ఎన్నికేదైనా పోటీచేసే దమ్ముందా?

కరీంనగర్‌లో చంద్రబాబు పర్యటించిన రోజే ఢిల్లీలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీతో ఏపీ అధికారులు సమావేశమయ్యారు. కరీంనగర్ సభలో తెలంగాణకు అవసరమైన విద్యుత్ ఇస్తానని చంద్రబాబు చెబుతుండగానే, ఢిల్లీలో ఏపీ విద్యుత్ అధికారులు కృష్ణపట్నం నుంచి తెలంగాణకు విద్యుత్ ఇచ్చేదే లేదని అక్కడ తేల్చిచెప్పారు.

Harish Rao addressing in Khammam elelction campaign

– ఏపీ సీఎం చంద్రబాబుకు మంత్రి హరీశ్‌రావు సవాల్
– నీది కాంగ్రెస్ స్కూల్.. టీడీపీగా చెప్పుకునే హక్కులేదు
– ఏపీలో వ్యతిరేకత తప్పించుకోవడానికే ఇక్కడ పర్యటనలు
– తెలంగాణకు కరెంట్ ఇస్తామని కరీంనగర్‌లో చెబుతావ్..
-ఢిల్లీలో మీ అధికారులు ఇవ్వబోమని తేల్చేస్తారా?: మంత్రి ధ్వజం

ఒక సీఎం ఆదేశాలు లేకుండానే అధికారులు చెబుతారా? నీకు ఎన్ని నాల్కలు! నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించే వైఖరి అంటే ఇదే. విభజన చట్టం ప్రకారం న్యాయబద్ధంగా రావాల్సిన వాటాను సాధించుకుంటాం అని భారీనీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. బుధవారం ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా వైరా రిజర్వాయర్‌ను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగించారు. టీఆర్‌ఎస్‌లో ఉన్న నాయకులంతా మన స్కూలే అని చంద్రబాబు పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇంతకు చంద్రబాబుది ఏ స్కూలో తేల్చిచెప్పాలని డిమాండ్ చేశారు.

1982లో టీడీపీని ఎన్టీఆర్ స్థాపించిన సమయంలో తుమ్మల నాగేశ్వరరావు, కేసీఆర్ ఆ పార్టీలో చేరి 1983లో ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి తుమ్మల, సిద్దిపేట నుంచి కేసీఆర్ పోటీచేశారని గుర్తుచేశారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్‌లో నుంచి పోటీ చేశారని, పిల్లనిచ్చిన మామపైనే పోటీ చేస్తానని సవాల్ విసిరారని వివరించారు. నాయనా చంద్రబాబు నీది కాంగ్రెస్ స్కూల్‌ అని ఎద్దేవాచేశారు. నీది టీడీపీ అని చెప్పుకునే హక్కులేదన్నారు. నీ కంటే ముందే కేసీఆర్, తుమ్మల ఆ పార్టీలో ఉన్నారన్నారు. తెలంగాణలో ఏ ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము, ధైర్యం టీడీపీకి లేవన్నారు. ఇటీవల మెదక్ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టకుండా బీజేపీకి మద్దతు తెలిపిందన్నారు. డిపాజిట్ కోల్పోతామని టీడీపీ భయపడి బీజేపీకి మద్దతు తెలిపినా బీజేపీకి కూడా డిపాజిట్ గల్లంతైందన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీడీపీ బీజేపీకే మద్దతు ఇస్తున్నదని, అదే సీన్ పునరావృతమవుతుందన్నారు.

ఇక్కడి పన్నులతో ఏపీ అభివృద్ధి నిజమని తేలింది
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలుచేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు అని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. అక్కడ ఆయనపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరిగిందని, దాన్ని కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణలో చంద్రబాబు అప్పడప్పుడు తిరిగి ఆంధ్రాలో ఏదో ఉన్నట్లు భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. తెలంగాణలో చదువుతున్న ఆంధ్రా విద్యార్థులకు కూడా సీఎం కేసీఆర్ ఫీజు రీయింబర్స్‌మెంటు, స్కాలర్‌షిప్ ఇస్తున్నారని గుర్తుచేశారు. తెలంగాణలో ఉన్నవాళ్లంతా ఇక్కడివాళ్లేనని ఆదరిస్తున్నారన్నారు. చంద్రబాబు మాత్రం ఈ విషయంలో తెలంగాణ రైతులకు అన్యాయం చేశాడన్నారు.

తెలంగాణలో ఉన్న రైతులకు ఆంధ్రాలో వ్యవసాయం ఉంటే అక్కడ రుణమాఫీ చేయకుండా ఎగనామం పెట్టాడని ఆరోపించారు. ఆ రైతులకు కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వమే రుణమాఫీ చేసిందని వివరించారు. రాష్ట్రం విడిపోతే మీరు బతకలేరు.. పరిపాలన చేతకాదు, రాష్ట్రం మొత్తం నక్సలైట్లే వస్తారని, కరెంటు ఉండదని, పైసలు ఉండవని చంద్రబాబు చెప్పారని.. అదే పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉందని చురకలంటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మేం మంచిగా బతుకుతామని కేసీఆర్ ఆనాడే చెప్పారని గుర్తుచేశారు.

14వ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్‌లో, ఏపీ లోటు బడ్జెట్‌లో ఉందన్నారు. దేశంలో మిగులు బడ్జెట్ రెండు, మూడు రాష్ర్టాల్లో ఉంటే వాటిలో తెలంగాణ ఒకటన్నారు. తెలంగాణ ప్రజల పన్నులతో ఆంధ్రాను ఉమ్మడి పాలకులు అభివృద్ధి చేసుకున్నారని కేసీఆర్ ఆనాడు చెప్పిన మాటలు నేడు రుజువయ్యాయన్నారు. ఇప్పటికే పోలవరం ముసుగులో ఖమ్మం జిల్లా నుంచి ఏడు మండలాలు లాగేసుకున్న చంద్రబాబు మరో రెండు మండలాలు కలుపుకునేందుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.