ఎఫ్‌సీఐ పునరుద్ధరణకు ఒత్తిడి తెస్తా

-15న గ్యాస్ కేటాయింపు అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతా
-టీఆర్‌ఎస్‌తోనే గ్రామ స్వరాజ్యం సాధ్యం:ఎంపీ బాల్క సుమన్

Balka Suman

తెలంగాణకు కొంగుబంగారంగా ఉన్న రామగుండం ఎరువుల కర్మాగారం(ఎఫ్‌సీఐ),సీమాంధ్ర ప్రభుత్వాల కుట్రల వల్లే మూసివేతకు గురైంది. పరిశ్రమ పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ సహకారంతో కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తా. 15న ఎఫ్‌సీఐ పునరుద్ధరణకు గ్యాస్ కేటాయింపులపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తాఅని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమ న్ చెప్పారు.

బుధవారం కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో మూసివేతకు గురైన రామగుండం ఎఫ్‌సీఐ కర్మాగారాన్ని ఆయన పరిశీలించారు. ఎఫ్‌సీఐ పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎఫ్‌సీఐ ఇన్‌చార్జి జీఎం సీతతో చర్చించారు. సీమాంధ్ర నేతల కుట్ర ఫలితంగానే తెలంగాణలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయని అందులో రామగుండం ఎఫ్‌సీఐ ఒకటన్నారు. త్వరలో సీఎం కేసీఆర్‌తో ఎఫ్‌సీఐ పునరుద్ధరణపై చర్చిస్తామని, కేంద్రంపై ఎంతటి ఒత్తిడి తేవడానికైనా వెనుకాడబోమన్నారు. ఇప్పటికే ఎఫ్‌సీఐ పునరుద్ధరణపై కేంద్ర మంత్రులతో చర్చించామని తెలిపారు. ఎంపీ వెంట ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఉన్నారు.

-చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోనున్న వాటర్‌గ్రిడ్
బాపూజీ, తెలంగాణ పోరాటయోధులు కలలుగన్న గ్రామ స్వరాజ్యస్థాపన సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని ఎంపీ బాల్క సుమన్ చెప్పారు. బుధవారం నల్లగొండ జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరుల త్యాగఫలం, కేసీఆర్ ఉద్యమస్ఫూర్తితోనే రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో కోటి ఆశలు ఉన్నాయన్నారు.

వాటర్‌గ్రిడ్ పథకం ప్రపంచచరిత్రలోనే చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. తెలంగాణలో ఏ ఆడపడుచూ ఇంటిగడప దాటి బిందెలతో బయటకు వెళ్లవద్దని, ఇంటింటికీ నల్లాలతో నీరివ్వడమే ఈ పథకం ఉద్దేశమన్నారు. చెరువుల అభివృద్ధిపై కేసీఆర్‌తో కలిసి కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతిని కలిశామని, త్వరలోనే ఆమె రాష్ట్రంలో పర్యటించనున్నదని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యే గొంగిడి సునీత ఉన్నారు.