Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఈ టర్మ్‌లోనే ప్రాజెక్టుల పూర్తి

-కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం
-మన నీటివాటాను పూర్తిగా వినియోగించుకోవాలి
-వేసవికల్లా కాళేశ్వరం ప్రాజెక్టు సిద్ధంకావాలి
-వానకాలం నుంచే రోజుకు 2 టీఎంసీల పంపింగ్
-పాలమూరు-రంగారెడ్డిని వేగంగా పూర్తిచేయాలి
-దేవాదులపై కొత్త ప్రతిపాదనలు రూపొందించాలి
-ఉమ్మడి వరంగల్‌కు దేవాదుల ద్వారా నీరు
-ప్రాజెక్టుల నీటితో చెరువులు నింపేందుకు ప్రాధాన్యం
-రాజకీయ సుస్థిరత ఉంది.. నిధులకు కొరతలేదు
-పక్కా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశం
-సాగునీటి ప్రాజెక్టులపై అధికారులు, ఇంజినీర్లతో సమీక్షలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

రాష్ట్రంలో చేపట్టిన అన్ని సాగునీటి ప్రాజెక్టులను ఈ టర్మ్‌లోనే పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎండాకాలంలో పూర్తికావాలని, వానాకాలంనుంచి రోజుకు రెండు టీఎంసీల నీటిని పంపింగ్ చేయాలని స్పష్టంచేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తిచేయాలన్నారు. ఈ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని చెప్పారు. తుపాలకులగూడెం వద్ద ఏడాదికి 75 టీఎంసీలకు పైగా నీటిని తీసుకునే అవకాశం ఉందని, ఈ మేరకు దేవాదుల ప్రాజెక్టుపై పూర్తిస్థాయి సమీక్షచేసి, కొత్త ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా గోదావరి, కృష్ణా బేసిన్లలో రాష్ట్రానికున్న నీటివాటాను వినియోగించుకునే వ్యూహం అమలుచేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకోసం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణపై విధివిధానాలు రూపొందించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం వస్తేనే ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి, సాగునీళ్లు అందిస్తారనే విశ్వాసంతో ప్రజలు తమకు మరోసారి అవకాశం ఇచ్చారని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఈ టర్మ్‌లోనే అన్ని ప్రాజెక్టులు నూటికి నూరుశాతం పూర్తిచేసి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు.

దీనికి అధికారులు, వర్క్ ఏజన్సీలు సహకరించాలని కోరారు. ప్రాజెక్టుల నుంచి వచ్చే నీటితో మొదట చెరువులు నింపేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీనికోసం ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఏ ప్రాంతంలోనైనా ప్రాజెక్టు పనులు పూర్తికావడానికి ఆలస్యమైతే చెరువులు నింపటానికి కావాల్సిన ఏర్పాట్లు మాత్రం యుద్ధ ప్రాతిపదికన జరుగాలని సీఎం అధికారులకు స్పష్టంచేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై సోమవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఇటీవలే అన్ని ప్రాజెక్టుల పనులను స్వయంగా సందర్శించి వచ్చిన రిటైర్డు ఇంజినీర్లు, వివిధ ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి ప్రాజెక్టు పురోగతిపై రిటైర్డు ఇంజినీర్ల బృందం సీఎంకు వివరించింది. ఈ సందర్భంగా ఎక్కడ ఏ లోపం ఉందో చర్చించిన సీఎం.. లోపాన్ని సవరించటానికి అక్కడికక్కడే అధికారులకు సూచనలు చేశారు. పనుల్లో జాప్యం జరుగుతున్న చోట కారణాలు తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపారు. పనుల్లో నిర్లక్ష్యం వహించే వర్క్ ఏజన్సీలను మార్చాలని ఆదేశించారు.

ఎండకాలంనాటికి పనులన్నీ పూర్తికావాలి
గోదావరిలో తెలంగాణకు 950 టీఎంసీల నీటివాటా ఉంది. సమైక్య రాష్ట్రంలోనే ఇది ఖరారైంది. దీని ప్రకారమే మనం గోదావరిపై కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. కాళేశ్వరం ద్వారా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్, నల్లగొండ జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీరు అందించాలి. ఇదే లక్ష్యంతో ఆ ప్రాజెక్టు నిర్మిస్తున్నాం. ఈ ఎండకాలంలోనే పనులన్నీ పూర్తిచేసి, వర్షాకాలంలో ఈ ప్రాజెక్టు నుంచి నీళ్లు చెరువుల ద్వారా పొలాలకు చేరాలి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు, కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల పంపుహౌస్‌ల నిర్మాణం పూర్తికావాలి. ఎల్లంపల్లి, మిడ్‌మానేరు దాకా నీళ్లు రావాలి. మేడిగడ్డ నుంచి రోజూ రెండు టీఎంసీల చొప్పున నీరు తీసుకోవాలి. మూడు బరాజ్‌లద్వారా 36 టీఎంసీలు, ఎల్లంపల్లిలో 20 టీఎంసీల నీళ్లు నదిలోనే అందుబాటులో ఉంటాయి. వచ్చిన నీటిని వచ్చినట్టు పంపుచేసి చెరువులకు మళ్లించాలి.

ఎల్లంపల్లి దాకా వచ్చిన నీటిలో ఒక టీఎంసీని మిడ్‌మానేరు ద్వారా శ్రీరాంసాగర్ కాల్వలకు మళ్లించాలి. మరో టీఎంసీని మల్లన్నసాగర్‌వైపు మళ్లించాలి. మల్లన్నసాగర్ ద్వారా ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో నిర్మించే బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్‌కు తరలించాలి. మల్లన్నసాగర్ ద్వారానే హైదరాబాద్ మంచినీళ్ల కోసం నిర్మిస్తున్న 10 టీఎంసీల రిజర్వాయర్‌కు నీళ్లు పంపాలి. హల్దివాగు ద్వారా నిజాంసాగర్, ఘనపురం ఆయకట్టుకు సాగునీరు అందించాలి. గండిపేట, హిమాయత్‌సాగర్ చెరువులు నింపాలి. వాటిద్వారా క్రమం తప్పకుండా నీటిని విడుదలచేస్తూ మూసీనది మురికిని వదిలించాలి. మూసీ రివర్ ఫ్రంట్‌ను అహ్మదాబాద్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్‌లా అభివృద్ధి చేస్తాం. దానికీ గోదావరి నీళ్లు అందాలి. చివరికి మూసీ నది ద్వారా పాత నల్లగొండ జిల్లా పొలాలకు నీరు చేరాలి అని సీఎం కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాలను వివరించారు. ఈ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించి, అమలుచేయాలన్నారు.

ఉమ్మడి వరంగల్‌కు దేవాదుల ద్వారా నీరు
గోదావరి నదిపైనే నిర్మించిన దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తిస్థాయిలో సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇంద్రావతి నది గోదావరిలో కలిసిన తర్వాత తుపాకులగూడెం వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఆ నీటిని ఉపయోగించుకోవడానికి బరాజ్ కడుతున్నాం. ఏడాదికి 75 టీఎంసీలకు పైగా నీరు తీసుకునే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న డిజైన్లు, కాల్వలు, ఇతర నిర్మాణాలు పెద్దగా ఉపయోగపడేలా లేవు. మొత్తం పాత వరంగల్ జిల్లాకు దేవాదుల ద్వారా నీరు అందించాలి. పాఖాల, రామప్ప, గణపురం, లక్నవరం చెరువులను నింపాలి. తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక రిజర్వాయర్ నిర్మించి, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ తదితర నియోజకవర్గాలకు నీరివ్వాలి. దీనికోసం మొత్తం ప్రాజెక్టును రివ్యూ చేసి, కొత్త ప్రతిపాదనలు తయారుచేయాలి అని అధికారులను సీఎం ఆదేశించారు.

సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం సస్యశ్యామలం కావాలి
దుమ్ముగూడెం వద్ద నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలి. మే నెలలో కూడా దుమ్ముగూడెం వద్ద ఆ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటితో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు నీరివ్వాలి. బయ్యారం వరకు నీటిని తీసుకురావాలి. ఎస్సారెస్పీ ఆయకట్టుకూ నీరు అందాలి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన నిర్మాణాలు చేపట్టాలి అని సీఎం చెప్పారు.

శరవేగంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం
ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి (ప్రస్తుత వికారాబాద్) జిల్లాలకు సాగునీరు అందివ్వటానికి ఉద్దేశించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వేగం పెరుగాలి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయడంద్వారా మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల్లో ప్రభుత్వంపై ఎంతో నమ్మకం వచ్చింది. పాలమూరు ప్రాజెక్టును పూర్తిచేసి, మహబూబ్‌నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయాలి. శ్రీశైలం సోర్సు నుంచి 70 టీఎంసీల వరకు తీసుకునే అవకాశమున్నది. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు ఎంతో మేలుచేసే ఈ ప్రాజెక్టును ఆ జిల్లాకు చెందిన రాజకీయ నాయకులే కోర్టుల్లో కేసులువేసి, అడ్డుకున్నారు. దానివల్లే కొంత జాప్యం జరిగింది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నంత వేగంగా ఇక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం సాగాలి. అవసరమైన నిధులను ఈ బడ్జెట్లోనే కేటాయిస్తాం అని ముఖ్యమంత్రి చెప్పారు.

రాజకీయ సుస్థిరత ఉంది.. నిధులకు కొరతలేదు తెలంగాణ కోసం ప్రజలు దశాబ్దాల తరబడి పోరాడారు. ప్రాణాలు కూడా అర్పించారు. తెలంగాణ సాధించుకున్నారు. తెలంగాణ వస్తే సాగునీరు వస్తుందని ఆశపడ్డారు. మొదటి టర్మ్‌లో సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరించాం. అన్నీ పురోగతిలో ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై టీఆర్‌ఎస్ ప్రభుత్వానికున్న విశ్వసనీయతను ప్రజలు గుర్తించారు. ఈ ప్రభుత్వమే ప్రాజెక్టులు పూర్తిచేస్తుందని నమ్మారు. 75% ఇదే కారణంతో టీఆర్‌ఎస్‌కు మళ్లీ ఓటేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి, సాగునీరు అందించాం. వలసలు వాపస్ వచ్చాయి. ఈ పరిస్థితి చూసే అక్కడి ప్రజలు 13 సీట్లలో టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. ఈ టర్మ్‌లో ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి, తెలంగాణలో కోటి ఎకరాల్లో నీరు పారించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఐదేండ్ల సమయం, రాజకీయ సుస్థిరత ఉన్నాయి. నిధుల కొరతలేదు. రైతులకు సాగునీరు అందివ్వడమే ధ్యేయంగా పనిచేయడానికి పునరంకితమవుదాం అని సీఎం పిలుపునిచ్చారు.

ముందుగా చెరువులు నింపాలి
ప్రాజెక్టులద్వారా వచ్చే నీటితో ముందుగా చెరువులు నింపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను ఉపయోగించుకుని చెరువులను నింపే చర్యలు చేపట్టాలన్నారు. సాగునీటితోపాటు, తాగునీటికి ఎంత నీరు అవసరమవుతుందో, భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని అంచనాలు తయారుచేసి, నీటి కేటాయింపు జరుపాలని కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్, నీటిపారుదలశాఖ ఈఎన్సీలు మురళీధర్‌రావు, అనిల్‌కుమార్, హరిరాం, ఓఎస్డీ శ్రీధర్‌రావుదేశ్‌పాండే, సలహాదారు పెంటారెడ్డి, సీఈలు వెంకటేశ్వర్లు, జీ శ్రీనివాసరెడ్డి, బీ శంకర్, కే బంగారయ్య, వీ సుధాకర్, వీ నర్సింహ, ఆర్ మధుసూదన్‌రావు, వీ రమేశ్, టీ ఖగేందర్, రిటైర్డు ఇంజినీర్లు శ్యాంప్రసాద్‌రెడ్డి, చంద్రమౌళి, వెంకటరామారావు, వేణుగోపాలరావు, రాంరెడ్డి, దామోదర్‌రెడ్డి, వెంకటేశం, సత్తిరెడ్డి, రమణానాయక్, ఎస్ ముత్యంరెడ్డి, జగదీశ్వర్, జియావుద్దీన్, ఇంద్రసేనారెడ్డి, కెప్టెన్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నిసార్లు కోరినా మోదీ డబ్బులివ్వలేదు
తెలంగాణ ప్రాంతం వెనుకబడింది. సాగునీటిరంగంలో వివక్షకు గురైంది. అందుకోసమే ఇక్కడి ప్రజలు పోరాటం చేశారు. కాబట్టి తెలంగాణలో ఓ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించండి అని ప్రధాని నరేంద్రమోదీకి అనేకసార్లు చెప్పాను. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.20-30 వేల కోట్లిచ్చి సాయపడండి అని వేడుకున్నా. అయినా సరే మోదీ డబ్బులు ఇవ్వలేదు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరిస్తున్న తీరును చూసి దేశమంతా మెచ్చుకున్నది. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్‌సింగ్ వరంగల్ జిల్లా నెక్కొండలో చెరువుగట్టుపై పుట్టినరోజు చేసుకుని మిషన్ కాకతీయను మెచ్చుకున్నారు. దేశమంతా ప్రశంసించింది. నీతిఆయోగ్ కూడా మిషన్ కాకతీయ గొప్ప పథకమని చెప్పింది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలకు రూ.24 వేల కోట్లివ్వాలని కేంద్రప్రభుత్వానికి నీతిఆయోగ్ సిఫారసుచేసింది. అయినా.. మోదీ ప్రభుత్వం 24 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఈసారి కేంద్రంలో మనది క్రియాశీల పాత్ర ఉంటుంది. కావాల్సిన నిధులు రాబట్టుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మన రాష్ట్ర ఆదాయాభివృద్ధి రేటు కూడా బాగుంది. మొదటి నాలుగేండ్లలో 17.17% వృద్ధిరేటుంటే, ఈ సంవత్సరం ఇప్పటివరకు 29.17% వృద్ధిరేటు నమోదైంది. నిధులకు కొరతలేదు. ప్రాజెక్టులు కట్టుకోవడమే మన లక్ష్యం అని సీఎం చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.