ఫీజు బకాయిలు చెల్లిస్తాం

-మా ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా..విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం
-మొత్తం ఫీజు బకాయిలు రూ.1587 కోట్లు
-తొలి విడతలో రూ.500 కోట్లు విడుదల
-మరో రెండు విడతల్లో మిగిలిన చెల్లింపులు
-ఆంధ్ర విద్యార్థులకు చెల్లించినవి ఏపీ ప్రభుత్వం నుంచి తీసుకుంటాం
-విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

Education Minister Jagadish Reddy
గత ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిన ఫీజు బకాయిలను మొత్తం చెల్లిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. వివిధ కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి మొత్తం రూ.1587.76 కోట్లు బకాయి ఉన్నట్లు తెలిపారు. వీటిని పూర్తిగా చెల్లించాలని గురువారం జరిగిన కేబినెట్ సబ్‌కమిటీ సమావేశంలో నిర్ణయించామని మంత్రి చెప్పారు. ఇదే విషయంలో సీఎం కే చంద్రశేఖర్‌రావుతోనూ మాట్లాడామని వెల్లడించారు. బకాయిలను మూడు విడతల్లో చెల్లిస్తామన్న మంత్రి.. మొదటి విడతలో రూ.500 కోట్లు విడుదలకు ఉద్దేశించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారని చెప్పారు.
శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2010-11 సంవత్సరానికి రూ.34.47కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉంటే, 2011-12లో రూ.19.11కోట్లు, 2012-13లో రూ.88.47కోట్లు, 2013-14లో రూ.1444.90 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం రూ.500కోట్లు విడుదల చేస్తున్నామని, మిగిలిన రెండు విడతల్లో బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని అన్నారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కనుక ఈ బకాయిలతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేకపోయినా విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఈ ఫీజు బకాయిల్లో ఆంధ్ర విద్యార్థులకు చెల్లించేవి ఉంటే.. వాటిని ఆంధ్ర ప్రభుత్వం నుంచి తిరిగి తీసుకుంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అనర్హత వేటుకుగురైన ఇంజినీరింగ్ కాలేజీలకు చెల్లించాల్సిన బకాయిలున్నా చెల్లిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం కనుక ఆ మేరకు బకాయిలు చెల్లించే బాధ్యత తమపై ఉంటుందని అన్నారు. ఫాస్ట్ పథకానికి, ఫీజు బకాయిలకు సంబంధం లేదని, త్వరలోనే ఫాస్ట్ మార్గదర్శకాలు విడుదల చేస్తామని అన్నారు. తెలంగాణలో అధికారుల కొరత చాలా తీవ్రంగా ఉందని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

ప్రధాన మంత్రి ఒక్క సంతకం పెడితే అధికారుల కేటాయింపులు జరిగిపోతాయని అన్నారు. కానీ కేంద్రం నుంచి జాప్యం జరుగుతుండటంతో ప్రస్తుతం తెలంగాణలో అధికారులు లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఒక్కొక్క అధికారి నాలుగైదు శాఖలను పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. సర్వీస్ అధికారుల విభజన విషయంలో సీఎం, సీఎస్ ఎన్నోసార్లు కేంద్రానికి లేఖలు రాశారని, ముఖ్యమంత్రి కేసీఆర్ రెండుసార్లు ఢిల్లీ వెళ్లి మరీ ప్రధానికి విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. ఇన్ని సమస్యలున్నా ముఖ్యమంత్రి పాలనను ముందుకు తీసుకుపోతున్నారని అన్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వంపై బట్టకాల్చి మీదేసే విధంగా విమర్శలు చేస్తున్నాయని చెప్పారు.

ప్రాణత్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలోని పాలనపై కనీస ఇంగితజ్ఞానం లేకుండా, దుర్మార్గంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో విద్యుత్ సమస్యకు చంద్రబాబే కారణమని జగదీశ్‌రెడ్డి అన్నారు. ఈ సమయంలో ప్రభుత్వానికి మద్దతివ్వాల్సిందిపోయి తిన్నింటి వాసాలు లెక్కపెట్టే దొంగల్లా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏదైనా పొరపాటు చేస్తే.. సలహాలిస్తే సరిచేసుకుంటామని, కానీ చిల్లరమల్లర రాజకీయాలు పనికిరావని అన్నారు. తెలంగాణలో కరెంటు లేకుండా బాబు కుట్రలు చేస్తుంటే టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఏకమై ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. విలేకరుల సమావేశంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.