ఎంత ఆయకట్టు పెంచామన్నదే ముఖ్యం

-నీటి పారుదల ప్రాజెక్టులపై మంత్రి హరీశ్ రావు సమీక్ష
-సొంత పనిలా కృషి చేద్దామని పిలుపు

Harish Rao Review

ప్రాజెక్ట్‌లు ఎంతవరకు పూర్తయ్యాయన్న లెక్కకన్నా ఎంత ఆయకట్టుకు నీరందుతుందనేదే ముఖ్యమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. వివిధ ప్రాజెక్ట్ నిర్మాణల స్థితిగతులు, వాటిని త్వరిత గతిన పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో ఆయన మంగళవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ప్రాణహిత-చేవెళ్ల , నాగార్జున సాగర్, దేవాదుల, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, కాళేశ్వరం మొదలుకుని కల్వకుర్తి, నెట్టెంపాడు, డిండి, ఉదయసముద్రం వరకు ప్రాజెక్ట్‌లపై విస్తత చర్చ జరిగింది. ప్రాజెక్టుల నిర్మాణంలో ఎదురువుతున్న భూసేకరణ, సహాయ, పునరావాస సమస్యలను అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రోడ్లు, భవనాలు, రైల్వే వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలతో సంప్రదింపులు జరిపి నిర్మాణంలో ఆలస్యం లేకుండా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు.

కొన్ని ప్రాజెక్ట్‌లు చివరిదశకు వచ్చినా సాగనీరందే ఆయకట్టు తక్కువగా ఉండడం గమనించి అధికారులనుంచి వివరాలు తెలుసుకున్నారు. ఉద్యమ సమయంలో తాము జలవనరుల విషయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చామని వాటిని ఇపుడు అమలు చేయాలని అన్నారు. ఇంజనీర్లు తమ ఇంటి పనిలాగా భావించి సాగునీటి ఆయకట్టును పెంచడానికి కృషి చేయాలని కోరారు. త్వరలోనే ప్రాజెక్ట్‌ల వారీగా సమీక్ష నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి అరవింద్‌రెడ్డి, ఇంజనీర్-ఇన్-చీఫ్‌లు నారాయణ్‌రెడ్డి, మురళీధర్, చీఫ్ ఇంజనీర్లు విజయ్‌ప్రకాశ్, ప్రకాశ్, రామకష్ణ, జీ నారాయణరెడ్డి, హరిరామ్, రివర్‌బోర్డుల అధ్యయన కమిటీ సభ్యులు అనంతరాములు పాల్గొన్నారు.