ఎర్రవల్లి, నర్సన్నపేటలు ఆదర్శం కావాలి

ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి రాష్ర్టానికి ఆదర్శంగా మారాలి. ముఖ్యంగా ఎర్రవల్లి రాష్ర్టానికి ప్రయోగశాలగా మారనున్నది. ఈ రెండు గ్రామాలను అభివృద్ధి చేసుకుని వీటి మాదిరిగానే రాష్ట్రంలోని ప్రతి పల్లె అభివృద్ధి చెందేలా కృషి చేద్దాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఆదివారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని నర్సన్నపేట గ్రామస్థులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

KCR addressing in Erravelli village

-అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు
-నేనే వచ్చి గ్రామంలో స్వయంగా పర్యటిస్తా
-మెదక్ జిల్లా నర్సన్నపేటవాసులకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు
గ్రామం అభివృద్ధిలో ముందుకు వెళ్లాలంటే ప్రజలంతా ఐక్యమత్యతో ముందుకు సాగాలని సూచించారు. కులం, మతం, రాజకీయ పార్టీలను పక్కన పెట్టి అందరం కలిసి నడిచి అభివృద్ధిని సాధించుకుందామని చెప్పారు. ముందుగా నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్‌ను ఆదర్శంగా తీసుకుని గ్రామంలో సర్వవర్గ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. తద్వారా గ్రామస్థులందరు ఏకతాటిపైకి రావడంతో సమస్య ఏదైనా ఈజీగా పరిష్కారమవుతుందన్నారు.

పక్కనే ఉన్న ఎర్రవల్లి ఒక రోజులో సైరకు రాలేదని, నెల రోజులుగా కష్టపడితే ఇప్పుడు సైరకు వచ్చిందన్నారు. గ్రామాభివృద్ధి కమిటీని వేసుకుని ప్రతి శనివారం పారిశుద్ధ్యం, ప్రతి ఆదివారం గ్రామాభివృద్ధి కమిటీ సమావేశాలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. నర్సన్నపేట వాసులు కూడా సంఘటితంగా ప్రజాసమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎర్రవల్లి, నర్సన్నపేట పక్కపక్కనే ఉన్నాయి కనుక అభివృద్ధిలో కలిసి నడువాలని సూచించారు. అధికారులందరూ గ్రామంలో పర్యటించి సమస్యలను గుర్తిస్తారని, డబుల్ బెడ్‌రూం ఇండ్లు అర్హులైన వారి నివేదికను తయారు చేస్తారన్నారు.

రెండు గ్రామాల్లో డబుల్ బెడ్‌రూం ఇండ్ల ఒకేసారి పనులు ప్రారంభించుకుందామని చెప్పారు. గ్రామంలోని బజార్లు ఒక సైరకు రావాలని, గ్రామమంతా ఒక మోడల్‌గా ఉండేలా తయారుచేసుకుందామన్నారు. ప్రతి రైతుకు డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం ఏర్పాటు చేసి వ్యవసాయంలో మార్పులు సాధించుకుందామని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత నర్సన్నపేటకు వచ్చి గ్రామంలో పర్యటిస్తా.. ఆ రోజు ఊరంతా కదులాలి.. యుద్ధంపై సమరభేరి మోగాలి.. యుద్ధప్రాతిపదికన పనులు చేసుకుని నర్సన్నపేట, ఎర్రవల్లి గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు.

గ్రామంలోని సమస్యలను గుర్తించాలని గడా ఓఎస్డీ హన్మంతరావును ఆదేశించారు. నర్సన్నపేటకు ప్రత్యేక అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. గ్రామాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునేందుకు ప్రజలంతా ఐక్యమత్యంతో ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. గ్రామానికి బైపాస్ రోడ్డును ఏర్పాటు చేసుకునేలా చర్చించుకోవాలన్నారు. సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు వెళ్లారు. సమావేశంలో గడా ఓఎస్డీ హన్మంతరావు, ఆర్డీవో ముత్యంరెడ్డి, సర్పంచ్ బాల్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ఎంబరి రాంచంద్రం, గ్రామస్థులు పాల్గొన్నారు.