ఫాస్ట్‌కు కమిటీ

-మార్గదర్శకాల కోసం నియామక ఉత్తర్వులు జారీ
-స్థానికతకు 1956 గీటురాయి
-సీఎంతో కమిటీ సభ్యుల భేటీ
-తెలంగాణ పిల్లలు నష్టపోవద్దన్న కేసీఆర్

KCR

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ఆర్థిక సహాయం (ఫాస్ట్) పథకాన్ని పటిష్టంగా అమలుపరిచేందుకు ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. కమిటీలో దళిత అభివృద్ధి, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శి, ఉన్నత విద్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఫాస్ట్ కమిటీ పనిచేస్తుంది.

అర్హులైన పేద తెలంగాణ విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు ఉద్దేశించిన ఫాస్ట్ పథకం అమలుకు ఎలాంటి మార్గదర్శకాలు ఉండాలో ఈ కమిటీ ప్రభుత్వానికి సూచిస్తుంది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు చదువుల ఆర్థిక భారం నుంచి విముక్తి కలిగించడంతోపాటు నూతన విద్యార్థులను చదువుల్లో ప్రోత్సహించేలా ఈ పథకం ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత సంవత్సరం అడ్మిషన్లు పొందిన అర్హులైన విద్యార్థులతోపాటు నూతనంగా ఈ విద్యాసంవత్సరం నుంచి ఆయా కోర్సుల్లో ప్రవేశించే అర్హులైన విద్యార్థులకు ఈ పథకం ప్రయోజనకారిగా ఉంటుంది.

నూతన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన నేపథ్యంలో తెలంగాణ విద్యార్థులకే తెలంగాణ ఫీజులు అనే విధానంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్థానిక విద్యార్థులకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అందుకు 1956ను స్థానికతకు గీటురాయిగా ప్రకటించింది. 1-11-1956 నాటికి తెలంగాణలో స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకున్న తల్లిదండ్రుల పిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఇందుకు సంబంధించి రెవిన్యూ కార్యాలయాల ద్వారా నివాస ధ్రువీకరణ పత్రాలను తెలంగాణ విద్యార్థులు పొందాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విద్యార్థులు తన తల్లిదండ్రుల, పూర్వీకులకు పూర్తి సమాచారాన్ని రెవిన్యూ అధికారికి అందచేయాల్సి ఉంటుంది.

వారు 1956 నాటికి తెలంగాణలోనే నివసిస్తుంటే వాటి పూర్తి వివరాలను అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయి సూచనలను, సలహాలను ఖరారు చేసి ఇవ్వాల్సిందిగా కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. తుది నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

సీఎంతో కమిటీ సభ్యుల సమావేశం
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో ఫాస్ట్ కమిటీ సభ్యులు బుధవారం భేటీ అయ్యారు. పథకం అమలుకు మార్గదర్శకాల తయారీపై వారు చర్చించారు. ముఖ్యంగా స్థానికతను గుర్తించడం ఎలా? అనే అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. 1956 స్థానికతను నిర్ధారించే క్రమంలో సాంకేతిక కారణాలపై తెలంగాణ విద్యార్థులు నష్టపోకుండా చూడాల్సిన అవసరంపై వారు విస్తృతంగా చర్చించినట్లు తెలిసింది. సమావేశంలో కమిటీ సభ్యులు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి టీ రాధా, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా పాల్గొన్నారు.