.140కోట్ల మిగులు
-గతేడాది బకాయిలు తెలంగాణకు రూ.1300కోట్లు
-స్థానికేతరుల సంఖ్యపై లెక్కింపు షురూ
-ఫీజుల పూర్తిస్థాయి ఖరారుకు మరో సమావేశం
-అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం

KCR 17-06-14

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా పేద విద్యార్థులకు చెల్లించే బోధనా రుసుములను తెలంగాణ విద్యార్థులకు మాత్రమే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్వరాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో విద్యనభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థులకు కూడా వారి అర్హతలను బట్టి బోధనా రుసుము చెల్లించనుంది. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకంపై సోమవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. విద్యార్థుల స్థానికత, వారు విద్యనభ్యసిస్తున్న ప్రాంతాలు, ప్రభుత్వంపై పడనున్న ఆర్థిక భారం, పథకం అమలులో అనుసరించాల్సిన విధివిధానాలపై సమావేశంలో చర్చించారు.

తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ట్యూషన్ ఫీజులు, స్కాలర్‌షిప్‌లు చెల్లించాలని, నాన్‌లోకల్ విద్యార్థులు తెలంగాణలో విధ్యనభ్యసించినా వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చేది లేదని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ పథకం అమలుకు ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయించిన విధి విధానాలనే కొనసాగించాలని తీర్మానించారు. ఈ పథకంవల్ల రాష్ట్ర ఖజానాపై పడే భారం గురించి సీఎం కేసీఆర్ అఖిలపక్ష నేతలకు వివరించారు. ఫీజు రీయింబర్స్‌మెంటు తెలంగాణ విద్యార్థులకు మాత్రమే అమలుచేస్తే ప్రభుత్వంపై రూ.2,547కోట్ల భారం పడుతుందని వెల్లడించారు.

ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకుండా నిలిపేసిన బకాయి తెలంగాణకు రూ.1,300కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.2500 కోట్లు ఉందని, తెలంగాణ విద్యార్థుల బకాయిలను కూడా తమ ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ఓపెన్ కేటగిరిలో తెలంగాణ రాష్ట్రంలో 15 శాతం అడ్మిషన్లు పొందిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తే మరో రూ.196కోట్ల భారం పడుతుందని చెప్పారు. తెలంగాణలో నివసిస్తున్న స్థానికేతరులను మినహాయిస్తే రూ.140కోట్లు మిగులుతాయని వివరించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫీజులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఫీజుల బకాయిలు, రియంబర్స్‌మెంట్ నిర్ధారణకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించి త్వరలో మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

14,32,000 మందికి ఫీజు రీయంబర్స్‌మెంట్
ప్రస్తుత విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 14.32లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకం కింద బోధనా రుసుములు చెల్లించాల్సి ఉంటుందని సమావేశంలో అధికారులు వివరించారు. ఈ పథకం గురించి ముందుగా గతంలో సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేసిన రేమండ్‌పీటర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అఖిలపక్ష సభ్యులకు వివరించారు. ఈ పథకంలో కింద లబ్ది పొందుతున్న విద్యార్థుల్లో బీసీలు 51%, ఎస్సీలు 18%, ఎస్టీలు 15%, మైనారిటీ విద్యార్థులు 9%, ఈబీసీలు 7%ఉన్నారని తెలిపారు.

మొత్తంగా చూస్తే బీసీలు 7.83లక్షలు, ఎస్సీలు 2.72లక్షలు, ఎస్టీలు 1.36లక్షలు, మైనారిటీలు 1.24లక్షలు, ఈబీసీ విద్యార్థులు 1.11లక్షలు, వికలాంగులు 3,008 మంది ఉన్నారని వివరించారు. వీరిలో బీసీ విద్యార్థులకు రూ.1,289కోట్లు, ఎస్సీ విద్యార్థులకు రూ.456కోట్లు, ఎస్టీ విద్యార్థులకు రూ.238 కోట్లు ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. గతేడాది సమైక్య రాష్ట్రంలో ఈ పథకం కింద రూ.2,091కోట్లు చెల్లించినట్లు తెలిపారు. ఇంకా 28,7000మందికి రూ.5,600కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తెలంగాణలో దాదాపు 39వేల మంది విద్యనభ్యసిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, తుది లెక్కలు ఇంకా తేలాల్సి ఉందన్నారు.